Share News

కొద్దిగంటల్లో పెళ్లి.. అంతలోనే ఘోరం

ABN , Publish Date - Aug 25 , 2026 | 12:41 AM

Car plunges into Vamsadhara canal కొద్దిగంటల్లో వివాహ వేడుక. కళ్యాణ వేదిక ముస్తాబవుతోంది. బంధువులంతా హడావుడిగా ఉన్నారు. కూతురుని తెచ్చేందుకు పెళ్లికూతురు చిన్నాన్న బయల్దేరాడు. మేనల్లుడిని వెంట తీసుకెళ్లాడు. కారులో కొద్దిదూరం వెళ్లాక.. ఘోరం జరిగిపోయింది. వీరి కారు మరో వాహనాన్ని ఢీకొట్టింది. అదుపుతప్పి కాలువలో పడింది. ఈ ఘటనలో పీస రాము(46) మృతి చెందగా, మెండ విశాల్‌కుమార్‌ (29) గల్లంతయ్యాడు.

కొద్దిగంటల్లో పెళ్లి.. అంతలోనే ఘోరం
వంశధార కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఇన్‌సెట్‌లో రాము(ఫైల్‌), గల్లంతైన విశాల్‌కుమార్‌ (ఫైల్‌)

  • వంశధార కాలువలోకి దూసుకెళ్లిన కారు

  • పెళ్లికూతురు చినాన్న మృతి

  • యువకుడి గల్లంతు.. అచూకీ కోసం గాలింపు

  • కిన్నెరవాడ సమీపంలో ఘటన

  • జలుమూరు(సారవకోట)/ కోటబొమ్మాళి, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి):

  • కొద్దిగంటల్లో వివాహ వేడుక. కళ్యాణ వేదిక ముస్తాబవుతోంది. బంధువులంతా హడావుడిగా ఉన్నారు. కూతురుని తెచ్చేందుకు పెళ్లికూతురు చిన్నాన్న బయల్దేరాడు. మేనల్లుడిని వెంట తీసుకెళ్లాడు. కారులో కొద్దిదూరం వెళ్లాక.. ఘోరం జరిగిపోయింది. వీరి కారు మరో వాహనాన్ని ఢీకొట్టింది. అదుపుతప్పి కాలువలో పడింది. ఈ ఘటనలో పీస రాము(46) మృతి చెందగా, మెండ విశాల్‌కుమార్‌ (29) గల్లంతయ్యాడు.

  • సారవకోట మండలం గోపాలపురానికి చెందిన పంగ లక్ష్మణరావు, కోటబొమ్మాళి మండలం చీపుర్లపాడు గ్రామానికి చెందిన చల్ల కల్పనకు సోమవారం రాత్రి 10 గంటలకు అలుదు సమీపంలో వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. ఈ వేడుకకు.. పెండ్లి కుమార్తె చిన్నాన్న పీస రాము(పిన్ని భర్త), ఆయన మేనల్లుడు విశాల్‌కుమార్‌ వచ్చారు. వీరిద్దరూ పార్వతీపురంలో చదువుతున్న రాము కుమార్తెను తీసుకురావడానికి బయలుదేరారు. కిన్నెరవాడ సమీపంలోకి రాగానే వీరి కారు.. ఆగిఉన్న వ్యాన్‌ను ఢీకొట్టింది. అదుపు తప్పి.. వంశధార కాలువలోకి దూసుకెళ్లింది. కారులో రాము, విశాల్‌కుమార్‌తోపాటు డ్రైవర్‌ గొటివాడ నాగరాజు ఉన్నారు. స్థానికులు కారు అద్దాలు పగులగొట్టి డ్రైవర్‌ను బయటకు తీసి రక్షించారు. అప్పటికే కారు కాలువ నీటిలో మునిగిపోయింది. దీంతో సారవకోట పోలీసులు, కోటబొమ్మాళి అగ్నిమాపక సిబ్బంది వచ్చి కారును బయటకు తీశారు. అందులో రాము మృతదేహం లభ్యమైంది. విశాల్‌కుమార్‌ ఆచూకీ లేకపోవడంతో ఆయన కోసం గాలించారు. కాగా రాముకు భార్య చిలకమ్మ(ఉమా), కుమార్తె శృతి ఉన్నారు.

  • విశాల్‌కుమార్‌ ఖరగ్‌పూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు రామారావు, భాగ్యంతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నారు. వివాహ వేడుక వేళ ఈ ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. చీపుర్లపాడులో విషాదచాయలు అలుముకున్నాయి.

  • ఘటనా స్థలాన్ని నరసన్నపేట సీఐ శ్రీనివాసరావు, సారవకోట, జలుమూరు ఎస్‌ఐలు అనిల్‌కుమార్‌, బి.అశోక్‌బాబు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోటబొమ్మాళి సామాజిక ఆసుపత్రికి తరలించారు. రాము భార్య చిలకమ్మఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ తెలిపారు. డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు పేర్కొంటున్నారు.

Updated Date - Aug 25 , 2026 | 12:41 AM