Share News

తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడలేకపోతున్నాం!

ABN , Publish Date - Jan 05 , 2026 | 12:06 AM

Maternal mortality rate పురిటినొప్పులు భరించి పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన కొంతమంది తల్లులు.. ప్రసవవేదన సమయంలోనే కన్ను మూస్తున్నారు. కేరింతలు కొట్టాల్సిన పసిప్రాణాలు.. లోకం చూడకముందే అనంతవాయువుల్లో కలిసిపోతున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఎన్ని చర్యలు చేపడుతున్నా మాతాశిశు మరణాల విషయంలో ‘సున్నా’ (జీరో డెత్స్‌) లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు.

తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడలేకపోతున్నాం!

తగ్గుముఖం పట్టినా.. ఆగని పసికందుల మరణాలు

ఆందోళన రేకెత్తిస్తున్న మాతృ మరణాల రేటు

శ్రీకాకుళం, జనవరి 4(ఆంధ్రజ్యోతి): పురిటినొప్పులు భరించి పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన కొంతమంది తల్లులు.. ప్రసవవేదన సమయంలోనే కన్ను మూస్తున్నారు. కేరింతలు కొట్టాల్సిన పసిప్రాణాలు.. లోకం చూడకముందే అనంతవాయువుల్లో కలిసిపోతున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఎన్ని చర్యలు చేపడుతున్నా మాతాశిశు మరణాల విషయంలో ‘సున్నా’ (జీరో డెత్స్‌) లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. గడిచిన రెండేళ్ల గణాంకాలను.. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే వైద్య వ్యవస్థ పనితీరుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వైద్యఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం శిశు మరణాలు కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నా.. తల్లుల మరణాల రేటు(ఎంఎంఆర్‌) పెరగడం జిల్లా యంత్రాంగానికి, ప్రజల ఆరోగ్య భద్రతకు ఒక పెద్ద సవాలుగా మారింది. ఏడాది వ్యవధిలో జిల్లాలో 106 మంది పసికందులు, 8 మంది తల్లుల మృతి చెందడం కలవరపెడుతోంది. ఇటీవల ఇరవై సూత్రాల కమిటీ చైర్మన్‌ లంకా దినకరణ్‌ శ్రీకాకుళం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో జిల్లాలో మాతృమరణాలు గణాంకాలను స్పష్టం చేశారు. ఆ సమీక్షలో పాల్గొన్న అధికారులకు ఇచ్చిన నివేదికలో మాత్రం ఆ ఒక్క విషయాన్ని(మాతృ మరణాలు) తొలగించారు. అలాగే ఇటీవల ‘దిశా’ పేరుతో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు జిల్లాపరిషత్‌లో నిర్వహించిన సమీక్షలోనూ జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఇచ్చిన నివేదికలో.. మాతృమరణాలకు సంబంధించిన అంశం లేకుండా జాగ్రత్త పడ్డారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి గుర్తించి.. జిల్లాలో మాతాశిశు మరణాలపై ఆరా తీశారు. ఉద్దేశపూర్వకంగా నివేదికల్లో మాతృమరణాల అంశాన్ని కనిపించకుండా చేయడంపై జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పసిప్రాణాలు విలవిల :

2023-24లో 215 మంది పసికందులు మరణించగా.. 2024-25 నాటికి ఈ సంఖ్య 185కి తగ్గింది. కానీ 2025-26లో గత ఏడాది నవంబరు నాటికే 106 మంది చిన్నారులు మరణించడం కలవరపెడుతోంది. సగటున నెలకు 13 మందికి పైగా చిన్నారులు పుట్టిన ఏడాదిలోపే మృత్యువాత పడుతున్నారు. సాంకేతికంగా ఐఎంఆర్‌ (శిశు మరణాల రేటు) 6.90 నుంచి 6.11కి తగ్గినా .. వందకుపైగా కుటుంబాల్లో చీకటి నిండిందనేది చేదు నిజం.

