నిధులు తెస్తాం
ABN , Publish Date - Feb 13 , 2026 | 11:44 PM
State budget today అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. శనివారం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో తలసరి ఆదాయంలో వెనుకబడిన జిల్లా సమగ్రాభివృద్ధికి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు నిధుల కోసం జిల్లావాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
స్పష్టం చేసిన జిల్లా ఎమ్మెల్యేలు
నేడు రాష్ట్ర బడ్జెట్
శ్రీకాకుళం, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. శనివారం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో తలసరి ఆదాయంలో వెనుకబడిన జిల్లా సమగ్రాభివృద్ధికి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు నిధుల కోసం జిల్లావాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలతో ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. జిల్లాకు ఎంతమేర నిధులు అవసరమో జాబితాను ప్రభుత్వానికి సమర్పించారు. అసెంబ్లీ వేదికగా బడ్జెట్ సమావేశంలోనూ ‘అధ్యక్షా’.. అంటూ తమ వాణిని వినిపించి.. జిల్లా సమస్యలపై ప్రస్తావించనున్నారు. తద్వారా నిధుల కేటాయింపునకు తమవంతు కృషి చేస్తామని ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు.
సాగునీటి ప్రాజెక్టులకే ప్రాధాన్యం
జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యమివ్వనున్నాం. వంశధార ప్రాజెక్టు, మహేంద్రతనయ, ఆఫ్‌షోర్, వంశధార- నాగావళి కరకట్టలు, నదుల అనుసంధానమే లక్ష్యంగా బడ్జెట్‌లో నిధులు అత్యధికంగా కేటాయించేలా చర్యలు తీసుకున్నాం. సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తిచేసేందుకు నిధులు తీసుకువస్తాం.
- కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి
పనుల పునరుద్ధరణకు..
టీడీపీ ప్రభుత్వం (2014-2019 మధ్య) మంజూరు చేసిన పలు ప్రాజెక్టులను, రోడ్లను, కాలువల ఆధునికీకరణ పనులను.. గత వైసీపీ ప్రభుత్వం నిలిపేసింది. ఇప్పుడు ఆ పనుల పునరుద్ధరణ జరగాలి. వంశధార కాలువల ఆధునికీకరణకు, నదుల కరకట్టల ఏర్పాటుకు, రోడ్ల అభివృద్ధికి నిధులు సుమారుగా రూ.350 కోట్లు అవసరం. సురక్షిత తాగునీరు నేరుగా హిరమండలం రిజర్వాయర్ నుంచి ఆమదాలవలస నియోజకవర్గానికి తీసుకువచ్చేందుకు ప్రత్యేక ప్రాజెక్టు కోసం రూ.280 కోట్లు అవసరం. నియోజకవర్గం నుంచి రాష్ట్ర రహదారుల ఏర్పాటుకు సుమారు రూ.150 కోట్లు నిధులు కావాలి. ఏరియా ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్పుచేసేందుకు నిధులు కావాలని ప్రస్తావిస్తాను. ముద్దాడపేట, పురుషోత్తపురం వద్ద నదులపై వంతెనలు, ఆర్‌అండ్‌బీ రోడ్లు పూర్తి కోసం రూ.250 కోట్లు అవసరం.
- కూన రవికుమార్, పీయూసీ చైర్మన్, ఆమదాలవలస ఎమ్మెల్యే
వంశధార కాలువల ఆధునికీకరణకు..
వంశధార ప్రాజెక్టు, కాలువల ఆధునికీకరణకు రూ. 1600 కోట్లు అవసరం. ఈ బడ్జెట్‌ను కేంద్రప్రభుత్వం నుంచి మంజూరు చేయాలని.. పూర్వోదయ ప్రాజెక్టులో కేటాయించాలని ఇప్పటికే స్వయంగా ఢిల్లీ వెళ్లి మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిగారితో సహా కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. ఇదే అంశాన్ని మళ్లీ ప్రస్తావిస్తాను. పోలాకి మండలంలో పలుచోట్ల భూగర్భజలాలు సాల్ట్ కంటెంట్ పెరిగింది. సారవకోట, జలుమూరులో భూగర్భజలాలు తక్కువగా ఉన్నాయి. ఇక్కడ కిడ్నీ రోగుల సంఖ్య పెరుగుతోంది. అందుకే వంశధార రిజర్వాయర్ నుంచి రూ.600 కోట్లతో ప్రత్యేక తాగునీటి పథకం మంజూరు చేయాలని.. జలజీవన్ మిషన్ ద్వారానే పనులు చేయాలని కోరుతున్నా.
బగ్గు రమణమూర్తి, నరసన్నపేట ఎమ్మెల్యే
పదిహేడేళ్ల సమస్యపై..
