ప్రతి రైతుకూ న్యాయం చేస్తాం
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:21 AM
The flood threat has been averted నష్టపోయిన ప్రతిరైతుకూ న్యాయం చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. జిల్లాలో వరద ముప్పు దాదాపు తప్పినట్టేనని, ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి నాగావళినదీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు.
వరద ముప్పు తప్పింది.. ఆందోళన వద్దు
మంత్రి అచ్చెన్నాయుడు భరోసా
నాగావళి, వంశధార పరివాహక ప్రాంతాల్లో పర్యటన
శ్రీకాకుళం/సంతబొమ్మాళి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): నష్టపోయిన ప్రతిరైతుకూ న్యాయం చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. జిల్లాలో వరద ముప్పు దాదాపు తప్పినట్టేనని, ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి నాగావళినదీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లి, కిల్లిపాలెం, మోపసు బందరు, పీజీ పేట తదితర గ్రామాలకు వెళ్లారు. మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ ‘ఒడిశా క్యాచ్‌మెంట్ ప్రాంతంలోనూ కుండపోత వర్షాలతో వంశధార, నాగావళి నదుల్లో భారీగా వరదనీరు వచ్చి చేరింది. నాగావళి ఉధృత కొనసాగుతున్నా శ్రీకాకుళం నగరంలో నీరు వచ్చే పరిస్థితి లేదు. రెండు మూడు గంటల్లో ఉధృతి తగ్గుతుంది. ఒడిశా అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఇళ్లలోనే ఉండిపోయిన వారికి మధ్యాహ్న భోజన పథకం ద్వారా అహారం అందిస్తున్నాం’ అని తెలిపారు.
భారీ వర్షాలకు వ్యవసాయ, ఉద్యాన పంటలతో పాటు పలుచోట్ల రోడ్లు, చెరువులు దెబ్బతిన్నాయని మంత్రి పేర్కొన్నారు. నీటి మునిగిన వరిపంటను రక్షించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అవసరమైతే ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా రైతులను ఆదుకుంటామని తెలిపారు. రైతులతో పాటు రోడ్లు, చెరువులు, ఇతర ఆస్తులు నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా నిలిచి, పరిహారం అందిస్తుందన్నారు. సహాయకచర్యల్లో పాల్గొంటున్న అధికారులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
సంతబొమ్మాళి మండలంలో..
సంతబొమ్మాళి మండలంలోని వడ్డితాండ్ర, అంట్లవరం, వడ్డీవాడ, సంతబొమ్మాళి, గొదలాం, కొల్లిపాడు, లక్కీవలస, మరువాడ, మేఘవరం తదితర గ్రామాల్లో నీటమునిగిన పంట పొలాలను ఆర్డీవో కృష్ణమూర్తితో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని తెలిపారు. ద కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఇంజినీరింగ్ అధికారులు రవికాంత్, జగన్నాథరాజు, హరినాథ్, తహసీల్దార్ హేమసుందరరావు, ఎంపీడీవో పార్వతీశం, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారి ఎస్.రామకృష్ణ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.