Share News

జీడి ఆధారిత పరిశ్రమలేవీ?

ABN , Publish Date - Apr 12 , 2026 | 11:09 PM

జిల్లాలో జీడిపండ్ల ఆధారిత పరిశ్రమలు కానరావడం లేదు. కేవలం జీడి పప్పు ప్రాసెసింగ్‌ పరిశ్రమలే ఉన్నాయి.

జీడి ఆధారిత పరిశ్రమలేవీ?
ఉద్దానం ప్రాంతంలో పండే జీడిపండ్లు

- ఏర్పాటకు ఆసక్తిచూపని వ్యాపారులు

- అధికారులు అవగాహన కల్పిస్తున్నా ఫలితం శూన్యం

- వృథాగా మారుతున్న పండ్లు

పలాస, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జీడిపండ్ల ఆధారిత పరిశ్రమలు కానరావడం లేదు. కేవలం జీడి పప్పు ప్రాసెసింగ్‌ పరిశ్రమలే ఉన్నాయి. దీంతో ఎన్నో పోషకాలు కలిగిన జీడిపండు వృథాగా మారుతోంది. జిల్లాలో 32 వేల హెక్టార్లలో జీడి పంట సాగవుతోంది. మొత్తం పండ్లను సేకరిస్తే ఐదు పరిశ్రమల వరకూ ముడిసరుకు సరిపోతుంది. దీనిపై అవగాహన లేకపోవడంతో వ్యాపారులు ముందుకు రాలేకపోతున్నారు. ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో రెండేళ్ల కిందట అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జీడి పండ్లతో జ్యూస్‌తో పాటు షోడాలు కూడా చేయవచ్చని అధికారులు అవగాహన కల్పించారు. ఈ మేరకు ఆధారిత పరిశ్రమలను పరిచయం చేశారు. అయితే, సరైన గైడెన్స్‌ లేకపోవడంతో ఆ ప్రతిపాదనలు ముందుకు వెళ్లలేకపోయాయి. ఈ పరిశ్రమలను స్థాపించేందుకు అనువైన పరిస్థితి జిల్లాలో ఉన్నా పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు.

ఇలా వినియోగించవచ్చు..

జీడి పండు రంగు చూడడానికి ముచ్చటగా ఉన్నా ఆ వాసన మాత్రం ఘాటుగా ఉంటుంది. ఇందులో నిమ్మజాతుల్లో లభించే సి-విటమిన్‌ అదనంగా ఉంటుందని ప్రయోగాత్మకంగా నిరూపితమైంది. జీడి పండ్లను పిక్క నుంచి వేరు చేసిన తరువాత వాటిని మంచినీటిలో మూడునాలుగు సార్లు బాగా కడిగి ప్రాసెసింగ్‌కు వినియోగించాలి. స్టీల్‌, ప్లాస్టిక్‌ పాత్రల్లో మాత్రమే దీన్ని నిల్వ చేయాల్సి ఉంటుంది. ఈ పండ్లను సేకరించిన తరువాత 15-17 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచినట్లయితే 15 రోజుల వరకూ పాడవకుండా ఉంటాయి. దీని గుజ్జును అతి శీతల దశలో నిల్వ చేస్తే ఏడాది పొడవునా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. జీడి పండ్ల నుంచి గుజ్జు తీసుకొని వాటి నుంచి రసం తీసుకోవాలి. పండు బట్టి 50 శాతం వరకూ రసం ఇందులో వస్తుంది. ఇందులో ఘాటైన పదార్ధాన్ని వెలికితీయడానికి కిలోకు రెండు గ్రాముల సగ్గుబియ్యం పొడిని సరిపడా చల్లని నీటిలో కరిగించాలి. తరువాత వాటిని వేడిచేసి అందులో కలియబెట్టాలి. 3 గంటల తరువాత పైకి తేలిన రసాన్ని తీసుకొని జ్యూస్‌, స్క్వాష్‌, సిరప్‌ల తయారీకి వినియోగించవచ్చు. కొత్తగా ఏర్పాటవుతున్న పారిశ్రామికవాడలో జీడి పండ్ల ఆధారిత పరిశ్రమలను స్థాపించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తే వ్యాపారులు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

అవగాహన కల్పించాలి

జీడి పండ్ల ఆధారిత పరిశ్రమలపై వ్యాపారులకు అవగాహన కల్పించాలి. జీడి పండు వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. ప్రజలకు కూడా అవగాహన కల్పించాలి. పరిశ్రమలు పెట్టిన తరువాత మార్కెటింగ్‌ లేకపోతే ఇబ్బందులు పడేది వ్యాపారులే. ఔత్సాహిక వ్యాపారులకు ప్రభుత్వం తగు విధంగా ప్రోత్సాహం అందించాలి.

-మల్లా రామేశ్వరరావు, పారిశ్రామికవాడ వ్యాపారసంఘ అధ్యక్షుడు, పలాస

Updated Date - Apr 12 , 2026 | 11:09 PM