Share News

గొట్టా బ్యారేజీ దిగువకు నీరు విడుదల

ABN , Publish Date - Mar 25 , 2026 | 12:05 AM

వంశఽధార అధికారులు ఎట్టకేలకు గొట్టాబ్యారేజీ కిందకు నీటిని విడిచిపెట్టేశారు.

గొట్టా బ్యారేజీ దిగువకు నీరు విడుదల
నీరు విడిచిపెట్టిన దృశ్యం

రైతులు అడ్డుకోకుండా పోలీసు బందోబస్తు

హిరమండలం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): వంశఽధార అధికారులు ఎట్టకేలకు గొట్టాబ్యారేజీ కిందకు నీటిని విడిచిపెట్టేశారు. బ్యారేజీ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఎగువ ప్రాంతంలో నిల్వ ఉన్న నీటిని ఖాళీ చేయాల్సి ఉంది. ఇటీవల రెండుసార్లు గేట్లు ఎత్తి నీటిని విడిచిపెట్టిన సమయంలో రైతులు వచ్చి ఆందోళన చేపట్టడంతో అధికారులు ఆగిపోయారు. పనులు చేపట్టేందుకు సమయం మించిపోతుండడంతో మంగళవారం మరోసారి వంశఽధార అధికారులు ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడిచిపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఎడమ కాలువ ఆయకట్టు రైతులు బ్యారేజీ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే హిరమండలం ఎస్‌ఐ హేమంత్‌ కళ్యాణ్‌ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. రైతులు ఎవరైనా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. దీంతో రైతులు ధర్నా చేపట్టేందుకు వెనక్కి తగ్గారు. ఎడమ కాలువ ద్వారా నీటి విడుదలను నిలిపివేయడంతో వరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల పాటు నీరందిస్తే పంట చేతికి వస్తుందని, ఇలాంటి సమయంలో నీటిని బ్యారేజీ దిగువకు వదిలేయడం అన్యాయమని అన్నారు. తమ గోడును నాయకులు, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Mar 25 , 2026 | 12:05 AM