Share News

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం

ABN , Publish Date - Sep 25 , 2026 | 12:34 AM

రైలు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకుంటామని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం
భీంపురంలో శరత్‌ కుటుంబాన్ని పరామర్శిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

టెక్కలి రూరల్‌, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): రైలు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకుంటామని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గురువారం భీంపురం, డమర, మెళియాపుట్టి గ్రామాలకు వెళ్లి వేరువేరుగా కుటుంబాలను పరామర్శించారు. ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించి మృతుల కుటంబాలను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.5లక్షల వంతున ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రకటించారు. ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదం జరిగిన తీరుపై విచారణ చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, ఆర్‌.డి.ఒ. కృష్ణమూర్తి, టీడీపీ నాయకులు బగాది శేషగిరిరావు, పోలాకి షణ్ముఖరావు, సలాన మోహరావు, జి.సత్యనారాయణ, అనపాన రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రహదారులు పూర్తిచేయాలి

డమర నుంచి పెద్ద కేదారికి వెళ్లే రహదారిని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. గురువారం డమర గ్రామాన్ని సందర్శించిన సమయంలో రహదారి బాగులేకపోడంతో ఎందుకు పనులు పూర్తి చేయడం లేదో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వారం రోజులలో పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు. డమర గ్రామస్థులు కాలనీలు కావాలని కోరారు. దీనిపై ఆయన స్పందిస్తూ నియోజకవర్గానికి రెండు వేల గృహాలు కాలనీగా మంజూరయ్యాయని అవసరమైన వారికి ముందుగా ప్రాధాన్యమిచ్చి మంజూరు చేస్తామని తెలిపారు. ఆయనతో పాటు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఆర్‌.డి.ఒ. కృష్ణమూర్తి, తహసీల్దార్‌ రాంబాబు, ఎం.పి.డి.ఒ. రేణుక తదితరులు ఉన్నారు.

ఏఎంసీ సెస్‌ రద్దుకు వినతి

పలాస, సెప్టెంబరు 24(ఆంధ్ర జ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా జీడిపప్పుపై వ్యవసాయ మార్కెట్‌ సెస్‌ను రద్దు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడును వ్యాపారులు కోరారు. వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఏఎంసీ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌లను ఏపీ జీడి వ్యాపారుల సంఘం, పలాస పారిశ్రామికవాడ జీడి వ్యాపార సంఘ నాయకులు గురువారం కలుసుకొని సమస్య తీవ్రతను వారికి వివరించారు. ఇతర రాష్ట్రాల్లో ఏఎంసీ ద్వారా స్థానికంగా కొనుగోలు చేసిన పిక్కలకు మాత్రమే పన్నులు విధిస్తున్నారని, మన రాష్ట్రంలో మాత్రం ఆ పన్నులతో పాటు జీడి పప్పుపై కూడా ఒక శాతం పన్ను విధించడం వల్ల ఏటా రూ.కోట్లలో నష్టపోతామని తెలిపారు. పొరుగు వ్యాపారులతో పోటీ పడలేక వ్యాపారాలు బంద్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దీనిపై పునరాలోచించి మార్కెట్‌ సెస్‌ను పూర్తిగా రద్దు చేయాలని కోరారు. మంత్రి, అధికారులను కలుసుకున్న వారిలో రాష్ట్ర జీడి వ్యాపారుల సంఘ అధ్యక్షుడు ఫణిరాఘవులు, ఉపాధ్యక్షుడు మల్లా కాంతారావు, పలాస పారిశ్రామికవాడ అధ్యక్షుడు మల్లా రామేశ్వరరావు, కార్యదర్శి తూముల శ్రీనివాసరావు , కోశాధికారి కొంచాడ వినయ్‌, వాసు, ఉదయ్‌, సిందిరి కిషోర్‌, డోకి శంకరరావు ఉన్నారు.

Updated Date - Sep 25 , 2026 | 12:34 AM