Share News

మొక్కజొన్నపై మాటల యుద్ధం

ABN , Publish Date - Apr 23 , 2026 | 12:14 AM

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంటపై జిల్లాపరిషత్‌ సర్వసభ్య సమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగింది.

  మొక్కజొన్నపై మాటల యుద్ధం
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, చిత్రంలో జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ

- రైతుల సమస్యలపై శాసనసభ్యులు సమాధానమివ్వాలి

- వైసీపీ జడ్పీటీసీలు, ఎంపీపీలు పట్టు

- దీటుగా బదులిచ్చిన కూటమి ఎమ్మెల్యేలు

- వాడీవేడిగా జడ్పీ సర్వసభ్య సమావేశం

శ్రీకాకుళం, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంటపై జిల్లాపరిషత్‌ సర్వసభ్య సమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగింది. రబీసీజన్‌లో అధికమంది రైతులు సాగు చేసిన మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని, 75 శాతం రైతులు తమ పంటను బయట వ్యక్తులకు విక్రయించారని.. మిగిలిన 25 శాతం మంది రైతులకైనా ఏ విధంగా ఆదుకుంటారో శాసన సభ్యులే సమాధానం చెప్పాలని వైసీపీ ఎంపీపీలు, జడ్పీటీసీలు పట్టుబట్టారు. దీనిపై కూటమి ఎమ్మెల్యేలు కూడా అంతే దీటుగా బదులిచ్చారు. దీంతో వారి మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. శ్రీకాకుళం జడ్పీ కార్యాలయంలో బుధవారం చైర్‌పర్సన్‌ పిరియా విజయ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా.. రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ మాట్లాడుతూ.. 2019 నుంచి 2024 వరకు రైతులకు ధరల స్థిరీకరణకోసం సుమారు రూ. 850 కోట్లు మాత్రమే వైసీపీ ప్రభుత్వం ఖర్చుచేస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏకంగా రూ.1850 కోట్లు వెచ్చించిందని వెల్లడించారు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే ఎప్పుడూలేని విధంగా రబీసీజన్‌లో పండించిన పంటను కొనుగోలు చేయడం ఇదే ప్రథమమని అన్నారు. రైతుల నుంచి మొక్కజొన్నను కొనుగోలు చేసేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. జగన్‌ అసెంబ్లీకి వస్తే బాగుంటుందన్నారు. 2034లో కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని అన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాట్లాడుతూ.. జడ్పీ సమావేశాల్లో ఇలా గొడవలు పెంచుకుంటే ప్రజల తరఫున ఎవరు మాట్లాడగలరని అన్నారు. తమ ప్రభుత్వం రైతులకు ఎంతో చేసింది. వైసీపీ హయాంలో రైతులకు ఏమీచేయకపోవడంతో కేవలం 11 సీట్లతో మిగిలిపోయిందని అన్నారు. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలోనే మొక్కజొన్న పంట అధికంగా ఉందన్నారు. తాము మాట్లాడడంబట్టే ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఇప్పటికే అసెంబ్లీలో మొక్కజొన్న రైతుల సమస్యలను తెలియజేశామని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. జగన్‌తో సహా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి రైతుల తరఫున మాట్లాడాలని అన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో వెంకట్రామన్‌, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, హిరమండలం జడ్పీటీసీ పి.బుచ్చిబాబు, ఉమ్మడి జిల్లాలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.

కిడ్నీ రోగులకు మందులు అందడం లేదు :పిరియా విజయ, జడ్పీ చైర్‌పర్సన్‌

కవిటి, ఇచ్ఛాపురంలో కిడ్నీ రోగులకు సరిగా మందులు అందడం లేదు. డయాలసిస్‌ రోగులకు పెన్షన్‌ అర్హత విషయంలో ఇబ్బంది తలెత్తుతుంది. నియోజకవర్గంలో లోవోల్టేజీ సమస్యతో ఇళ్లల్లో విద్యుత్‌ ఉపకరణాలు పాడవుతున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలి. ఉద్దానం వాటర్‌వర్క్స్‌ నిర్వహణకు ఎవరూ ముందుకు రావడంలేదు. పైపుల లీకేజీ సమస్య ఎక్కువగా ఉంది. రాజకీయాలతో సంబంధంలేకుండా తాగునీటిని అందరికీ అందేలాచేయాలి.

