Share News

జలవనరులకు జవసత్వాలు

ABN , Publish Date - Apr 16 , 2026 | 01:00 AM

గత వైసీపీ ప్రభుత్వ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన జలవనరుల శాఖకు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో జవసత్వాలు వచ్చాయి.

      జలవనరులకు జవసత్వాలు
దుర్గాగెడ్డ కాలువ ఇలా..

- ఆపరేషన్‌ మెయింటెనెన్స్‌ కింద రూ.14.62 కోట్లు మంజూరు

- చెక్‌డ్యాంల నిర్మాణానికి శ్రీకారం

- ఆనందంవ్యక్తం చేస్తున్న రైతులు

టెక్కలి రూరల్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన జలవనరుల శాఖకు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో జవసత్వాలు వచ్చాయి. ఖరీఫ్‌లో రైతులకు సాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతోంది. సాగునీటి రంగాన్ని బలోపేతం చేసేందుకు 100 రోజుల ప్రణాళిక తయారు చేసింది. దీనికోసం జిల్లాకు ఆపరేషన్‌ మెంటినేషన్‌ కింద రూ.14.62 కోట్లు మంజూరు చేసింది. దీనితోపాటు జలధార-జలహారతి కార్యక్రమం ద్వారా అధికారులు పనులను గుర్తిస్తున్నారు.

జిల్లాలో పరిస్థితి..

జిల్లాలో 6,654 సాగునీటి చెరువులు ఉన్నాయి. వంద ఎకరాల లోపు ఆయకట్టు గల చెరువులు 5,262, వంద ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్న చెరువులు 690 ఉన్నాయి. వీటిలో వంశధార కాలువల పరిధిలో 269 వరకు చెరువులు ఉన్నాయి. వీటి విస్తీర్ణం 1,89,269 ఎకరాలు ఉండవచ్చుననని అధికారులు గుర్తించారు. అయితే గత ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం ఈ చెరువులను నిర్లక్ష్యంగా వదిలేసింది. సాగునీటి రంగానికి రూపాయి కూడా మంజూరు చేయలేదు. దీంతో చెరువులు, కాలువలు గుర్రపు డెక్క, పూడికలు, పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. వర్షాపు నీరు వృథాగా పోతున్నా అప్పట్లో పట్టించుకునే పరిస్థితి లేదు. దీంతో సాగు నీరు అందక రైతులు ఇబ్బందులు పడేవారు. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యమిస్తోంది. తొలివిడతగా టెక్కలి మండలంలో చెక్‌డ్యాంల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. మొఖలింగాపురం పంచాయతీలో 7 పనులకు రూ.17.50లక్షలు, నర్సింగపల్లి పంచాయతీలో 8 పనులకు రూ.20 లక్షలు, లింగలవలస పంచాయతీలో 12 పనులకు గాను రూ.47 లక్షలు మంజూరు కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పనులు చేపడతాం

టెక్కలి మండలానికి మొదటి విడత నిఽధులు వచ్చాయి. మూడు పంచాయతీలో పనులు చేపడతాం. చెక్‌డ్యాంల నిర్మాణానికి అంచనాలు తయారు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ మేరకు 27 పనులకు అంచనాలు తయారు చేసి పంపించగా నిధులు మంజూరయ్యాయి.

-ప్రసాదరావు, ఎంపీడీవో, టెక్కలి

Updated Date - Apr 16 , 2026 | 01:00 AM