గట్లుపై నడుస్తూ.. గెడ్డ దాటుతూ
ABN , Publish Date - Feb 22 , 2026 | 11:37 PM
పాఠశాలకు వెళ్లేందుకు ఆ విద్యార్థులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. పొలాల గట్లపై నడుచుకుంటూ, దారి మధ్యలో వచ్చే గెడ్డలను దాటుకుంటూ బడికి వెళ్లి చదువుకుంటున్నారు.
- పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు
- చదువు కోసం తప్పని కష్టాలు
- ఇదీ దాసుపురం విద్యార్థుల పరిస్థితి
మెళియాపుట్టి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): పాఠశాలకు వెళ్లేందుకు ఆ విద్యార్థులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. పొలాల గట్లపై నడుచుకుంటూ, దారి మధ్యలో వచ్చే గెడ్డలను దాటుకుంటూ బడికి వెళ్లి చదువుకుంటున్నారు. ఇదీ మెళియాపుట్టి మండలంలోని ఆఫ్‌షోర్ నిర్వాసిత గ్రామం దాసుపురం విద్యార్థుల పరిస్థితి. ఆఫ్‌షోర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం ఐదేళ్ల కిందట దాసుపురం గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయించారు. పాఠశాలను మాత్రం అక్కడే ఉంచారు. ఈ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో నిర్వాసితుల కోసం ఇళ్లు మంజూరు చేశారు. ప్రస్తుతం నిర్వాసితులంతా అక్కడే ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నారు. అయితే, ఇక్కడ పాఠశాల ఏర్పాటుకు గత వైసీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. దీంతో పాత గ్రామం(దాసుపురం)లో ఉన్న పాఠశాలకే వెళ్లి విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతిరోజూ 14 మంది విద్యార్థులు పునరావాస కాలనీ నుంచి బయలుదేరి పొలాల గట్లపై నడుచుకుంటూ, జక్కర గడ్డను దాటుకుని మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్తున్నారు. దారిలో పాములతోపాటు జంతువులు కనిపిస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో వారికి ఏ ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై గత మూడేళ్ల నుంచి విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని సర్పంచ్ ఈశ్వరరావు అంటున్నారు. పాఠశాల సైతం శిథిలావస్థకు చేరుకుంది. శ్లాబ్ పెచ్చులు ఊడిపడుతున్నాయి. దీంతో నిర్వాసితులు ఖాళీ చేసిన ఓ పాడుబడిన ఇంటిలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆఫ్‌షోర్‌కు నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో అధికారులు నిర్వాసిత కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నిర్వాసిత కాలనీలోనే విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు తెలుపుతున్నారు. ఈ విషయమై మండల విద్యాశాఖ అధికారి ఎస్.దేవేంద్రరావును వివరణకోరగా.. ‘నిర్వాసిత గ్రామంలో పాఠశాల నిర్మాణానికి రూ.53 లక్షల వరకు అవసరమని ఇంజనీరింగ్ అధికారులు చెప్పారు. ప్రస్తుతం రూ.3లక్షల వరకు ఖర్చు చేసి ఒక గదిని నిర్మిస్తాం. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇక్కడే తరగతులు జరిగేలా చూస్తాం.’ అని తెలిపారు.