Share News

రైతులపై కందిరీగల దాడి

ABN , Publish Date - Jan 04 , 2026 | 12:17 AM

చీపుర్లపాడు పంచాయతీ ఊడికలపాడు గ్రామంలో పొలాలకు వెళ్లిన రైతులపై గత రెండు రోజులుగా కందిరీగలు దాడిచేస్తుండడంతో పలువురు గాయపడ్డారు.

రైతులపై కందిరీగల దాడి
ఒంటినిండా కప్పుకొని కూరగాయలు కోసేందుకు వెళ్తున్న ఓ రైతు

కోటబొమ్మాళి, జనవరి 3(ఆంధ్రజ్యోతి): చీపుర్లపాడు పంచాయతీ ఊడికలపాడు గ్రామంలో పొలాలకు వెళ్లిన రైతులపై గత రెండు రోజులుగా కందిరీగలు దాడిచేస్తుండడంతో పలువురు గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం గ్రామానికి చెందిన సనపల లక్ష్మణరావు దంపతులు కూరగాయలు కోసేందుకు పొలానికి వెళ్తుండగా.. యర్రబంద చెరువు వద్ద కందిరీగలు ఒక్కసారిగా గుంపుగా వచ్చి దాడి చేయడంతో భయంతో చెరువులో దిగి నీటి ములిగారు. వెంటనే గ్రామస్థులు వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శనివారం ఉదయం కూడా అదే చెరువు వద్ద హనుమంతు శశిభూషనరావు, ఆనందరావు, మెండ వెంకటరావు, వాయిలపల్లి తవుడుతో పాటు శ్రీపురం గ్రామానికి చెందిన మరో రైతుపై దాడిచేశాయి. వీరు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ గ్రామంలోని రైతులు అధికశాతం కూరగాయల పంటలు సాగుచేస్తూ శ్రీపురం కూరగాయల మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. సకాలంలో కూరగాయలు కోయకపోతే ముదిరిపోయే ప్రమాదం ఉన్నందున్న చేసేది లేక రైతులు దుస్తులు, ఇతరవాటిని పూర్తిగా కప్పుకొని వెళ్తున్నారు. అయితే ఈ కందిరీగల గుంపు ఎక్కడి నుంచి వస్తుందో తెలియక రైతులు భయపడుతున్నారు.

Updated Date - Jan 04 , 2026 | 12:17 AM