అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నాం: మంత్రి అచ్చెన్న
ABN , Publish Date - Aug 22 , 2026 | 11:28 PM
రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
టెక్కలి రూరల్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శనివారం సాయంత్రం భగవాన్‌పురం, చింతలగార గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో ఆదాయం సమకూరుతోందని...పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మూలపేట పోర్టు ఆవరణలో అనేక పరిశ్రమలు తీసుకు వస్తున్నట్టు తెలిపారు. నియోజకవర్గాంలో వచ్చే ఎన్నికల నాటికి ఏ గ్రామంలోనూ మట్టి రోడ్డు కనిపించకుండా చేస్తానని చెప్పారు. వర్షంలోనూ ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కోటబొమ్మాళి మార్కెట్ కమిటీ చైర్మన్ బగాది శేషగిరిరావు, పీఏసీఎస్ చైర్మన్ పోలాకి షణ్ముఖరావు, దల్లి ప్రసాద్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
హామీలను అమలు చేసి తీరుతా
టెక్కలి, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): తాను ప్రజలకు హామీ ఇచ్చానంటే అది అమలు చేసి తీరుతానని... వారి సమస్యలు గుర్తించి ప్రాధాన్య క్రమంలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం రాత్రి టెక్కలి పట్టుమహాదేవి కోనేరులో రూ.2 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఇందిరాగాంధీ కూడలిలో రూ.80 లక్షలతో సులభ్ కాంప్లెక్స్ భవనాన్ని ప్రారంభించారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రూ.55లక్షలతో నిర్మించిన మార్చురీ గది, బయోమెడికల్ వేస్ట్ రూమ్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి దీటుగా టెక్కలి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యారావు, ఏఎంసీ చైర్మన్ బగాది శేషగిరి, పీఏసీఎస్ అధ్యక్షులు పోలాకి షణ్ముఖరావు, టీడీపీ నాయకులు కోళ్ల లవకుమార్, దోని బుజ్జి, మామిడి రాము, దల్లి ప్రసాద్‌రెడ్డి, మట్ట సుందరమ్మ, మెండ దమయంతి, లాడి శ్రీనివాసరావు, గండి సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.