Share News

శ్రీకాకుళాన్ని మోడల్‌ సిటీగా అభివృద్ధి చేస్తాం

ABN , Publish Date - Jul 08 , 2026 | 12:35 AM

శ్రీకాకుళం నగరాన్ని మోడల్‌ సిటీగా అభివృద్ధి చేస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు.

శ్రీకాకుళాన్ని మోడల్‌ సిటీగా అభివృద్ధి చేస్తాం
పనులకు శంకుస్థాపన చేస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు

-కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు

- రూ.2కోట్లతో పార్కుల అభివృద్ధికి శంకుస్థాపన

అరసవల్లి, జూలై 7(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరాన్ని మోడల్‌ సిటీగా అభివృద్ధి చేస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. మంగళవారం ఆయన నగరంలోని గూనపాలెం, హడ్కో కాలనీ, ఆర్‌కే నగర్‌, అబ్దుల్‌ కలాం, అఫీషియల్‌ కాలనీల్లోని పార్కులను సందర్శించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ప్రకృతితో మమేకమయ్యేందుకు పార్కులే ప్రధాన వనరు అని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర...స్వర్ణాంధ్ర ఆలోచనల స్ఫూర్తిగా పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రూ.2కోట్ల ఎయిర్‌పోర్టు అథారిటీ సీఎస్‌ఆర్‌ నిధులతో స్థానికుల అవసరాలకు అనుగుణంగా పార్కులను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ప్రతీ పార్కులో వాకింగ్‌ ట్రాక్‌, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌ కోర్టును నిర్మిస్తున్నట్లు తెలిపారు. మూడు నెలల్లో పూర్తి చేసే విధంగా ప్రణాళికలు తయారుచేశామన్నారు. గూనపాలెం పార్కుకు రూ.40లక్షలు, హడ్కో కాలనీ పార్కుకు రూ.55లక్షలు, ఆర్‌కే నగర్‌ పార్కుకు రూ.45లక్షలు, అఫీషియల్‌ కాలనీ పార్కుకు రూ.60లక్షల నిధుల కేటాయింపుతో సర్వాంగసుందరంగా మారుస్తామని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, జిల్లా అధికారులు, కార్పొరేషన్‌ అధికారులు, నాయకులు పాండ్రంకి శంకర్‌, ప్రధాన విజయరాం, రెడ్డి గిరిజా శంకర్‌, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2026 | 12:35 AM