Share News

ప్రతి ఎకరాకు నీరందిస్తాం

ABN , Publish Date - Aug 15 , 2026 | 12:29 AM

Kalingapatnam Lift Irrigation Scheme Inaugurated శివారు భూములకు సైతం ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యమని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. శుక్రవారం గారలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి కళింగపట్నం ఎత్తిపోతల పథకాన్ని ఆయన ప్రారంభించారు.

ప్రతి ఎకరాకు నీరందిస్తాం
: గార వద్ద ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే శంకర్‌, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌

కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

కళింగపట్నం ఎత్తిపోతల పథకం ప్రారంభం

గార నుంచి వమరవెళ్లి వరకూ తిరంగా ర్యాలీ

గార, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): శివారు భూములకు సైతం ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యమని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. శుక్రవారం గారలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి కళింగపట్నం ఎత్తిపోతల పథకాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని గార నుంచి వమరవెల్లి వరకూ జాతీయ జెండాలు పట్టుకుని బైక్‌లతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. వమరవెల్లిలో నిర్వహించిన సమావేశంలో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. ‘ఎత్తిపోతల పథకం ద్వారా పూర్తిస్థాయిలో సాగునీరు అందించేలా చర్యలు చేపడుతున్నాం. టీడీపీ హయాంలో మంత్రి అచ్చెన్న చేతులమీదుగా దీనికి శంకుస్థాపన చేశాం. కొంతమేర పనులు చేపట్టగా.. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీనిని పట్టించుకోలేదు. ప్రస్తుతం కూటమి పాలనలో ఈ ఎత్తిపోతల పథకం ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా.. ఎన్నికల హామీలను సీఎం చంద్రబాబునాయుడు అమలు చేస్తూ పాలన సాగిస్తున్నార’ని తెలిపారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘అభివృద్ధి, సంక్షేమం దిశగా కూటమి పాలన సాగుతోంది. నేరడి బ్యారేజీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీరు, సాగునీరందిస్తాం. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. సెప్టెంబరులో కొత్త పింఛన్లు మంజూరు చేస్తామ’ని తెలిపారు. ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాట్లాడుతూ ఈ ప్రాంత రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎత్తిపోతల పథకం ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం గార మండలం కె.మత్స్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకార నాయకులు పప్పు పోలీసుతోపాటు పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. కార్యక్రమంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఆర్డీవో సాయి ప్రత్యూష, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2026 | 12:29 AM