నారాయణరావును స్వాగతిస్తున్నాం
ABN , Publish Date - Mar 31 , 2026 | 12:41 AM
Maoist leader 'Chelluru' joins the mainstream of public life దేశంలో ఎక్కడ ఎన్‌కౌంటర్ జరిగినా ఇంటిలో బిక్కుబిక్కుమంటూ గడిపేవాళ్లం. ఎప్పుడు ఎటువంటి వార్త వస్తుందో అన్న ఆందోళన ఉండేది. సోమవారం సాయంత్రం విజయవాడలో డీజీపీ ఎదుట తన తమ్ముడు లొంగిపోయాడని, జనజీవన స్రవంతిలో కలిశాడనే సమాచారం తెలిసి ఎంతో ఆనందపడుతున్నామని.. మావోయిస్టు నేత చెల్లూరు నారాయణరావు పెద్దన్నయ్య చెల్లూరు సింహాచలం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టు నేత ‘చెల్లూరు’
ఎన్‌కౌంటర్ అంటే.. బిక్కుబిక్కుమనేవాళ్లం
తమ్ముడు లొంగుబాటుతో ఇక ఆ బాధలు ఉండవు
వ్యవసాయం నేర్పిస్తామన్న సోదరుడు సింహాచలం
బాతుపురం గ్రామస్థుల్లోనూ ఆనందం
పలాస/ వజ్రపుకొత్తూరు, మార్చి 30(ఆంధ్రజ్యోతి):
దేశంలో ఎక్కడ ఎన్‌కౌంటర్ జరిగినా ఇంటిలో బిక్కుబిక్కుమంటూ గడిపేవాళ్లం. ఎప్పుడు ఎటువంటి వార్త వస్తుందో అన్న ఆందోళన ఉండేది. సోమవారం సాయంత్రం విజయవాడలో డీజీపీ ఎదుట తన తమ్ముడు లొంగిపోయాడని, జనజీవన స్రవంతిలో కలిశాడనే సమాచారం తెలిసి ఎంతో ఆనందపడుతున్నామని.. మావోయిస్టు నేత చెల్లూరు నారాయణరావు పెద్దన్నయ్య చెల్లూరు సింహాచలం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఇక తమ్ముడి కోసం తమ ఇంట్లో ఆందోళన ఉండదని చెప్పారు. ‘1989-1990 సంవత్సరం మధ్యలో నారాయణరావు ఉద్యమ బాట పట్టాడు. అప్పటి నుంచి అడవికే అంకితమై వివిధ పోరాటాల్లో పాల్గొన్నాడు. 15 ఏళ్ల కిందట గుర్తుపట్టలేని స్థితిలో ఆయన్ను చూశాను. మళ్లీ వస్తానని చెబుతూ వెళ్లిపోయి ప్రస్తుతం జనజీవనంలోకి వచ్చాడు. నారాయణరావు భార్య కుందనాలు.. కొన్నేళ్ల కిందట ఎన్‌కౌంటర్‌లో మృతి చెందింది. మాకు మరో సోదరుడు భూచంద్రరావు ఉన్నారు. మేమంతా ఉమ్మడి వ్యవసాయం చేసుకుని బతుకుతున్నాం. మాకు ఉన్న ఎకరా జీడితోటలో నారాయణరావుకు కూడా వ్యవసాయం నేర్పించి.. ఇక్కడే ఉండమని చెబుతాం. ఆయనకు మా ఇంట్లో పూర్తి స్వేచ్ఛ ఉంటుంద’ని సింహాచలం తెలిపారు.