రోడ్ల పనులు ప్రారంభించలేదు : గౌతు శిరీష, పలాస ఎమ్మెల్యే

పంచాయతీరాజ్‌ శాఖ నుంచి పలాస నియోజకవర్గానికి రోడ్లు మంజూరైనా కొన్ని పనులు ప్రారంభించలేదు. 2014-19లో మంజూరైన కొన్ని రోడ్డు పనులు కూడా ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. వెంటనే అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలి. జల్‌జీవన్‌ మిషన్‌ పనులు కూడా సకాలంలో ప్రారంభించాలి.

హిరమండలానికి నీరు ఇవ్వరా? : గోవిందరావు, ఎమ్మెల్యే, పాతపట్నం

హిరమండలం రిజర్వాయర్‌ నుంచి వంద కిలోమీటర్ల మేర తాగునీరు వెళ్తోంది. కానీ హిరమండలం ప్రజలకు తాగునీరు అందడంలేదు. వేసవిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాతపట్నం, ఎల్‌ఎన్‌ పేట, కొత్తూరులో తాగునీటి సమస్యలు అధికంగా ఉన్నాయి. మా నియోజకవర్గ ప్రజల సమస్యలు పట్టించుకోకుంటే హిరమండలం నుంచి నీరు బయటకు వెళ్లనీయకుండా అడ్డుకుంటాం. ఐటీడీఏ అధికారులు ఏ జిల్లాలో ఉంటున్నారో కూడా తెలియడంలేదు.

కాంట్రాక్టరుపై చర్యలు తీసుకోరా..? : నిమ్మక జయకృష్ణ, ఎమ్మెల్యే, పాలకొండ

నింబూరు-ఓని రోడ్డు కాంట్రాక్టరుపై చర్యలు తీసుకోరా? రోడ్డు పనుల పూర్తికోసం కాంట్రాక్టరుకు టైమ్‌ బౌండ్‌ అనేది ఉండదా..? పాలకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను సమావేశానికి హాజరైతే మా జిల్లా నుంచి ఒక్క అధికారి కూడా హాజరుకాలేదు. దీనిపై చీఫ్‌సెక్రటరీకి కలెక్టర్‌ లెటర్‌ పెట్టాలి. సమావేశాలకు అధికారులందరూ హాజరవ్వాల్సిందే.

మన్యం, విజయనగరం అధికారులు ఎందుకురావడంలేదు : కూన రవికుమార్‌, పీయూసీ చైర్మన్‌

పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం జిల్లా అధికారులు కూడా శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశానికి తప్పనిసరిగా రావాల్సిందే. కానీ వారు హాజరుకావడం లేదు. దీనిపై ప్రిన్సిపల్‌ సెక్రటరీకి లేఖ రాయాలి. మూడు జిల్లాల కలెక్టర్లు కోఆర్డినేషన్‌గా ఉండాలి. గతంలో 30 శాతం ఉపాధిహామీ పనుల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని కేంద్రం గుర్తించి ఫేషియల్‌ యాప్‌ను తీసుకొచ్చింది. అయితే కొంతమందికి యాప్‌ ద్వారా హాజరుకానప్పుడు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేందుకు సీపీఆర్‌కు లేఖ రాయాలి. శ్రీకాకుళం జిల్లాలో క్యాన్సర్‌ వ్యాధి ప్రబలుతోంది. రాబోయే ఐదేళ్లలో సంఖ్యమరీ పెరిగే అవకాశముంది. దీనిపై యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకోవాలి. వేసవిలో తాగునీటి సమస్యలేకుండా చర్యలు తీసుకోవాలి.

పరిశ్రమలు వస్తున్నాయి : స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, కలెక్టర్‌

మూలపేట పోర్టు వద్ద పరిశ్రమలకు దరఖాస్తులు వస్తున్నాయి. త్వరలో భూములు కేటాయిస్తాం. పరిశ్రమలు వస్తేనే అనుబంధ ప్రగతి ఉంటుంది. అలాగే ఇక ఉపాధిహామీ పథకంలో కూలీలు పనులు అడిగిన 15రోజుల్లో పని కల్పించాల్సిందే. లేకుంటే పరిహారం చెల్లించాలి. కిడ్నీ మందులను పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం.

Updated Date - Apr 23 , 2026 | 12:14 AM