ఆ విద్యార్థినికి రక్షణగా ఉంటాం
ABN , Publish Date - Jul 18 , 2026 | 12:01 AM
అంబేడ్కర్ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థినికి రక్షణగా ఉంటామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ స్పష్టం చేశారు.
- రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శైలజ
- ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లిన వైనం
- ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టిన ఇంటెలిజెన్స్ వర్గాలు
- మహిళా వీసీ ఉన్న వర్సిటీలో విద్యార్థినికి వేధింపులా?
- ఆవేదన చెందుతున్న తోటి విద్యార్థులు
ఎచ్చెర్ల రూరల్, జూలై 17(ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థినికి రక్షణగా ఉంటామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ స్పష్టం చేశారు. శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన ‘హాస్టల్ ఖాళీ చెయ్!’ కథనం క్లిప్పింగ్‌ను కొందరు విద్యార్థులు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాట్సాప్‌కు పంపించారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. తన అధికారిక మెయిల్‌లో ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు మెసేజ్ చేశారు. బాధిత విద్యార్థినికి రక్షణగా నిలుస్తామని అన్నారు. అదే విధంగా ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాయి. మరోపక్క ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంతో వర్సిటీ అధికారులు ఉలిక్కిపడ్డారు. అయితే, తప్పు సరిదిద్దుకోవల్సిన అధికారులు ఈ విషయం బయటకు ఎలా వెళ్లిందన్న కోణంలో విద్యార్థులను ప్రశ్నించారు. బాధిత విద్యార్థినికి తోటి విద్యార్థులు మద్దతుగా నిలిచారు. తమ గదుల్లో ఆమెను ఉంచుతున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ మాట్లాడిన ఆడియోను బయటపెట్టటంతో వర్సిటీ పరువు మంటగలిసిందని అధికారులు ఆ విద్యార్థినిని టార్గెట్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకే ఆమెను వసతి గృహం నుంచి బయటకు పంపించేందుకు లేదా ఇతర మార్గాల్లో ఇబ్బంది పెట్టేందుకు పావులు కదుపుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. మహిళా వీసీ ఉన్న వర్సిటీలో విద్యార్థినిని వేధించిన ప్రొఫెసర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఇలా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై మాట్టాడేందుకు ఉన్నతాధికారులు ఇష్టపడటం లేదు.