మోగనున్న పెళ్లి బాజాలు
ABN , Publish Date - Nov 23 , 2026 | 12:16 AM
పెళ్లి బాజాలు మోగే సమయం ఆసన్నమైంది. చాతుర్మస్య కాలం పూర్తవడంతో మంగళవారం నుంచి మంచి ముహూర్తాలు రానున్నాయి.
-ఎల్లుండి నుంచి మంచి ముహూర్తాలు
-కల్యాణమండపాలకు డిమాండ్
టెక్కలి/పలాసరూరల్, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): పెళ్లి బాజాలు మోగే సమయం ఆసన్నమైంది. చాతుర్మస్య కాలం పూర్తవడంతో మంగళవారం నుంచి మంచి ముహూర్తాలు రానున్నాయి. ఈనెల 24, 25, 26 తేదీలు, డిసెంబరు 2, 3, 4, 5, 6, 11, 12 తేదీల్లో వివాహాలు జరుపుకోవచ్చునని పురోహితులు చెబుతున్నారు. తరువాత ధనుర్మాసం ప్రారంభం కానుండడంతో డిసెంబరు 13 నుంచి జనవరి 14 వరకూ నెల రోజుల పాటు ముహుర్తాలకు బ్రేక్ పడనుంది. జనవరి 14న సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే వరకూ పెళ్లిళ్లు, శుభకార్యాలు చేయకుండా (నెలగంటు)గా భావించి నిలుపుదల చేస్తారు. మళ్లీ జనవరి 15, 18, 19, 20, 24, 26, 27, 30, 31 తేదీల్లో, ఫిబ్రవరి 2, 3, 9, 14, 21, 22, 25, 26, 27, 28 తేదీలతో పాటు మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకూ మంచి ముహుర్తాలు ఉన్నాయి. అనంతరం గోదావరి పుష్కరాలు, శుక్రమౌడ్యంతో మరలా నవంబరులోనే శుభ గడియలు ఏర్పడనున్నాయి. దీంతో ఈ ఏడాది డిసెంబరు, వచ్చే జనవరి, ఫిబ్రవరిలో వచ్చే ముహూర్తాలకు అధిక సంఖ్యలో ప్రజలు ప్రాధాన్యతనిస్తున్నారు. ఎక్కువ శాతం ఇళ్ల వద్ద కాకుండా కళ్యాణ మండపాలకే మొగ్గుచూపుతున్నారు. దీంతో పెళ్లి మండపాలకు డిమాండ్ ఏర్పడింది. జిల్లాలో ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, టెక్కలి, కోటబొమ్మాళి, నరసన్నపేట, శ్రీకాకుళం, గార, ఆమదాలవలస, కొత్తూరు, పాతపట్నం, రణస్థలం తదితర ప్రాంతాల్లో ఇప్పటికే కల్యాణ మండపాలు బుక్ అయిపోయాయి. అదే విధంగా మంగళవాయిద్యాలు, కేటరింగ్, డెకరేషన్, వీడియో, ఫొటో గ్రాఫర్లు, పురోహితుకు ఇలా అవసరమైన వాటికి ముందుగానే అడ్వాన్స్‌లు చెల్లించారు.