ఖైదీలకు న్యాయ సహాయం అందిస్తాం
ABN , Publish Date - Sep 26 , 2026 | 11:35 PM
ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని, దాన్ని వినియోగించుకోవాలని జిల్లా న్యాయాధికారి కొండబోలు సునీత అన్నారు.
- జిల్లా న్యాయాధికారి సునీత
- కేంద్ర కారాగారం తనిఖీ
శ్రీకాకుళం లీగల్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని, దాన్ని వినియోగించుకోవాలని జిల్లా న్యాయాధికారి కొండబోలు సునీత అన్నారు. శనివారం ఆమె జిల్లా న్యాయసేవాసదన్ కార్యదర్శి హరిబాబుతో కలిసి గార మండలం అంపోలులోని జిల్లా కేంద్ర కారాగాన్ని తనిఖీ చేశారు. వివిధ బ్యారక్‌లు, వంటశాల, వైద్యశాలను పరిశీలించారు. ఖైదీలకు అందుతున్న ఆహారం, వైద్య సదుపాయాలతో పాటు జైలులో పారిశుధ్యం విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. ఖైదీలకు రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించిందని, వాటి రక్షణ కోసం న్యాయస్థానాలు సహాయం చేస్తాయని తెలిపారు. ఉచితంగా న్యాయసహాయం అందించడానికి న్యాయసేవాధికార సంస్థ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని చెప్పారు. చిన్నచిన్న నేరాలు చేసి, విచారణ ఖైదీలుగా ఉండి, చాలాకాలంగా బెయిల్ పొందలేక ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి న్యాయ సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు. వృద్ధ, మహిళా ఖైదీలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిఫెన్స్ న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లు, జైలు అధికారులు పాల్గొన్నారు.