ఆ రూ.10 కోట్ల మాటేంటి?
ABN , Publish Date - Feb 03 , 2026 | 11:29 PM
Collection in the name of 'OTS' ఉగాది నాటికి కొత్త ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇటీవల ‘హౌస్‌ఫర్ ఆల్’ పేరిట అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. మరోవైపు వైసీపీ హయాంలో మంజూరైన ఇళ్లను పూర్తిచేసే పనిలో పడింది. ఉగాది నాటికి సామూహిక గృహప్రవేశాలు చేయాలని నిర్ణయించింది. కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో ‘ఓటీఎస్’ పేరిట వసూలు చేసిన మొత్తానికిగాను ఇంతవరకూ మోక్షం లేదు.
వైసీపీ హయాంలో ‘ఓటీఎస్’ పేరిట వసూలు
జగనన్న శాశ్వత గృహహక్కు అంటూ హడావుడి
ఇప్పటికీ పత్రాలు లేవు.. నగదూ లేదు
ఆందోళనలో ఇళ్ల నిర్మాణదారులు
ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): ఉగాది నాటికి కొత్త ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇటీవల ‘హౌస్‌ఫర్ ఆల్’ పేరిట అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. మరోవైపు వైసీపీ హయాంలో మంజూరైన ఇళ్లను పూర్తిచేసే పనిలో పడింది. ఉగాది నాటికి సామూహిక గృహప్రవేశాలు చేయాలని నిర్ణయించింది. కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో ‘ఓటీఎస్’ పేరిట వసూలు చేసిన మొత్తానికిగాను ఇంతవరకూ మోక్షం లేదు. జగనన్న శాశ్వత గృహహక్కు పథకం కింద అప్పట్లో జిల్లావ్యాప్తంగా రూ.10కోట్లు వసూలు చేయగా.. ఇప్పటివరకూ అతీగతీ లేదని ఆయా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత గృహహక్కు పత్రాలు అందజేయలేదని వాపోతున్నారు.
ఇదీ పరిస్థితి..
జగనన్న శాశ్వతగృహహక్కు పథకం కింద వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నగదు వసూలు చేసేంది. ఎన్టీఆర్ హయాం నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం వరకూ గృహ నిర్మాణ పథకంలో భాగంగా దశాబ్దాల కిందట నిర్మించిన ఇళ్లకు కొలతలు తీసి సంపూర్ణ గృహ హక్కు కల్పిస్తామని చెప్పింది. ఇందుకోసం నాలుగు కేటగిరీలుగా విభజించి ఓటీఎస్(వన్‌టైం సెటిల్‌మెంట్) విధానం ప్రవేశపెట్టింది.
కేటగిరీ -ఏ కింద లబ్ధిదారుడు గృహనిర్మాణ సంస్థ నుంచి అప్పు తీసుకొని మృతిచెందితే.. వారి వారసులకు పట్టా అందిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు ఉంటే రూ.10వేలు, మునిసిపాలిటీల్లో రూ.15వేలు, కార్పొరేషన్‌లో రూ.20వేలు చొప్పున వసూలు చేశారు.
కేటగిరీ- బీకి సంబంధించి రుణం తీసుకున్న వ్యక్తి నుంచి ఇతరులు ఆ ఇంటిని కొనుగోలు చేసినా క్రమబద్ధీకరణకు అవకాశమిచ్చారు. ఇందుకుగాను గ్రామీణ ప్రాంతాల్లో రూ.20వేలు, మునిసిపాలిటీల్లో రూ.30వేలు, కార్పొరేషన్ పరిధిలో రూ.40 వేలు వసూలు చేపట్టారు.
కేటగిరీ -సీకి సంబంధించి ప్రభుత్వ రుణం పొందకుండా.. సొంతంగా ఇంటిని నిర్మించుకున్నవారి నుంచి రూ.10వేలు చొప్పున వసూలు చేశారు.
కేటగిరీ -డీ కింద ప్రభుత్వం పట్టా ఇచ్చిన తరువాత.. దానిని అమ్ముకుంటే కొనుగోలు చేసిన వారి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు, మునిసిపాలీటీల్లో రూ.15వేలు, కార్పొరేషన్‌లో రూ.20వేల వంతున వసూలు చేశారు.
జిల్లాలో 1983-2021 మధ్య 4లక్షల మంది లబ్ధిదారులు ఉన్నట్టు అప్పట్లో గుర్తించారు. వీరి వద్ద నుంచి రూ.120కోట్లు వసూలు చేయాలని నిర్ణయించారు. కానీ జిల్లావ్యాప్తంగా రూ.10కోట్లు వసూలు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
బలవంతపు వసూలు
జిల్లావ్యాప్తంగా అధికారులు, సచివాలయ సిబ్బంది అప్పట్లో ఓటీఎస్ పేరిట బలవంతంగా వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. పేదల పింఛన్లు తొలగిస్తామని, సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని అప్పట్లో బెదిరించారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో ముడిపెట్టారు. రుణాలు తీసుకున్నవారు తప్పకుండా రిజిస్ర్టేషన్ చేసుకోవాల్సిందేనని ఒత్తిడి పెంచారు. డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నవారితో రుణాలు ఇప్పించి మరీ రిజిస్ర్టేషన్లు చేయించారు. కానీ చాలామందికి ఇప్పటికీ డాక్యుమెంట్లు ఇవ్వలేదు. మరికొందరికి ఇచ్చినా అందులో వివరాలు తప్పుగా నమోదయ్యాయి. అప్పట్లో టార్గెట్లు పూర్తిచేయని సచివాలయ సిబ్బందిపై వేటు కూడా వేసిన సందర్భాలున్నాయి. ఇంత చేసినా లబ్ధిదారులకు మాత్రం న్యాయం చేయలేకపోయారు.
ఇప్పుడు ఆయా బాధితులంతా తమకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మండల, జడ్పీలోని నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమాల్లో వినతిపత్రాలు అందజేశారు. తమ డబ్బులైనా తిరిగి ఇవ్వాలని.. లేదంటే ధ్రువపత్రాలైనా అందించాలని కోరుతున్నారు.