అంబేడ్కర్ ఆశయ సాధనకు కట్టుబడి ఉన్నాం
ABN , Publish Date - Apr 14 , 2026 | 11:59 PM
Ambedkar Jayanti celebrations భారత రాజ్యాంగ నిర్మాత, మహనీయుడు.. అంబేడ్కర్ ఆశయ సాధనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మంగళవారం అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని శ్రీకాకుళంలోని అంబేడ్కర్ జంక్షన్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
అణగారిన వర్గాల తలరాతను మార్చిన మహాశక్తి
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అరసవల్లి, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగ నిర్మాత, మహనీయుడు.. అంబేడ్కర్ ఆశయ సాధనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మంగళవారం అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని శ్రీకాకుళంలోని అంబేడ్కర్ జంక్షన్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అంబేడ్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. ‘అంబేడ్కర్ అణగారిన వర్గాల తలరాతను మార్చిన మహాశక్తి. చదువుతోనే ఏదైనా సాధ్యమని నిరూపించారు. మహిళల హక్కుల కోసం ఆనాడే రాజ్యాంగంలో రక్షణ కల్పించారు. దానికి కొనసాగింపుగా చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు అమలు చేసి, ఎన్డీఏ ప్రభుత్వం కొత్త అధ్యాయాన్ని సృష్టించబోతోంది. జిల్లాలోని సంజీవయ్య పార్కును సుందరంగా తీర్చిదిద్దుతాం. హాస్టళ్లు, పాఠశాలల్లో మౌలిక వసతులు, స్వచ్ఛమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామ’ని మంత్రి అచ్చెన్న తెలిపారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ‘రాజ్యాంగం మనకు ఎన్ని హక్కులు కల్పించినా, వాటిని అధికారులు, పాలకులు చిత్తశుద్ధితో అమలు చేసిన నాడే ప్రజలకు పూర్తిస్థాయి మేలు జరుగుతుంది. ప్రభుత్వం సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలను నిర్వహిస్తూ, పేదలకు అండగా నిలుస్తోంద’ని తెలిపారు.
ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్‌గా ఉన్న కాలంలోనే అంబేడ్కర్‌కు ‘భారతరత్న’ దక్కిందన్నారు. ఆయన స్ఫూర్తితోనే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, కల్పించిన ఘనత ఎన్టీఆర్‌దేనని గుర్తు చేశారు
ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. విద్యతోనే ఆత్మాభిమానం, వ్యక్తి వికాసం సాధ్యపడుతుందని నిరూపించి, రాజ్యాంగ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన గొప్పవ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. అలాగే సీనియర్ దళిత నాయకుడు బొడ్డేపల్లి నరసింహులు, ఇతర ప్రముఖులను మంత్రి అచ్చెన్నాయుడు ఘనంగా సత్కరించారు. లబ్దిదారులకు ఆటోలను, మహిళలకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో సాయిప్రత్యూష, కార్పొరేషన్ కమిషనర్ కూర్మారావు, చౌదరి బాబ్జీ, రమణ మాదిగ, మాదారపు వెంకటేష్, దుర్గారావు, మన్మథరావు, కవ్వాడి సుశీల, రాయి వేణు, గేదెల రమణమూర్తి పాల్గొన్నారు.