సమస్యలపై గళమెత్తుతాం
ABN , Publish Date - Aug 17 , 2026 | 12:04 AM
We will strive to resolve the issues జిల్లాలో నియోజకవర్గాల వారీగా సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ఒక్కో సమస్య పరిష్కరిస్తున్నా.. ఇంకా చక్కదిద్దాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ప్రధానంగా సాగునీటి ఇబ్బందులు, కాలువల ఆధునికీకరణ వంటి సమస్యలు వెంటాడుతున్నాయి.
పరిష్కారానికి కృషి చేస్తాం
స్పష్టం చేసిన జిల్లా ఎమ్మెల్యేలు
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
శ్రీకాకుళం, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నియోజకవర్గాల వారీగా సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ఒక్కో సమస్య పరిష్కరిస్తున్నా.. ఇంకా చక్కదిద్దాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ప్రధానంగా సాగునీటి ఇబ్బందులు, కాలువల ఆధునికీకరణ వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. సోమవారం నుంచి రాజధానిలో అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజులపాటు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారీగా సమస్యల చిట్టాతో అసెంబ్లీలో ప్రస్తావించేందుకు రాజధానికి ఆదివారం సాయంత్రం పయనమయ్యారు. అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి.. వాటి పరిష్కారం దిశగా కృషి చేస్తామని ఎమ్మెల్యేలు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
వంశధార కాలువల ఆధునికీకరణ
వంశధార ఎడమ ప్రధాన కాలువ ఆధునికీకరణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ముందుగా ఈ సమస్యనే ప్రస్తావిస్తాను. ప్రభుత్వం చొరవ తీసుకునేలా విషయాన్ని వివరిస్తాను. ఏళ్ల నుంచి నోచుకోని వంశధార కరకట్టల నిర్మాణం ఎప్పట్లో ప్రారంభిస్తారని అడుగుతా. గత ప్రభుత్వంలో నరసన్నపేట నియోజకవర్గంలో అత్యధిక పాఠశాలలకు రంగులు వేసి డబ్బులు దోచుకున్నారు. ఆ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ అంశాన్ని మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకువెళ్తాను.
- బగ్గు రమణమూర్తి, ఎమ్మెల్యే నరసన్నపేట.
మొక్కజొన్నకు మద్దతు ధర
ఎచ్చెర్ల నియోజకవర్గంలో మొక్కజొన్న రైతులు అధికంగా ఉన్నారు. మొక్కజొన్న పంటకు సరైన మద్దతు ధర ప్రకటించాలని అసెంబ్లీలో ప్రస్తావిస్తాను. రణస్థలంలో గతంలో నిర్మించిన 30 పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్పుచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంటనే ఆసుపత్రి అప్‌గ్రెడేషన్ పనులు ప్రారంభించాలని కోరుతా. తోటపల్లి కాలువలను బాగుచేయించాలి. మడ్డువలస ప్రాజెక్టు కాలువ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి. నియోజకవర్గంలో ఉన్న యువతకు స్థానిక పరిశ్రమల్లోనే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా.
- నడుకుదిటి ఈశ్వరరావు, ఎమ్మెల్యే, ఎచ్చెర్ల
కొత్త వితంతు పింఛన్లు మంజూరు చేయాలి
ఈసారి నాలుగురోజులే అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. పాత సమస్యలే ప్రస్తావిస్తా. వితంతు పింఛన్లు కొత్తవి మంజూరు చేయాలని పలు అభ్యర్థనలు వచ్చాయి. ఈ అంశాన్ని ప్రస్తావిస్తాను. గత ప్రభుత్వంలో జరిపిన హౌస్‌హోల్డ్ సర్వేలో లోపాలు ఉన్నాయి. కుటుంబాలను కలిపేశారు. అందులో ఉన్నవారికి వివాహాలైతే కొత్త రేషన్ కార్డు మంజూరుకోసం సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం చూపాలి. అలాగే వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా గ్రామాల్లో రోడ్లు, పాఠశాల భవనాల నిర్మాణాలు చేపడతారా? అన్న అంశాలను ప్రస్తావిస్తాను.
