Share News

సిక్కోలుకు ‘జల’ హారం

ABN , Publish Date - Feb 15 , 2026 | 12:23 AM

ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్‌లో జిల్లాకు ప్రాధాన్యం లభించింది.

సిక్కోలుకు ‘జల’ హారం

- బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట

- వంశధార, తోటపల్లికి నిధుల ప్రవాహం

- ఎత్తిపోతల నిర్వహణకు రూ.20 కోట్లు

- పోర్టు నిర్మాణానికి రూ.3,844 కోట్లు

- అంబేడ్కర్‌ వర్సిటీకి కూడా కేటాయింపులు

- పప్పుధాన్యాల క్లస్టర్‌గా జిల్లా

శ్రీకాకుళం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్‌లో జిల్లాకు ప్రాధాన్యం లభించింది. ముఖ్యంగా జిల్లా రైతాంగం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న సాగునీటి ప్రాజెక్టులకు జీవం పోసేలా నిధుల కేటాయింపు జరిగింది. మరోవైపు జిల్లా ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేయగల మూలపేట పోర్టుకు భారీ ఆర్థిక భరోసాను కల్పించింది. గిరిజన ప్రాంతాల్లో వైద్యం, మైదాన ప్రాంతాల్లో సాగునీరు, విద్యారంగాలకు బడ్జెట్‌లో చోటు దక్కింది. బడ్జెట్‌ పత్రాల (వాల్యూమ్స్‌) ఆధారంగా జిల్లాకు దక్కిన కేటాయింపుల సమగ్ర విశ్లేషణ ఇది.

సాగునీటి రంగానికి ‘సింహభాగం’..

  • జిల్లా నీటి పారుదల రంగానికి బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యతనిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు రూ.14,276.89 కోట్లు కేటాయించగా, అందులో సింహభాగం మన జిల్లాలోని ప్రాజెక్టులకే దక్కాయి.

  • వంశధార స్టేజ్‌-2 పనులకు (నేరడి బ్యారేజీ పనులు, భూసేకరణ కలిపి) రూ. 167.14 కోట్లు, హిరమండలం రిజర్వాయర్‌ పనులకు రూ.79.12 కోట్లు, పబ్లిక్‌ అకౌంట్‌ డిపాజిట్ల కింద నేరడి బ్యారేజీకి అదనంగా రూ.6.95 కోట్లు, తోటపల్లి బ్యారేజీ పనులకు రూ.55.41 కోట్లు, మడ్డువలస ప్రాజెక్టుకు రూ. 12 కోట్లు, జిల్లాలోని ఎత్తిపోతల పథకాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా రూ.20 కోట్లు కేటాయించారు.

  • వరద జలాల వినియోగం కోసం ఉద్దేశించిన వంశధార-నాగావళి అనుసంధానికి రూ. 10 కోట్లు, ఉత్తరాంధ్ర జిల్లాల ఉమ్మడి ప్రాజెక్టు సుజల స్రవంతికి రూ.200 కోట్లు కేటాయించారు. దీనివల్ల భవిష్యత్తులో జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందే అవకాశం ఉంది.

  • జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మూలపేట (భావనపాడు) పోర్టు పనులు నిరంతరా యంగా సాగేందుకు బడ్జెట్‌ వాల్యూమ్‌-5 (గ్యారెంటీస్‌) ప్రకారం ప్రభుత్వం గరిష్టంగా రూ.3,884.70 కోట్ల మేర పూచీకత్తు కొనసాగిస్తోంది.

  • ప్రస్తుతం (డిసెంబరు 31, 2024 నాటికి) ఈ ప్రాజెక్టుపై రూ.2,081.88 కోట్ల అవుట్‌స్టాండింగ్‌ గ్యారెంటీ ఉంది. ఈ ఏడాది కూడా కొత్తగా గ్యారెంటీని వినియోగించుకున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

వ్యవసాయం- ‘ఆత్మనిర్భరత’ లో జిల్లా..

  • వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ‘మిషన్‌ ఫర్‌ ఆత్మనిర్భరత’లో జిల్లాకు చోటు దక్కింది.

  • పప్పుధాన్యాల క్లస్టర్‌ : రాష్ట్ర వ్యాప్తంగా పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన క్లస్టర్లలో జిల్లాను ఎంపిక చేశారు. ముఖ్యంగా మినుము సాగుకు జిల్లా అనుకూలమని గుర్తించారు.

  • హార్టికల్చర్‌ : జాతీయ హార్టికల్చర్‌ మిషన్‌ అమలవుతున్న రాష్ట్రంలోని 9 ప్రధాన జిల్లాల్లో శ్రీకాకుళం కొనసాగుతోంది.

విద్య - మౌలిక వసతలు..

  • ఎచ్చెర్లలోని అంబేద్కర్‌ విశ్వవిద్యాలయానికి గ్రాంట్ల రూపంలో రూ.6.65 కోట్లు కేటాయించారు.

  • జిల్లా కేంద్రంలో రూ.5 కోట్లతో చేపడుతున్న బీసీ భవన్‌ నిర్మాణం పూర్తయినట్లు బడ్జెట్‌ నివేదిక (స్టేటస్‌)లో వెల్లడించారు.

  • జిల్లాలోని అక్కుపల్లిలో మత్స్యకార విద్యార్థుల కోసం నడుస్తున్న రెసిడెన్షియల్‌ పాఠశాలకు రాష్ట్ర బడ్జెట్‌ నుంచి గ్రాంట్లు మంజూరయ్యాయి.

Updated Date - Feb 15 , 2026 | 12:23 AM