ఉపాధి కోసం వెళ్లి.. ఇరాన్‌లో చిక్కుకుని!
ABN , Publish Date - Jun 17 , 2026 | 12:11 AM
The struggles of young people in Iran ఆర్థిక కష్టాలు తీరతాయనుకున్నారు. ఇరాన్‌కు వెళ్లిపోయారు. అక్కడి నౌకల్లో చిక్కుకుని పోయారు. నాలుగు నెలలుగా జీతాల్లేక ఆకలితో అలమటిస్తున్నారు.
ముగ్గురు సిక్కోలు యువకుల అవస్థలు
నాలుగు నెలలుగా వేతనాల్లేక అల్లాడుతున్న వైనం
బాధితు కుటుంబాల్లో తీవ్రమైన ఆందోళన
స్వదేశానికి రప్పించాలని ప్రభుత్వానికి వేడుకోలు
శ్రీకాకుళం, జూన్ 16(ఆంధ్రజ్యోతి): ఆర్థిక కష్టాలు తీరతాయనుకున్నారు. ఇరాన్‌కు వెళ్లిపోయారు. అక్కడి నౌకల్లో చిక్కుకుని పోయారు. నాలుగు నెలలుగా జీతాల్లేక ఆకలితో అలమటిస్తున్నారు. సంతబొమ్మాళి, ఆమదాలవలస, గార మండలాలకు చెందిన ముగ్గురు యువకులు ఇరాన్ దేశంలోని హర్మోజ్ జలసంధి సమీపంలో వేర్వేరు నౌకల్లో పడుతున్న ఇబ్బందులు వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
జీతాల్లేవు.. మరమ్మతులు లేవు
సంతబొమ్మాళి మండలం ఎస్.బి కొత్తూరు గ్రామానికి చెందిన వంకల రవి పది నెలల కిందట ముంబైలోని ఒక ప్రైవేటు ఏజెన్సీ ద్వారా సీమన్‌గా చేరి ఇరాన్ వెళ్లాడు. నాలుగు నెలల క్రితం అతడు పనిచేస్తున్న షిప్ ఇంజన్ పాడైపోవడంతో ఇరాన్ తీరంలో నిలిచిపోయింది. నౌక యజమాని దానికి మరమ్మతులు చేయించకపోగా, నాలుగు నెలలుగా సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వడం లేదు. దీంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రవి ఇటీవల తన తల్లిదండ్రులు గోపాలరావు, కృష్ణమ్మకు ఫోన్ ద్వారా తెలిపాడు. కన్నకొడుకు దీనస్థితి తలుచుకుని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఆకలి మంటల్లో దుర్గాప్రసాద్..
ఆమదాలవలస మున్సిపాలిటీ 18వ వార్డు కొత్తకండ్రపేట గ్రామానికి చెందిన నాగుల దుర్గాప్రసాద్ (22) అనే యువకుడి పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఏడాది క్రితం ఒక ఏజెంట్ ద్వారా సీమెన్‌గా ఇరాన్ వెళ్లిన దుర్గాప్రసాద్.. అక్కడ ఏజెంట్ చేతిలో మోసపోయాడు. ప్రస్తుతం హర్మోజ్ జలసంధి సమీపంలోని ఓ నౌకలో ఆకలితో అలమటిస్తున్నాడు. ఈ విషయాన్ని అతడు ఇటీవలే కుటుంబ సభ్యులకు మెసేజ్ ద్వారా తెలియజేశాడు. చేపల వేటపై ఆధారపడే కండ్ర కులానికి చెందిన ఈ యువకుడి తండ్రి సూర్యనారాయణ చిన్నతనంలోనే కుటుంబాన్ని విడిచి వెళ్లిపోయాడు. అన్న మౌళి ఆటో నడుపుతూ ఇల్లు గడుపుతుండగా, తల్లి భూదేవమ్మ గుండె సంబంధిత వ్యాధితో మంచాన పడింది. కుటుంబానికి ఆధారమవ్వాల్సిన కొడుకు పరాయి దేశంలో అల్లాడుతుండడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరవుతోంది.
వీడియో కాల్‌తో తగ్గిన ఆందోళన..
గార మండలం శ్రీకూర్మం పంచాయతీ పరపతివానిపేట గ్రామానికి చెందిన పరపతి సింహాచలం కుమారుడు రమణ (18) ఐటీఐ పూర్తి చేసి, పది నెలల కిందట సీమన్‌గా ఇరాన్ వెళ్లాడు. అయితే అక్కడ నెలకొన్న యుద్ధ వాతావరణం, మీడియాలో వస్తున్న కథనాలు చూసి రమణ కుటుంబ సభ్యులు కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో పది రోజుల క్రితం రమణ అక్కడి నుంచే కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేశాడు. తాను క్షేమంగా ఉన్నానని, తన గురించి ఎలాంటి బెంగ పెట్టుకోవద్దని ధైర్యం చెప్పడంతో తండ్రి సింహాచలం సహా కుటుంబ సభ్యులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
ప్రభుత్వాలు చొరవ చూపాలి
పరాయి దేశంలో దగాపడి, నౌకల్లో చిక్కుకుని నానా అవస్థలు పడుతున్న తమ పిల్లలను సురక్షితంగా భారతదేశానికి రప్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చొరవ చూపాలని బాధిత కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే కేంద్రపౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చొరవ చూపి ఇరాన్‌లో చిక్కుకున్న వారిని క్షేమంగా స్వదేశానికి తీసుకురావాలని విదేశాంగ మంత్రికి తెలియజేశారు.