‘జలధార-జలహారతి’ని వేగవంతం చేయాలి
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:26 AM
జిల్లాలో జలధార-జలహారతి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు.
- లక్ష్యాలు పూర్తిచేయని వారిపై కఠిన చర్యలు
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జలధార-జలహారతి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ‘జలధార-జలహారతి’ పనుల పురోగతిపై డ్వామా, ఇరిగేషన్, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ‘జలధార’ కార్యక్రమం కింద రూ.24,851.78 లక్షల అంచనా వ్యయంతో మొత్తం 7,143 పనులను గుర్తించినట్టు తెలిపారు. ఇందులో ఇప్పటివరకు 4,247 పనులు ప్రారంభం కాగా, 3,428 పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయన్నారు. 819 పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఇంకా 1518 పనులు ప్రారంభం కావాల్సి ఉందని, వీటిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా యుద్ధప్రాతిపదిక పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వీటితోపాటు జిల్లాలో మెటీరియల్ కాంపోనెంట్ కింద మరో 799 పనులను గుర్తించి, త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. లావేరు, జలుమూరు మండలాల్లో అత్యధిక పనులు జరుగుతున్నాయని, మిగిలిన మండలాలు కూడా నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో కాలువలు, చెరువుల్లో పూడికతీత పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలన్నారు. ప్రతి నీటిబొట్టునూ సంరక్షించుకునేలా నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని ఆదేశించారు. పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫొటోలతో సహా అప్‌లోడ్ చేయాలని డ్వామా పీడీని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, సకాలంలో లక్ష్యాలను పూర్తిచేయకపోయినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ లవరాజు, ఇరిగేషన్ ఎస్‌ఈ సుధాకర్, జడ్పీ సీఈవో ఆర్.వెంకటరామన్, ఈఈలు, ఎంపీడీవోలు, ఏపీవోలు, జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.