శ్రీకాకుళం నియోజకవర్గంలో సాగునీరు అందించేందుకు వంశధార ఆర్‌ఎంసీ 37 కాలువ... మరమ్మతులకు నోచుకోలేదు. పదిహేడేళ్ల నుంచి కాలువలో పనులు జరగలేదు. సమస్య పరిష్కారం కాలేదు. ఈ సమస్యపై ప్రస్తావిస్తాను. 4,600 ఎకరాల కు సాగునీటి సమస్య తీర్చేలా నిధులు కేటాయించాలి. కళింగపట్నంలో ఎత్తిపోతల పథకం కోసం రూ.80 లక్షలు, కేఆర్ స్టేడియం కోసం రూ. 3.5 కోట్లు అవసరం. పాలకొండ రోడ్‌లో యుటిలిటీ షిఫ్టింగ్‌కు ప్రభుత్వ అనుమతి కోసం కూడా ప్రస్తావిస్తాను. సాగు, తాగునీటి కోసం ప్రాధాన్యంగా నిధులు కావాలని కోరుతున్నా.
- గొండు శంకర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే
చిన్ననీటి సాగువనరులకు..
పలాస నియోజకవర్గంలో చిన్న సాగునీటి వనరులకు సుమారు రూ.3కోట్లు కేటాయిస్తే.. వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మందస మండలం కళింగదల్, డబారు ప్రాజెక్టుల పునరుద్ధరణకు కొద్దిమొత్తంలో నిధులు ఇస్తే సరిపోతుంది. పలాసలోని ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఇండస్ట్రీయిల్ పార్క్‌ను నెలకొల్పాలి. ఆ తర్వాత విస్తరణ పనులు చేపడితే బాగుంటుంది. నియోజకవర్గంలో జల్‌జీవన్ మిషన్ పనులకుగాను రూ.125 కోట్లు ఇంకా అవసరముంది. పలాసలో జీడి అనుబంధ పరిశ్రమలు నెలకొల్పాలి. అసెంబ్లీలో ఈ అంశాలపై ప్రస్తావిస్తాను.
- గౌతు శిరీష, పలాస ఎమ్మెల్యే
ఫిషింగ్ హార్బర్ పూర్తి చేసేలా..
కేంద్రప్రభుత్వ నిధులతో ఎచ్చెర్ల నియోజకవర్గంలో బుడగట్లపాలెం వద్ద నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్ పూర్తి చేసేందుకు .. ఇంకా రూ.270 కోట్లు నిధులు అవసరం. ఈ నిధులు కేంద్రం నుంచి సకాలంలో మంజూరయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పనిజరిగేలా బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావిస్తాను. తోటపల్లి కాలువ ఆధునికీకరణకు రూ.50 కోట్లు, మడ్డువలస కాలువకు రూ.30 కోట్లు నిధులు కావాలి. కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రంలో భాగంగా... ధర్మవరంలో నిర్వాసితులకు ఆర్‌ఆర్ కింద రూ.750 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇది కూడా కేంద్రం నుంచే రావాలి. వంద పడకల ఆసుపత్రి, డిగ్రీ కళాశాల, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, ఈఎస్‌ఐ ఆసుపత్రి వంటివి పూర్తిచేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరుతున్నాం. ఇప్పటికే ఎంఎస్‌ఎంఈ పార్క్ విషయం కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టాం.
- నడుకుదిటి ఈశ్వరరావు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే
రిజర్వాయర్ పనులపై..
ఏడాదిన్నర కాలంలో పాతపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.1100కోట్లు ప్రభుత్వం కేటాయించింది. పనులు పూర్తయ్యాయి. ఏడాదిలోగా హిరమండలం రిజర్వాయర్ పనులు పూర్తి చేసి.. జాతికి అంకితమవ్వాలన్న లక్ష్యంతో ఉన్నాం. పెండింగ్ పనులకు సంబంధించి నిధుల విషయమై ప్రస్తావిస్తాను. పరిశ్రమలు స్థాపించాల్సి ఉంది. జల్‌జీవన్ మిషన్ పనులకు రూ.200 కోట్లు అవసరం. వంద పడకల ఆసుపత్రి, పాలిటెక్నికల్ కళాశాలతోపాటు వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతాను.
- మామిడి గోవిందరావు, పాతపట్నం ఎమ్మెల్యే
సాగునీటి వనరులు మెరుగయ్యేలా..
సాగునీటి పరంగా బహుదా-పైడిగాం, కంచిలి మండలం సాగరాలు.. గొలుసుకట్టు చెరువులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. సుమారు రూ.120కోట్లతో వీటికి మరమ్మతులు చేపడితే రెండు పంటలకు సాగునీరు ఇచ్చేందుకు వీలుంటుంది. బెంతుఒరియా సమస్యలపై నేరుగా పిటీషన్ ఇస్తున్నాం. వంశధార-బహుదా నదుల అనుసంధానం ఇప్పటిలో పూర్తయ్యేలా లేదు. సాగునీటిపరంగా చిన్ననీటి వనరులను మెరుగుపరిచేందుకు ఇప్పటికే సీఎంకు తెలియజేశాను. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తా.
బెందాళం అశోక్, ప్రభుత్వ విప్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే