Share News

జిల్లాను ఉపాధి కేంద్రంగా మారుస్తాం

ABN , Publish Date - Oct 03 , 2026 | 11:55 PM

‘ఉపాధి కోసం మన జిల్లా ప్రజలు ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు వలస వెళ్తున్నారు. ఇక నుంచి మన జిల్లానే ఉపాధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం.’ అని కేంద్ర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు.

 జిల్లాను ఉపాధి కేంద్రంగా మారుస్తాం
మెళియాపుట్టి: మాట్లాడుతున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

- నార్కోటిక్‌ పరిశ్రమను తీసుకొస్తాం

- కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

మెళియాపుట్టి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ‘ఉపాధి కోసం మన జిల్లా ప్రజలు ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు వలస వెళ్తున్నారు. ఇక నుంచి మన జిల్లానే ఉపాధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం.’ అని కేంద్ర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌తో కలిసి శనివారం సంతలక్ష్మీపురం, కె.కొళిగాం, పరశురాంపురం, చాపర, మెళియాపుట్టి, కోసమాళ, రింపి, కొత్తపేట గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నార్కోటిక్‌ పరిశ్రమను జిల్లాకు తీసుకురావడానికి చర్చలు జరుగుతున్నా యి. ఇది వస్తే 25 వేల కోట్లు పెట్టుబడులతో పాటు 13 వేల మంది ఉపాధి పొందేందుకు అవకాశం ఉంటుంది. పీఎం జన్‌మన్‌ కింద రూ.236 కోట్లు వచ్చాయి. గిరిజన గ్రామాల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం. బీసీ రిజర్వేషన్లపై మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదు. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ కూటమి ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్తుంది.’ అని తెలిపారు. కోసమాళ గ్రామాన్ని సొంత డబ్బులు పెట్టి అభివృద్ధి చేస్తున్న బోచ్చు ప్రసాదరావును అభినందించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో పవర్‌ స్వప్నిల్‌ జగన్నాథం,టెక్కలి ఆర్డీవో ఎం.కృష్టమూర్తి, టీడీపీ నాయకులు సలాన మోహనరావు, వెంకట్రావ్‌, అనపాన రాజశేఖర్‌రెడ్డి, దినకర్‌, తదిరుతులు పాల్గొన్నారు.

అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

పాతపట్నం, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): అభివృద్ధే కూటమి ప్రభుత్వం లక్ష్యమని కేంద్ర పౌరవిమానయానశాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌తో కలిసి పాతపట్నం మండలంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ పరిధిలోని ప్రహరాజపాలెం వద్ద రూ.45.50 లక్షలతో నిర్మించనున్న రైతుబజారు, స్థానిక హనుమాన్‌నగర్‌, సాయి నగర్‌, రామనగర్‌, కృష్ణనగర్‌, మహేంద్రనగర్‌లో రూ.80లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, సత్యసాయినగర్‌లో రూ.9.10లక్షలతో సీసీ రోడ్డు, శివశంకర్‌ కాలనీలో రూ.45 లక్షలతో కాలువ, సీసీ రోడ్డు, సీదిలో రూ.2.5 కోట్లతో నిర్మించనున్న ఇండోర్‌ బ్యాడ్మింటన్‌ స్టేడియం నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. ఎమ్మెల్యే గోవిందరావు మాట్లాడుతూ.. అడుగడుగునా అభివృద్ధి పనులు చేసి చూపే ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజినల్‌ అధికారి ఎం.కృష్ణమూర్తి, మండల అధికారులు అధిక సంఖ్యలో కూటమి నేతలు పాల్గొన్నారు.

Updated Date - Oct 03 , 2026 | 11:55 PM