Share News

కబ్జా చేసేస్తాం!

ABN , Publish Date - Jan 31 , 2026 | 12:09 AM

Attempt to secure land worth Rs. 10 crores నరసన్నపేట పట్టణ నడిబొడ్డున మార్కెట్‌లో రూ.కోట్లు విలువ చేసే బోర్డు బంగ్లా స్థలం ఆక్రమణకు గురవుతోంది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఈ స్థలాన్ని కొంతమంది చదును చేశారు. గతంలో వైసీపీ నాయకుల అండతో అక్రమార్కులు నిర్మాణాలకు యత్నించారు.

కబ్జా చేసేస్తాం!
నరసన్నపేటలోని బోర్డుబంగ్లా స్థలంలో నిర్మాణాలకు చదును చేసిన దృశ్యం

రూ.10కోట్ల స్థలం కాజేసేందుకు యత్నం

బోర్డులు తొలగించి.. ప్రహరీ కూల్చివేసి

బోర్డు బంగ్లా స్థలంలో రాత్రివేళ పనులు

అయినా మౌనం దాల్చిన అధికారులు

నరసన్నపేట, జనవరి 30(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట పట్టణ నడిబొడ్డున మార్కెట్‌లో రూ.కోట్లు విలువ చేసే బోర్డు బంగ్లా స్థలం ఆక్రమణకు గురవుతోంది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఈ స్థలాన్ని కొంతమంది చదును చేశారు. గతంలో వైసీపీ నాయకుల అండతో అక్రమార్కులు నిర్మాణాలకు యత్నించారు. నేడు కూటమి నేత ఒకరు అక్రమ నిర్మాణాలకు కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది. సుమారు రూ.10కోట్లు విలువైన ఈ స్థలం జిల్లాపరిషత్‌కు చెందినది. ఈ స్థలంపై గతంలో బొరిగివలసకు చెందిన ఓ ఆసామి కన్నుపడింది. అతను వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023 డిసెంబరు 16న ఆమదాలవలసకు చెందిన వ్యక్తి పేరుమీద తప్పుడు సర్వేనెంబరుతో డాక్యుమెంట్లు చేయించి.. నిర్మాణాలకు యత్నించాడు. అప్పట్లో జిల్లాపరిషత్‌, రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్‌ అధికారులు సమన్వయంతో అడ్డుకున్నారు.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. గతేడాది ఫిబ్రవరి 20న మళ్లీ ఆక్రమణకు ప్రయత్నించారు. అప్పటి ఎంపీడీవో బి.మధుసూదనరావు పోలీసులకు ఫిర్యాదు చేసి సంబంధిత స్థలంలో నిర్మాణాలను అడ్డుకున్నారు. అది ప్రభుత్వ స్థలంగా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించారు.

ఏడాది తర్వాత తాజాగా గురువారం రాత్రి బోర్డుబంగ్లా స్థలంలో నిర్మాణాలు చేసేందుకు కొందరు వ్యక్తులు వచ్చారు. బోర్డులను పీకేసి.. ప్రహరీని తొలగించారు. ఈ స్థలాన్ని తాము కొనుగోలు చేశామని, సుడా నుంచి అనుమతి తీసుకుని నిర్మాణాలు చేపడుతున్నామని చెబుతున్నారు. నిర్మాణాలకు కోర్టు అనుమతి ఇచ్చిందని పత్రాలు చూపుతున్నారు. కూటమి నేతల అండతోనే నిర్మాణాలకు సిద్ధమవుతున్నారనే ఆరోపణలున్నాయి.

పట్టించుకోని ఉన్నతాధికారులు

బోర్డు బంగ్లా స్థలం ప్రైవేటు వ్యక్తులకు చెందినదిగా గత ప్రభుత్వ హయాంలో ఎన్‌వోసీ ఇచ్చిన రెవెన్యూ అధికారులపై కానీ, బోర్డు బంగ్లా స్థలంలో నిర్మాణాలకు సుడా అనుమతులు ఇవ్వడంపై కానీ జిల్లా ఉన్నతాధికారులు స్పందించడం లేదు. దీంతో తరచూ ఈ స్థలంపై ఆక్రమణదారుల కన్నుపడుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో సిఫారసులకు తలొగ్గి బోర్డు బంగ్లా స్థలాన్ని అప్పట్లో రెవెన్యూ అధికారులు తప్పుడు పత్రాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ పత్రాలతో ‘సుడా’ అనుమతి తీసుకుని.. సంబంధిత స్థలంలో నిర్మాణాలు అడ్డుకోకుండా కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకువచ్చారు. గతంలో కోర్టులో పంచాయతీరాజ్‌, సుడా, రెవెన్యూ అధికారులు కోర్టులో కౌంటర్‌ దాఖలు చేయాల్సి ఉంది. అయితే పంచాయతీరాజ్‌ అధికారులు కౌంటర్‌ దాఖలు చేసినా.. సుడా అధికారులు కౌంటర్‌ దాఖలు చేయలేదు. దీంతో ఈ స్థలాన్ని ఆక్రమించేందుకు కొంతమంది ఎప్పటికప్పుడు ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. బోర్డుబంగ్లా స్థలం వివాదం జరుగుతున్నా.. కూటమి నేతలు, అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. కలెక్టర్‌ స్పందించి ఈ ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ఈ వ్యవహారంపై ఎంపీడీవో వెంకటేష్‌ ప్రసాద్‌ వద్ద ప్రస్తావించగా ‘బోర్డు బంగ్లా ఆస్తిని పరిరక్షిస్తాం. నిర్మాణాలకు కోర్టు అనుమతి ఇచ్చింది బోర్డు బంగ్లా ఆస్తికి కాదు. ఆ విషయాన్ని నిర్మాణదారులు గుర్తించాలి. లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామ’ని తెలిపారు.

Updated Date - Jan 31 , 2026 | 12:09 AM