పరిశ్రమలకు నీరు.. ప్రజలకు కన్నీరు
ABN , Publish Date - Jun 06 , 2026 | 11:58 PM
Arbitrary excavations in industrial area పైడిభీమవరం పారిశ్రామికవాడలో కొన్ని పరిశ్రమల తీరుతో ప్రజలకు తాగు, సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఇక్కడి నీటిని, సహజ వనరులను వినియోగించుకుంటున్న పరిశ్రమల యజమానులు ఉద్యోగ, ఉపాధి విషయంలో మాత్రం స్థానికులకు అవకాశం కల్పించడం లేదు. పారిశ్రామిక అవసరాల కోసం ఇష్టారాజ్యంగా నీటిని వినియోగిస్తుండడంతో.. భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి.
పారిశ్రామికవాడలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు
పొలాల మీదుగా పైపులైన్లతో తరలింపు
స్థానిక రైతులకు అందని సాగునీరు
46 గ్రామాల్లో అడుగంటిన భూగర్భజలాలు
పైడిభీమవరం పారిశ్రామికవాడలో ఇటీవల ఓ పరిశ్రమ నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామం నుంచి పైపులైన్ ద్వారా నీటిని సేకరించి వినియోగించడం వెలుగులోకి వచ్చింది. ఆ పరిశ్రమ యాజమాన్యం వందలాది ఎకరాల జిరాయితీ భూముల్లో పైపులైన్ వేసింది. ఇటీవల పొలం పనుల్లో పైపులైన్ దెబ్బతింది. దీంతో తిరిగి సంబంధిత పరిశ్రమ ప్రతినిధులు రైతులపై కేసులు పెట్టారు.
రణస్థలం, జూన్ 6(ఆంధ్రజ్యోతి): పైడిభీమవరం పారిశ్రామికవాడలో కొన్ని పరిశ్రమల తీరుతో ప్రజలకు తాగు, సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఇక్కడి నీటిని, సహజ వనరులను వినియోగించుకుంటున్న పరిశ్రమల యజమానులు ఉద్యోగ, ఉపాధి విషయంలో మాత్రం స్థానికులకు అవకాశం కల్పించడం లేదు. పారిశ్రామిక అవసరాల కోసం ఇష్టారాజ్యంగా నీటిని వినియోగిస్తుండడంతో.. భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ముఖ్యంగా రణస్థలం మండలానికి భారీ ప్రమాదం పొంచి ఉంది. జిల్లాలో 76 గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. అందులో ఎచ్చెర్ల నియోజకవర్గంలోనే 70 గ్రామాలు ఉన్నాయి. రణస్థలం మండలంలో 46 గ్రామాలు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లావ్యాప్తంగా పారిశ్రామిక అవసరాలకు 2 కోట్ల 63 లక్షల లీటర్ల నీటిని వినియోగిస్తున్నాయి. అయితే ఒక్క పైడిభీమవరం పారిశ్రామికవాడలోనే 2కోట్ల లీటర్ల నీటిని వినియోగిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా 100 యూనిట్ల వరకూ నీరు ఊరితే.. 70 యూనిట్ల వరకూ వినియోగించుకోవచ్చు. కానీ అంతకంటే మించి నీటిని తోడేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే 110 యూనిట్ల వరకూ భూగర్భజలాలను తోడుతున్నారు. దీంతో సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. బావుల్లో సైతం నీరు అడుగంటుతుండడంతో తాగునీటికి అవస్థలు తప్పడం లేదని వాపోతున్నారు.
ఈ గ్రామాల్లో అధికం..
రణస్థలం మండలంలో 46 గ్రామాలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. అక్కాయపాలెం, అర్జునవలస, బంటుపల్లి, బోయపేట, చిల్లపేట రాజాం, చిట్టివలస, దేరశాం, గిరివానిపాలెం, గోసం, జగన్నాథరాజపురం, జీరుకొవ్వాడ, కొండములగాం, కోష్ట, కోటపాలెం, కొచ్చెర్ల, కృష్ణాపురం, మహంతిపాలెం, మరువాడ, మెంటాడ, ముక్తంపురం, నరసింహగోపాలపురం, నారువా, నెలివాడ, పాపారావుపేట, పాతర్లపల్లె, పాత సుందరపాలెం, పిసిని, పైడిభీమవరం, రామచంద్రాపురం, రణస్థలం, రావాడ, సంచాం, సీతంవలస, సీతంపేట, సూరంపేట, సూరపురం, టెక్కలి, తెప్పలవలస, తిరుపతిపాలెం, ఉప్పివలస, వల్లభరావుపేట, వరాహా నరసింహపురం, వరిశాం, వెల్పురాయి, వెంకటరావుపేట, ఎర్రవరం గ్రామాల్లో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. దాదాపు రణస్థలం మండలం మొత్తం ప్రమాదంలో ఉన్నట్టే. వీటికితోడు జి.సిగడాం మండలంలో 6, లావేరు మండలంలో 18 గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి.
నీటి వనరులను అభివృద్ధి చేస్తేనే..
నీటి ఎద్దడి నుంచి గట్టెక్కాలంటే.. ప్రధానంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలో తోటపల్లి కాలువ, నారాయణపురం ఆనకట్ట, బుడుమూరుగెడ్డ వంటి వాటిని ఆధునికీకరించాల్సిన అవసరం ఉంది. తోటపల్లి కాలువకు పుష్కలంగా సాగునీరు అందించాలి. పైడిభీమవరం చెంతనే ఉన్న కందివలస గెడ్డను ఆధునికీకరించాలి. గెడ్డలో ఉన్న పూడికను తొలగించాలి. పరిశ్రమలు వ్యర్థాలు వదలకుండా కట్టడి చేయాలి. లావేరు మండలంలో ఉన్న బుడుమూరు గెడ్డను సైతం ఆధునికీకరించాలి. ఎచ్చెర్ల మండలంలో ఉన్న నారాయణవలస కాలువను పునరుద్ధరించాలి. భవిష్యత్‌లో నీటిఎద్దడి నివారణకు ఈ దిశగా అధికారులు, పాలకులు చర్యలు చేపట్టాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.
నీటిని ఆదా చేయాలి
వర్షపునీటిని ఆదా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇంట్లో ఇంకుడుగుంత తవ్వుకోవాలి. అప్పుడే భూగర్భజలాలు ప్రమాదకర స్థితిలోకి వెళ్లవు. మరోవైపు పారిశ్రామిక అవసరాలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటే.. నీటి కొరత రాదు. జలధార, జలహారతి కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నాం.
- ఎన్‌వీకే దుర్గాప్రసాద్, జిల్లా భూగర్భ జలవనరుల శాఖ అధికారి, శ్రీకాకుళం