తల్లులకు పొంచి ఉన్న ముప్పు :

మాతృ మరణాల సంఖ్య (ఏటా 14) స్థిరంగా ఉన్నప్పటికీ.. మాతృ మరణాల నిష్పత్తి(ఎంఎంఆర్‌) 44.94 నుంచి 48.29కి ఎగబాకింది. ప్రసవాల సంఖ్య తగ్గినప్పుడు, మరణాలు కూడా తగ్గాలి. కానీ ఇక్కడ మరణాల రేటు పెరగడం వైద్యుల పర్యవేక్షణ లోపాన్ని ఎత్తిచూపుతోంది. గత ఏడాది నవంబరు నాటికే 8 మంది తల్లులు చనిపోయారు.

లోపం ఎక్కడుంది?

బీపీ, షుగర్‌, తీవ్ర రక్తహీనత ఉన్న గర్భిణులను ‘హై-రిస్క్‌’గా గుర్తిస్తారు. వీరిని ప్రసవ సమయం వరకు నిరంతర పర్యవేక్షించాలి. కానీ ఎంఎంఆర్‌ పెరగడం చూస్తుంటే.. ఈ పర్యవేక్షణ మొక్కుబడిగా సాగుతున్నట్లు అర్థమవుతోంది.

గర్భస్థ శిశువులో లోపాలను ముందుగానే గుర్తించడంలో స్కానింగ్‌ సెంటర్ల పాత్ర కీలకం. కానీ జిల్లాలో అనర్హులైన టెక్నీషియన్లతో నడిచే కొన్ని స్కానింగ్‌ సెంటర్ల వల్ల లోపాలను గుర్తించలేకపోతున్నారు. ఫలితంగా పుట్టిన వెంటనే బిడ్డలు చనిపోతున్నారు.

మాతాశిశు సంరక్షణకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా.. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోని గర్భిణులకు సకాలంలో అత్యవసర వైద్యం అందడం లేదు. 108 వాహనం వచ్చేలోపే ప్రాణాలు పోతున్న ఘటనలు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి.

దిద్దుబాటు చర్యలు ఏవీ?

వైద్యాధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలి. పీహెచ్‌సీల వారీగా గర్భిణుల ఆరోగ్య పరిస్థితులను స్వయంగా పరిశీలించాలి. రక్త నిల్వలు.. ప్రసవ సమయంలో అత్యధిక రక్తస్రావం(పీపీహెచ్‌) వల్లే ఎక్కువ మంది తల్లులు చనిపోతున్నారు. అన్ని ఆసుపత్రుల్లో సరిపడా రక్తం నిల్వ ఉండేలా బ్లడ్‌ బ్యాంకులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. తల్లి గానీ, బిడ్డ గానీ చనిపోతే దానికి గల కచ్చితమైన కారణాలను విశ్లేషించాలి. ఇప్పటికైనా వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ దిశగా చర్యలు చేపట్టాలి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచే ఆకుకూరలు, పాలు, గుడ్లు, బాలామృతం క్రమం తప్పకుండా తీసుకోవాలి. రక్తహీనత లేకుండా చూసుకోవాలి. డాక్టర్లు సూచించిన సమయానికి టిఫా స్కానింగ్‌, రక్త పరీక్షలు చేయించుకోవాలి. దీనివల్ల బిడ్డ ఎదుగుదల, లోపాలు తెలుస్తాయి. ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సొంత వైద్యం మానుకుని వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.

జిల్లాలో వణికిస్తున్న గణాంకాలు..

--------------------------------------------

ఆర్థిక సంవత్సరం శిశు మరణాలు (0-1 ఏళ్లు) మాతృ మరణాలు మాతృ మరణాల రేటు

-----------------------------------------------------------------------------------

2023-24 215 14 44.94

2024-25 185 14 48.29 (ప్రమాదకరం)

2025-26(నవంబరు వరకు) 106 8 46.13

Updated Date - Jan 05 , 2026 | 12:06 AM