Share News

ఆగండి.. నెమ్మదిగా వెళ్లండి

ABN , Publish Date - Oct 05 , 2026 | 12:03 AM

Bridge works in disarray రణస్థలం అంటేనే వాహనదారులు, ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రణస్థలం వైపు వెళుతున్నారా? జాగ్రత్తగా ఉండండి అని ఇళ్లవద్ద చెబుతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. రణస్థలంలో జాతీయ రహదారిపై సుమారు 4 కిలోమీటర్ల మేర వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

ఆగండి.. నెమ్మదిగా వెళ్లండి

  • లేకపోతే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టే

  • రణస్థలం వద్ద అస్తవ్యస్తంగా వంతెన పనులు

  • కనీస నిబంధనలు పాటించని వైనం

  • సర్వీసు రోడ్లలో తేలుతున్న రాళ్లు, ఇసుక, దూళి

  • కానరాని హెచ్చరిక బోర్డులు.. తరచూ ప్రమాదాలు

  • కలెక్టర్‌, ఎస్పీ ఆదేశాలు బేఖాతరు

  • రణస్థలం, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి)

  • రణస్థలంలో సర్వీసు రోడ్డు ఇది. జాతీయ రహదారిపై ఒకవైపు వంతెన పనులు జరుగుతుండగా.. మరోవైపు సర్వీసు రోడ్డంతా మట్టి, ఇసుక పేరుకుపోయింది. దీంతో అటువైపుగా వస్తున్న వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. శనివారం ఓ ద్విచక్రవాహనదారుడు అదుపుతప్పి బోల్తాపడ్డాడు. ఈక్రమంలో వెనుకన కూర్చొన్న జి.గౌరమ్మ అనే మహిళ కూడా రోడ్డుపై పడిపోవడంతో ఆమె కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. (పై చిత్రం)

  • జాతీయ రహదారి విస్తరణ పనులు సక్రమంగా చేయండి. నిబంధనలు పాటించండి. ట్రాఫిక్‌ సూచిక బోర్డులు ఏర్పాటు చేయండి. ఎప్పటికప్పుడు రోడ్డుపై నీటి తడులు చేయండి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు నిలుపుకునే వీలుగా ఏర్పాట్లు చేయండి. సర్వీసు రోడ్డు పక్కాగా ఉండాలి. మీ నిర్లక్ష్యం మూలంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. మరోసారి అటువంటి ఘటనలు జరిగితే ఊరుకునేది లేదు.

  • - జూలై 4న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ కేవీ మహేశ్వర్‌రెడ్డి స్వయంగా పనులు పరిశీలించి చేసిన హెచ్చరికలు ఇవి.

  • రణస్థలం అంటేనే వాహనదారులు, ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రణస్థలం వైపు వెళుతున్నారా? జాగ్రత్తగా ఉండండి అని ఇళ్లవద్ద చెబుతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. రణస్థలంలో జాతీయ రహదారిపై సుమారు 4 కిలోమీటర్ల మేర వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రధాన రహదారి మార్గాన్ని మూసివేసి సర్వీసు రోడ్లలో రాకపోకలకు అనుమతించారు. దీంతో వాహన చోదకులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు సైతం తీవ్ర అసౌకర్యానికి గురవుతూ.. భయం మాటున గడుపుతున్నారు. ఇక్కడ వంతెన, రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించినప్పటి నుంచి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది క్షతగాత్రులయ్యారు.

  • గతేడాది డిసెంబరు 14న లావేరు మండలం వేణుగోపాలపురం గ్రామానికి చెందిన నర్సింగరావు బైక్‌పై వెళ్తూ ఇక్కడ గోతుల్లో పడి చనిపోయాడు. ఈ ఏడాది జనవరి 17న స్వాములపాలెం గ్రామానికి చెందిన యువకుడు తన తల్లితో కలిసి వెళుతుండగా బైక్‌ అదుపు తప్పింది. లారీ కిందపడడంతో చనిపోయాడు. ఏప్రిల్‌ 18న ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తరువాత రోజు మెళియాపుట్టి మండలానికి ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు.

  • కానరాని నిబంధనలు

  • విశాఖ నుంచి వచ్చే మార్గంలో దన్నానపేట సూర్యస్కూల్‌ వద్ద... శ్రీకాకుళం నుంచి వచ్చే మార్గంలో పాత పెట్రోల్‌ బంక్‌ వద్ద డైవర్షన్‌ ఇచ్చారు. రోడ్డు దాటాలంటే దాదాపు కిలోమీటరు వెళ్లాల్సి వస్తోంది. సర్వీసు రోడ్డుకు ట్రాఫిక్‌ మళ్లించడంతో ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, వాహనాలు నిలిపిన చోట ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. వందలాది వాహనాలు ఒకేసారి బారులు తీరుతున్నాయి. పనులు జరుగుతున్నచోట నిబంధనలు సూచించే బోర్డులు లేవు. హెచ్చరికల బోర్డులు కానరావడం లేదు. అటు హైవే అధారిటీ సంస్థ ప్రతినిధులు కానీ.. సిబ్బంది కానీ లేరు. ఎప్పటికకప్పుడు పరిస్థితిని చక్కదిద్దేందుకు అక్కడ జాతీయ రహదారుల సంస్థ సిబ్బంది ఉండాలి. స్థానిక పోలీసులతోపాటు వంతెన నిర్మాణ సంస్థతో సమన్వయం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సర్వీసు రోడ్లలో ఎప్పటికప్పుడు మట్టి, చెత్తను శుభ్రం చేసి వాటరింగ్‌ చేయాలి. కానీ అటువంటివేవీ కానరాకపోవడంతో ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనిపై కలెక్టర్‌, ఎస్పీ కొన్నాళ్ల కిందట హెచ్చరికలు జారీచేసినా.. బేఖాతరు చేయడం చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా నిర్మాణ సంస్థ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

  • ప్రత్యేక దృష్టి

  • రణస్థలంలో ఫ్లైఓవర్‌ పనుల దృష్ట్యా ట్రాఫిక్‌ ఇబ్బందులు కలుగుతున్నాయి. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. సిబ్బంది ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. ఇప్పటికే ప్రజలతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. రాంగు రూటులో వచ్చే వారికి అపరాధరుసుం వసూలు చేస్తున్నాం.

  • - వి.సత్యనారాయణ, జేఆర్‌ పురం ఎస్‌ఐ

Updated Date - Oct 05 , 2026 | 12:03 AM