Share News

పలాస మునిసిపాలిటీలో పెరగనున్న వార్డులు

ABN , Publish Date - Apr 23 , 2026 | 12:17 AM

రాష్ట్ర ప్రభుత్వం వార్డుల పునర్విభజనకు శ్రీకారం చుట్టింది. జనాభా ప్రాతిపదికన వార్డుల పెంపునకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

పలాస మునిసిపాలిటీలో పెరగనున్న వార్డులు
పలాస-కాశీబుగ్గ వ్యూ

- 31 నుంచి 36కు పెరిగే అవకాశం

- పురపాలకసంఘంలో మూడు ప్రాంతాల విలీనానికి అధికారుల చర్యలు

-ఈ ప్రక్రియ పూర్తయితే 40 వార్డులతో ఎన్నికలు

పలాస, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం వార్డుల పునర్విభజనకు శ్రీకారం చుట్టింది. జనాభా ప్రాతిపదికన వార్డుల పెంపునకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో పలాస మునిసిపాలిటీ ముఖచిత్రం మారే అవకాశం ఉంది. ప్రస్తుతం మునిసిపాలిటీలో 31 వార్డులు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ వార్డుల్లో 45,851 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుత జనాభా ప్రకారం ఈ వార్డుల సంఖ్య 36కు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే, పలాసకు ఆనుకొని ఉన్న శాసనం పంచాయతీ, కోసంగిపురం వద్ద ఉన్న ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ నిర్వాసితుల కాలనీ, ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ గృహసముదాయాన్ని మునిసిపాలిటీలో కలిపేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. ఈ ప్రక్రియ పూర్తయితే కొత్తగా మరో నాలుగు వార్డులు పెరిగి మొత్తం 40 వార్డులతో పలాస-కాశీబుగ్గ గ్రేడ్‌-2 మునిసిపాలిటీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

ఇదీ పరిస్థితి..

పలాస మునిసిపాలిటీకి కూతవేటు దూరంలో శాసనం పంచాయతీ ఉంది. గత మునిసిపల్‌ ఎన్నికల్లోనే ఈ పంచాయతీని విలీనం చేసి ఎన్నికలు నిర్వహించేందుకు అఽధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ కారణంగానే శాసనంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. వాస్తవానికి పలాస మునిసిపాలిటీ ఏర్పడకముందే శాసనంను కలపాలని అధికారులు భావించారు. అయితే, అనివార్య కారణాల వల్ల శాసనంకు బదులు అడవికొత్తూరు, కోసంగిపురం, రాజాంకాలనీ, మీలగారంపాడు గ్రామాలను మునిసిపాలిటీలో విలీనం చేశారు. ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన వార్డుల సంఖ్యను పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో శాసనం పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. మెళియాపుట్టి మండలంలోని చీపురుపల్లి, నందిగాం మండలంలోని కొన్ని గ్రామాలకు చెందిన ఆఫ్‌షోర్‌ నిర్వాసితుల కోసం పలాస సమీపంలోని కోసంగిపురం వద్ద పది ఎకరాల్లో గృహ నిర్మాణాలు చేపడుతున్నారు. దీనికి సమీపంలోనే ఎన్టీఆర్‌ గృహ సముదాయం ఉంది. ఈ ప్రాంతంలో మూడువేలకు పైగా గృహాలు ఉన్నాయి. శాసనం, నిర్వాసితుల కాలనీ, ఎన్టీఆర్‌ గృహ సముదాయాన్ని కూడా మునిసిపాలిటీలో విలీనం చేస్తే అదనంగా ఐదువేలకు పైగా ఓటర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి ప్రభుత్వానికి సందేశాలు వెళ్లాయి.

ప్రభుత్వానికి నివేదించాం

పలాస-కాశీబుగ్గను గ్రేడ్‌-1 మునిసిపాలిటీగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మునిసిపాలిటీకి సమీపంలో ఉన్న శాసనం గ్రామంతో పాటు నిర్వాసితుల కాలనీ, ఎన్టీఆర్‌ గృహసముదాయాన్ని కూడా పురపాలకసంఘంలో కలుపుకొంటే అదనంగా వార్డులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం. మాస్టర్‌ప్లాన్‌ కూడా అమలు జరిగితే ఇది కష్టసాధ్యమైంది కాదు. ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తునే ఉంటుంది.

-గౌతు శిరీష, ఎమ్మెల్యే, పలాస

Updated Date - Apr 23 , 2026 | 12:17 AM