మెగా డీఎస్సీపై దుష్ప్రచారాన్ని సహించం
ABN , Publish Date - Jun 14 , 2026 | 12:00 AM
Transparent recruitment process ఎంతో కష్టపడి, ప్రతిభతో ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టిన తమను రాజకీయ కోణంలో అవమానిస్తే సహించేది లేదని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన ‘మెగా డీఎస్సీ 2025’ ఉపాధ్యాయులు స్పష్టం చేశారు.
నూతన ఉపాధ్యాయుల హెచ్చరిక
పారదర్శకంగా నియామకాల ప్రక్రియ
వైసీపీవి కపట నాటకాలు: ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు
శ్రీకాకుళం, జూన్ 13(ఆంధ్రజ్యోతి): ఎంతో కష్టపడి, ప్రతిభతో ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టిన తమను రాజకీయ కోణంలో అవమానిస్తే సహించేది లేదని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన ‘మెగా డీఎస్సీ 2025’ ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. నియామకాలపై బురదజల్లితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వైసీపీ నేతలను హెచ్చరించారు. శనివారం శ్రీకాకుళంలోని బృందావన్ కన్వెన్షన్ హాల్‌లో ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసన మండలి ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 500 మందికి పైగా హాజరైన ఈ సదస్సులో వైసీపీ నేతల అసత్య ప్రచారాలపై ఉపాధ్యాయులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పారదర్శకంగా జరిగిన మెగా డీఎస్సీ ద్వారా తాము ఉద్యోగాలు సాధించామని స్పష్టం చేశారు. ‘మేము దొంగదారిలో ఉద్యోగాలు పొందలేదు. పగలు, రాత్రి కష్టపడి మెరిట్ సాధించి గురువులమయ్యాం. డీఎస్సీపై రాజకీయ కక్షతో విషం చిమ్మాలని చూస్తే ఊరుకోం’ అని ఉపాధ్యాయులు హెచ్చరించారు. ఈ సందర్భంగా ‘గొడ్డలి పార్టీ ఉద్యోగాలు ఇవ్వలేదు.. టీడీపీ ఇస్తే ఓర్వలేరు’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ వైసీపీ తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు.
కూటమి ప్రభుత్వానిది చిత్తశుద్ధి..
ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ.. ‘గతంలో 11 డీఎస్సీలు నిర్వహించిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. మెగా డీఎస్సీ ద్వారా 16,347 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించడం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం. వైసీపీ పాలనలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేని జగన్‌కు.. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదు. గతంలో న్యాయమైన హక్కుల కోసం పోరాడిన ఉపాధ్యాయులను అరెస్టు చేయించి, అక్రమ కేసులు బనాయించిన వైసీపీకి.. ఇప్పుడు అకస్మాత్తుగా ఉపాధ్యాయులపై ప్రేమ పుట్టుకురావడం కపట నాటకమేన’ని మండిపడ్డారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కృషితో విశాఖకు ఆర్సెలర్ మిట్టల్, గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు క్యూ కడుతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు ప్రైవేట్ రంగంలోనూ ఉత్తరాంధ్ర యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయ’ని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యా రంగ ప్రముఖులు పాల్గొన్నారు.