Share News

కిడ్నీవ్యాధి వ్యాప్తికి కారణాలేమిటి?

ABN , Publish Date - Jul 27 , 2026 | 01:03 AM

NITI Aayog medical team visits Uddanam ఉద్దానంలో కిడ్నీవ్యాధి వ్యాప్తిగల కారణాల అన్వేషణపై నీతిఅయోగ్‌ వైద్యబృందం ప్రత్యేక దృష్టి సారించింది. నీతిఅయోగ్‌ వైద్యబృందం సభ్యుడు డాక్టర్‌ శ్రీనివాస్‌, ఎయిమ్స్‌ నెఫ్రాలజీ విభాగం అధిపతి డాక్టర్‌ దిపాంకర్‌, నిమ్స్‌ నెఫ్రాలజీ అధిపతి డాక్టర్‌ రాజు తదితరులు ఆదివారం పలాస, సోంపేట, కవిటి మండలాల్లో పర్యటించారు. కిడ్నీవ్యాధి వ్యాప్తికి గల కారణాలు, రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు.

కిడ్నీవ్యాధి వ్యాప్తికి కారణాలేమిటి?
బల్లిపుట్టుగలో గ్రామస్థులతో మాట్లాడుతున్న నీతిఅయోగ్‌ వైద్యబంృందం సభ్యులు

  • వంశపారంపర్యంగా వస్తుందా?

  • నీతిఅయోగ్‌ వైద్యబృందం ఆరా

  • ఉద్దానం ప్రాంతంలో పర్యటన

  • నివారణ, చికిత్స, పరిశోధనలు విస్తృతం చేసే దిశగా చర్యలు

  • కవిటి/ పలాస/ సోంపేట, జూలై 26(ఆంధ్రజ్యోతి):

  • కిడ్నీవ్యాధి ఎలా వచ్చిందో తెలియదు. వ్యవసాయ పనులు చేసేవాడిని. ఒక్కసారిగా ఆకలి తగ్గిపోయింది. వైద్యుడిని కలిస్తే పరీక్షలు చేశారు. కిడ్నీ వ్యాధి ఉందని గుర్తించారు. డయాలసిస్‌ చేయించుకోవాలని చెప్పారు. కవిటి ఆస్పత్రిలో రెండు నెలలుగా డయాలసిస్‌ చేయించుకుంటున్నాను. నా ఇంట్లో, బంధువుల్లో ఎవరికీ ఈ వ్యాధి గతంలో వచ్చిన దాఖలాలు లేవు.

  • - బృందావన్‌, కిడ్నీవ్యాధి బాధితుడు, బల్లిపుట్టుగ

  • కొన్నాళ్ల కిందట కడుపులో ఎడమవైపు నొప్పిగా ఉంటే డాక్టర్‌కు చూపించాను. పరీక్షలు చేసి కిడ్నీలో క్రియేటిన్‌ అధికంగా ఉందని చెప్పారు. మా తండ్రికి 60ఏళ్లలో కిడ్నీ వ్యాధి వచ్చింది. ఇప్పుడు మా అమ్మ సరస్వతి బిసాయికి కూడా ఈ వ్యాధి సోకింది. ఆరేళ్లుగా డయాలసిస్‌ చేయించుకుంటున్నాం. మా అన్నదమ్ములకు ఎటువంటి ఇబ్బంది లేదు.

  • - జయసేన్‌ బిసాయి, కిడ్నీవ్యాధి బాధితుడు, బల్లిపుట్టుగ

  • ఉద్దానంలో కిడ్నీవ్యాధి వ్యాప్తిగల కారణాల అన్వేషణపై నీతిఅయోగ్‌ వైద్యబృందం ప్రత్యేక దృష్టి సారించింది. నీతిఅయోగ్‌ వైద్యబృందం సభ్యుడు డాక్టర్‌ శ్రీనివాస్‌, ఎయిమ్స్‌ నెఫ్రాలజీ విభాగం అధిపతి డాక్టర్‌ దిపాంకర్‌, నిమ్స్‌ నెఫ్రాలజీ అధిపతి డాక్టర్‌ రాజు తదితరులు ఆదివారం పలాస, సోంపేట, కవిటి మండలాల్లో పర్యటించారు. కిడ్నీవ్యాధి వ్యాప్తికి గల కారణాలు, రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. కవిటి మండలం బల్లిపుట్టుగలో కిడ్నీ బాధితులతో మాట్లాడి వంశపారం పర్యంగా ఈ వ్యాధి వస్తుందా.. ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. ఒక్కో కుటుంబానికి ఒక్కో రకమైన కారణాలున్నాయని గుర్తించారు. ఆహారపు ఆలవాట్లు, ఎండలో పనిచేసే సమయంలో తీసుకునే నీటిశాతం ఎలా ఉందని ప్రశ్నించారు. నెప్రాలజిస్ట్‌ భూషణ్‌ మాట్లాడుతూ శ్రీకాకుళం, ప్రకాశం, ఒంగోలు ప్రాంతాల్లో కిడ్నీ రోగులు అధికంగా ఉన్నట్టు గుర్తించామన్నారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ మాట్లాడుతూ ‘ఉద్దానంలో రక్తనమూనాలు సేకరించి రోగులను ముందస్తుగా గుర్తించాం. అందుకు తగిన విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎన్టీఆర్‌ సుజలధార పథకం ద్వారా సురక్షిత తాగునీటిని అందించాం. అమెరికా, కెనడాకు చెందిన యూనివర్సిటీల బృందంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పరిశోధనలు చేయించింది. రక్త నమూనాలతోపాటు గాలి, నీరు, పురుగుమందులు, వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేశార’ని తెలిపారు. డయాలసిస్‌ కేంద్రాల ఏర్పాటు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

  • బాధితుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకోండి

  • ‘కిడ్నీ రోగులతో నిరంతరం ఫోన్‌లో సంప్రదించాలి. వారి ఆరోగ్యపరిస్థితి తెలుసుకొని వ్యాధి తగ్గేవరకూ మార్గదర్శకులుగా ఉండాల’ని వైద్యాధికారులకు నీతిఅయోగ్‌కు చెందిన వైద్యాధికారులు డాక్టర్‌ శ్రీనివాస్‌, ఎయిమ్స్‌ నెఫ్రాలజీ విభాగం అధిపతి డాక్టర్‌ దిపాంకర్‌, నిమ్స్‌ నెఫ్రాలజీ అధిపతి డాక్టర్‌ రాజు కోరారు. ఆదివారం పలాసలోని కిడ్నీపరిశోధన కేంద్రం-200 పడకల ఆసుపత్రిని నీతిఅయోగ్‌ బృందం సభ్యులు పరిశీలించారు. ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలసి వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రి నిర్మించిన నుంచి ఇప్పటివరకూ ఎన్నికేసులు ఇక్కడ వచ్చాయని, ఎంతమంది వ్యాధి నుంచి బయట పడ్డారని, ఎన్ని మరణాలు సంభవించాయని ప్రశ్నించారు. ఆసుపత్రిలో సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు వైద్యాధికారులతో మాట్లాడుతూ ఆధునిక వైద్యసదుపాయాలు, పరికరాలు అందించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. చికిత్స అందించడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని, ఇక్కడకు వచ్చే ప్రతిరోగి బాగుపడి ఇంటికి వెళ్లే విధంగా వైద్యం అందించాలని సూచించారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల నివారణ, చికిత్స, పరిశోధనలు మరింగా విస్తృతం చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ అత్యుమమైన వైద్యసేవలు కిడ్ని ఆసుపత్రిలో లభిస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించిందని, నిపుణుల బృందం సూచన మేరకు ఆసుపత్రిని మరింతగా అభివృద్ధి చేసి కిడ్ని బాధితులకు ఆధునిక వైద్యం అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే కిడ్నీ ఆసుపత్రిలో గ్లో సంస్థ ద్వారా డయాలసిస్‌ యూనిట్లు అందించామని, అవసరమైతే అదనంగా యూనిట్లు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

  • ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకం కలిగించేదెలా

  • ‘కిడ్నీ వ్యాధి బాధితులు ఎక్కువగా ప్రైవేటు ఆస్పత్రులుకు వెళ్తున్నారు. వారికి ప్రభుత్వాసుపత్రిపై నమ్మకం కలగాలంటే ఏం చేయాలి’ అంటూ సోంపేటలో వైద్యులను నీతి అయోగ్‌ సభ్యుడు ఎం.శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఆదివారం సోంపేట సీహెచ్‌సీలో వార్డులను ఆయన పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. అలాగే ఆస్పత్రికి రోగులు ఎందుకు తక్కువగా వస్తున్నారని వైద్యులను ప్రశ్నించారు. ఆస్పత్రిలో సమస్యలపై ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ‘సోంపేట 30 పడకల ఆస్పత్రిని 50 పడకలుగా అప్‌గ్రేడ్‌ చేయాలి. మందులు అందుబాటులో ఉంచాలి. రెగ్యులర్‌ నెఫ్రాలజిస్ట్‌ను నియమించాలి. లేదంటే వైద్యకళాశాలలో నాల్గో సంవత్సరం చదువుతున్న వారిని వారానికోసారైనా ఆస్పత్రిని సందర్శించేలా చూడాలి. ప్రైవేటు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డయాలసిస్‌ కేంద్రం 24 గంటలు పనిచేసేలా చర్యలు చేపట్టాల’ని వైద్యులు వెంకటేష్‌, జోగినాయుడు, ప్రదీప్‌, నవీన్‌కుమార్‌ కోరారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్‌అహ్మద్‌ఖాన్‌, డీసీహెచ్‌ఎస్‌ విజయలక్ష్మి, పలాస కిడ్నీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శరత్‌జోత్స్న, పలాస ఆర్డీవో అప్పలరాజు, తహసీల్దార్లు కళ్యాణ్‌చక్రవర్తి, అప్పలస్వామి, మాణిక్యపురం పీహెచ్‌సి సిబ్బంది, ఆంధ్రా యూనివర్సిటీ వైద్యబృందం పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2026 | 01:03 AM