ఆనందంలో బాతుపురం:
కొద్ది నెలల క్రితం టెక్ శంకర్ మృతి చెందిన తర్వాత నారాయణరావు ఒక్కరే మావోయిస్టు ఉద్యమంలో మిగిలారు. ఆయన కూడా సజీవంగా వస్తాడని గ్రామస్థులు ఎవరూ ఊహించలేదు. జనవరిలో ఇక్కడకు వచ్చినట్లు సమాచారం. అయితే పాతతరం వారు నారాయణరావును గుర్తించారే తప్ప.. మిగిలిన వారు ఎవరూ ఆయన్ను పసిగట్టలేకపోయారు. పోలీసు కూంబింగ్‌లు జరపడంతో మళ్లీ ఆయన అడవిబాట పట్టారు. అయితే వారం రోజుల నుంచి నారాయణరావు పోలీసులకు లొంగిపోతున్నట్లు ప్రచారం సాగింది. అనూహ్యంగా సోమవారం నారాయణరావు డీజీపీ ఎదుట జనజీవన స్రవంతిలో కలిసిపోయినట్లు వార్తలు రావడంతో వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మావోయిస్టు ఉద్యమంలో బాతుపురానికి ప్రత్యేక స్థానం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి మావోయిస్టులపై నిషేధం తాత్కాలికంగా ఎత్తివేయడంతోపాటు వారితో చర్చలు జరిపారు. ఆ రోజుల్లో బాతుపురంలో భారీ స్థూపాన్ని నిర్మించి ఆవిష్కరించారు. మావోయిస్టు బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. గద్దర్, వంగపండు ప్రసాదరావు, వరవరరావు, కళ్యాణరావు వంటి అగ్రనాయకులతో పాటు మావోయిస్టులు కూడా ఆ సభకు హాజరై ప్రజలకు ఉత్తేజ పరిచిన విషయం విధితమే. అనంతరం జరిగిన పరిణామాల్లో అనేక మంది మావోయిస్టులు ఉద్యమంలో అసువులు బాశారు. చివరకు నారాయణరావు ఒక్కరే మిగిలారు. కమాండెంట్ స్థాయికి ఎదిగిన ఆయన జనజీవనశ్రవంతిలో కలిసిపోవడాన్ని గ్రామస్థులు స్వాగతిస్తున్నారు. మాలో ఒకరిగా ఆయన్ను చూస్తామని స్పష్టం చేస్తున్నారు.
ప్రభుత్వ పనితీరుపై నమ్మకం
చెల్లూరి నారాయణరావు జనజీవన స్రవంతిలో కలసిపోవడం శుభపరిణామం. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఈ వ్యవహారంతో నమ్మకం కులుగుతుంది. గ్రామంలో ఆయనకు అన్నివిధాలా సహాయం చేస్తాం.
- తామాడ ప్రదీప్, అగ్నికుల క్షత్రియసంఘం అధ్యక్షుడు, బాతుపురం..
చూసినా.. పసిగట్టలేకపోయాను
మూడు నెలల కిందట నారాయణరావును రాజాం మంచినీటి ట్యాంకు వద్ద నిక్కరుతో చూశాను. ఆయన్ను పసిగట్టలేకపోయాను. చదువుతున్న సమయంలో చూశాను. ఇప్పుడు గుర్తుపట్టలేకపోయాం. తరువాత తెలిసింది..నిక్కరు వేసుకున్న వ్యక్తే నారాయణరావని.
- చెల్లూరు నీలకంఠం, రాజాం గ్రామం, వజ్రపుకొత్తూరు మండలం..
20 ఏళ్ల కిందట జీడి తోటల్లో
నారాయణరావు ప్రాణాలతో వస్తాడని ఊహించుకోలేకపోయాం. వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతుండడం, ఆ లిస్టులో నారాయణరావు పేరు కూడా ఉండడంతో ఆవేదన చెందాం. తరువాత మా గ్రామానికి చెందిన టెక్ శంకర్ మృతి చెందాడని గుర్తించాం. ప్రస్తుతం నారాయణరావు జనజీవనస్రవంతిలో కలిసినట్లు తెలియడంతో ఆనందిస్తున్నాం. గ్రామంలో ఒకడిగా గుర్తించి ఆయనకు ఇవ్వాల్సిన స్థానం ఇస్తాం. నారాయణరావును 20 ఏళ్ల కిందట సమీప జీడి తోటల్లో చూశాను. మాట్లాడే అవకాశం రాలేదు.
- బత్తిన ఢిల్వేశ్వరరావు, బాతుపురం..