పునరుద్ధరణకు ఎదురుచూపు
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:40 PM
ఏడు దశాబ్దాల కిందట.. అప్పట్లో నేటి ఆధునిక సాంకేతికత లేదు.
- మూలకు చేరిన పొన్నాడ ఎత్తిపోతల పథకం
- పక్కనే నది ఉన్నా ఎండిపోతున్న పొలాలు
- ఎత్తిపోతలకు మళ్లీ ఊపిరిపోయాలంటున్న రైతులు
ఎచ్చెర్ల, జూన్ 8(ఆంధ్రజ్యోతి): ఏడు దశాబ్దాల కిందట.. అప్పట్లో నేటి ఆధునిక సాంకేతికత లేదు. ప్రభుత్వాల వద్ద భారీ బడ్జెట్‌లూ లేవు. కానీ, ఆ గ్రామంలోని రైతుల్లో ఒకటేకసి.. తమ పొలాలకు నీరు పారించాలని! పచ్చని పంటలు పండించాలని! ఆ కసే వారిని సమష్టిగా నడిపించింది. ప్రభుత్వాల కోసం ఎదురుచూడకుండా ఒకే తాటిపైకి వచ్చి సొంత శ్రమతో, ఆయిల్ ఇంజన్ల సాయంతో నాగావళి నది నుంచి నీటిని పైకి తెచ్చారు. అదే ఎచ్చెర్ల మండలంలోని పొన్నాడ ఎత్తిపోతల పథకం. అప్పట్లో అది ఒక సంచలనం. అలాంటి పథకం కాలక్రమేణా నిర్వహణకు నోచుకోక మూలకు చేరింది. నేడు పునరుద్ధరణ కోసం ఎదురుచూస్తోంది. ఈ పథకానికి మళ్లీ ఊపిరిపోయాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
1954-55 సంవత్సరంలో స్థానిక పెద్దలు పంచిరెడ్డి నీలయ్య నాయకత్వంలో పొన్నాడ డేనియల్ పర్యవేక్షణలో రైతులంతా చేతులు కలిపారు. నాగావళి నది ఒడ్డున పొన్నాడ వద్ద ఎత్తిపోతలకు (లిఫ్ట్ ఇరిగేషన్) రూపకల్పన చేశారు. ఆయిల్ ఇంజన్ల చప్పుడుతో నది నీరు పొలాల్లోకి పరుగులు పెడుతుంటే ఆ రైతుల కళ్లల్లో ఆనందం అంతా ఇంతా కాదు. పొన్నాడ, వెంకన్నగారిపేట, తెప్పరేవు గ్రామాల్లోని దాదాపు 700 ఎకరాలు పచ్చని పంటలతో కళకళలాడాయి. దాదాపు ఆరేడేళ్లు ఈ వ్యవస్థ ఒక అద్భుతంలా సాగింది. కాలక్రమేణా నారాయణపురం ఆనకట్ట అందుబాటులోకి వచ్చింది. కాలువ ద్వారా నీరు వస్తోంది కదా అని, రైతులు తాము ప్రాణపదంగా నిర్మించుకున్న ఎత్తిపోతల పథకాన్ని పక్కనబెట్టారు. అక్కడే అసలు కథ అడ్డం తిరిగింది. నారాయణపురం కుడి కాలువకు తోటపాలెం, పొన్నాడ, బొంతలకోడూరు, దర్మవరం, కొంగరాం, ముద్దాడ, కొత్తపేట, భగీరథపురం వంటి గ్రామాలు శివారు గ్రామాలుగా ఉన్నాయి. దీనివల్ల కాలువలో నీరు వదిలినా అది శివారు గ్రామాలకు చేరేసరికి కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. వర్షాలు ముఖం చాటిస్తే ఇక రైతుల కళ్లల్లో కన్నీళ్లే మిగులుతాయి. ఎంతో కష్టపడి సాగునీరు అందిస్తున్నా, పంటలు చేతికి వచ్చేసరికి దిగుబడి ఆశించిన స్థాయిలో రావడంలేదు. గతంలో జైకా నిధులతో ఆనకట్ట ఆధునికీకరణ పనులు మంజూరైనా అవి కూడా ఆగిపోయాయి.
పునరుద్ధరణే పరిష్కారం..
‘పక్కనే నది పారుతోంది.. కానీ మా పొలాలు మాత్రం ఎండిపోతున్నాయి’ అని రైతులు ఆవేదన చెందుతున్నారు. పొన్నాడ పరిసర గ్రామాల రైతుల కష్టాలన్నింటికీ ఒకే ఒక పరిష్కారం ఏడు దశాబ్దాల నాటి పొన్నాడ ఎత్తిపోతల పథకానికి మళ్లీ ఊపిరి పోయడమేనని అభిప్రాయపడుతున్నారు. దీనికోసం పొన్నాడ కొండపై ఒక ఆఽధునిక మోటారు షెడ్‌ను నిర్మించాలి. అక్కడి నుంచి కేవలం రెండున్నర కిలో మీటర్ల పైపులైన్ ద్వారా నీటిని నారాయణపురం 24/2 బ్రాంచ్ చానల్ హెడ్ వద్ద విడిచిపెట్టాలి. ఇలా చేస్తే నది నీరు నేరుగా బ్రాంచ్ చానల్‌లోకి చేరి, శివారు భూముల్లో ఉన్న ప్రతి ఎకరానికీ పుష్కలంగా సాగునీరు అందుతుంది.
నిధులు మంజూరు చేయాలి
ఏడు దశాబ్దాల కిందట మా పెద్దలు చేసి చూపించిన పని ఇది. కాలక్రమేణా ఇది మరుగున పడిపోయింది. ఇప్పుడు శివారు రైతులకు న్యాయం జరగాలంటే ప్రభుత్వం నిధులు మంజూరుచేసి ఈ ఎత్తిపోతలను పునరుద్ధరించాలి. అప్పుడే ఈ ప్రాంత రైతులకు సాగునీటి సమస్య ఉండదు.
- పంచిరెడ్డి కృష్ణారావు, నారాయణపురం ప్రాజెక్ట్ కమిటీ ఉపాధ్యక్షుడు