- గౌతు శిరీష, ఎమ్మెల్యే, పలాస
గొట్టాబ్యారేజీ పనులు ఆరంభించాలి
1972లో నిర్మించిన గొట్టాబ్యారేజీ వంతెన శిఽథిలమవుతోంది. భారీ వాహనాలకు అటుగా ప్రవేశం లేదు. ప్రత్యామ్నాయంగా హిరమండలం తహసీల్దార్ కార్యాలయం నుంచి భగీరథపురం వరకు వంశధారపై వంతెన నిర్మాణం చేపట్టాలి. పాతపట్నం- గోపాలపురం మధ్య మహేంద్రతనయ నదిపై వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతున్నా. కొత్తగా ప్రతిపాదించిన పెద్దసీది, మెళియాపుట్టి, మర్రిగూడ, కొసమాల ఎత్తిపోతల పథకాల పనులు ప్రారంభించాలి. రూ.641 కోట్లతో చేపట్టనున్న నేరడి బ్యారేజీ పనులకు సత్వరమే టెండర్‌ను పిలిచేలా ఆదేశాలు ప్రభుత్వం ఇవ్వాలి. ఐటీడీఏ, ఫైర్‌స్టేషన్ ఏర్పాటుకు కూడా టెండర్లు పిలవాలి. ఈ సమస్యలన్నింటినీ అసెంబ్లీలో ప్రస్తావిస్తా.
- మామిడి గోవిందరావు, ఎమ్మెల్యే, పాతపట్నం
బెంతు ఒరియాల సమస్యను ప్రస్తావిస్తా
ఏళ్ల తరబడిగా బెంతుఒరియాలు కులధ్రువీకరణ పత్రాల కోసం ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావిస్తాను. అలాగే పైడిగాం వద్ద బహుదా ఓపెన్ హెడ్ చానల్ ఆధునికీకరణ పనులు చేపట్టాలని కోరుతా. కంచిలి మండలం సుంకిలి సాగరం పనులు ప్రారంభానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రస్తావిస్తాను.
- బెందాళం అశోక్, ఎమ్మెల్యే, ఇచ్ఛాపురం
నదుల అనుసంధానం చేపట్టాలి
వంశధార, నాగావళి నదుల అనుసంధానం చేపట్టాలి. అలాగే ఫ్లడ్ బ్యాంక్‌ల నిర్మాణం జరగాలి. నారాయణపురం ప్రాజెక్టు ఆధునికీకరణ చేయాలి. నియోజకవర్గంలో పలు చోట్ల ఆర్‌అండ్‌బీ రోడ్లు శిధిలమయ్యాయి. వీటికి నిధులు మంజూరు చేయాలి. నాగావళి నదిపై ముద్దాడపేట వద్ద వంతెన, వంశధార నదిపై పురుషోత్తపురం వద్ద వంతెన నిర్మాణాలు చేపట్టాలి. పొందూరు, తొగరాం ప్రాంతాల్లో డిగ్రీ కళాశాలలకు భవనాలు మంజూరు చేయాలి. పశుసంవర్థక డిప్లమో కళాశాల, వ్యవసాయ పాలిటెక్నికల్ కళాశాలలకు భవనాలు కేటాయించాలి. ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా.
- కూన రవికుమార్, ఎమ్మెల్యే, ఆమదాలవలస
సంక్షేమ కార్యక్రమాలు మరింత చేరువ చేసేలా
అసెంబ్లీలో ప్రతిపక్షం అనేది లేదన్న విషయం ప్రజలకు తెలిసిందే. ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు మరింత చేరువ చేసేవిధంగా అసెంబ్లీలో చర్చిస్తాం. అసెంబ్లీలో ప్రస్తావించే సమస్యలన్నింటికీ శాఖల వారీగా చర్చించి నిధుల కేటాయించేలా చేస్తాం. జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేలా సమగ్ర చర్యలు తీసుకుంటాం.
- కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి