Share News

భక్తులకు ఇబ్బంది కలిగితే ఉపేక్షించం

ABN , Publish Date - Jan 23 , 2026 | 12:16 AM

Ratha Saptami celebrations ‘రథసప్తమిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉత్సవాల నిర్వహణ అత్యంత ప్రతిష్టాత్మకం. అరసవల్లికి వచ్చే భక్తులకు ఏ చిన్న అసౌకర్యం కలిగినా ఉపేక్షించేది లేదు’ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను హెచ్చరించారు.

భక్తులకు ఇబ్బంది కలిగితే ఉపేక్షించం
రథసప్తమి ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

రథసప్తమి ఏర్పాట్లలో లోపాలు తలెత్తకూడదు

రాష్ట్ర పండుగగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి

మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం

శ్రీకాకుళం/అరసవల్లి జనవరి 22(ఆంధ్రజ్యోతి): ‘రథసప్తమిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉత్సవాల నిర్వహణ అత్యంత ప్రతిష్టాత్మకం. అరసవల్లికి వచ్చే భక్తులకు ఏ చిన్న అసౌకర్యం కలిగినా ఉపేక్షించేది లేదు’ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను హెచ్చరించారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో ఈ నెల 25న జరగనున్న రథసప్తమి వేడుకల ఏర్పాట్లపై గురువారం ఆయన అధికారులతో సమీక్షించారు. ముందుగా ఆలయ పరిసరాలను, క్యూలైన్లను పరిశీలించారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ మహేశ్వరరెడ్డి, ఇతర శాఖల ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు సత్వర, సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని ఆదేశించారు. క్యూలైన్లలో ఉన్నవారికి మంచినీరు, మజ్జిగ, ఉచిత లడ్డూ ప్రసాద పంపిణీలో లోటు రానీయవద్దన్నారు. విద్యుత్‌, పారిశుధ్యం సహా.. ముఖ్యంగా ట్రాఫిక్‌ నియంత్రణ, వాహనాల పార్కింగ్‌పై పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను సందర్శించిన మంత్రి.. 250కి పైగా సీసీ కెమెరాలతో నిర్వహిస్తున్న నిఘా పర్యవేక్షణను స్వయంగా పరిశీలించారు. గతంతో పోలిస్తే ఈసారి ఏర్పాట్లు చాలా మెరుగ్గా ఉన్నాయని అధికారులకు కితాబిచ్చారు. ఇదే ఒరవడిని భవిష్యత్తులోనూ కొనసాగించాలని, దేవదాయ, విద్యుత్‌, మునిసిపల్‌ శాఖల సమన్వయంతో పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గొండు శంకర్‌, బగ్గు రమణమూర్తి, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ పృథ్వీరాజ్‌ కుమార్‌, ఆర్డీఓలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 12:16 AM