Share News

కచ్చితత్వంతో ఓటర్ల జాబితా

ABN , Publish Date - Jun 25 , 2026 | 11:55 PM

The process must be completed within the stipulated time పారదర్శకంగా, అత్యంత ఖచ్చితత్వంతో ఓటర్ల జాబితా రూపొందించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌)-2026 ప్రక్రియపై జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌తో కలిసి ఈఆర్వోలతో సమావేశం నిర్వహించారు.

కచ్చితత్వంతో ఓటర్ల జాబితా
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తిచేయాలి

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి)ః పారదర్శకంగా, అత్యంత ఖచ్చితత్వంతో ఓటర్ల జాబితా రూపొందించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌)-2026 ప్రక్రియపై జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌తో కలిసి ఈఆర్వోలతో సమావేశం నిర్వహించారు. ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. సర్‌ ప్రక్రియకు సన్నద్దత, అధికారులు, సిబ్బందికి శిక్షణ, రాజకీయ పార్టీలతో సమావేశాలు, ఎన్యూమరేషన్‌(ఈఎఫ్‌) ఫారాల జనరేషన్‌, ప్రింటింగ్‌, బీఎల్‌వోల కిట్లు, తదితరాలపై చర్చించారు. పోలింగ్‌ స్టేషన్ల హేతుబద్దీకరణ, ఓటర్ల మ్యాపింగ్‌ గురించి వివరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ‘జూలై 14 వరకు బీఎల్‌వోల ద్వారా ఇంటింటి సర్వే జరుగుతుంది. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తాం. జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తాం. సెప్టెంబరు 22న తుది జాబితా ప్రచురిస్తాం. అర్హులందరూ తప్పనిసరిగా ఓటర్ల జాబితాలో ఉండాలి. అనర్హులు, మృతులు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు గలవారి ఓట్లను తొలగించి స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారుచేయాలి. బూత్‌స్థాయి అధికారులు తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లి ఈఎఫ్‌ ఫారాలను పంపిణీ చేయాలి. నిర్ణీత గడువులోగా పొరపాట్లు లేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయాల’ని ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ హరిఓం పాండ్యా, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఈఆర్‌ఓలు పద్మావతి, జయదేవి, లక్ష్మణమూర్తి, లావణ్య, ఆర్డీవోలు కె.సాయిప్రత్యూష, కృష్ణమూర్తి, కార్పొరేషన్‌ కమిషనర్‌ హెచ్‌.కూర్మారావు, జడ్పీ సీఈవో వెంకటరామన్‌, ఎన్నికల డీటీలు పాల్గొన్నారు.

పోర్టు సమస్యలను పరిష్కరించండి

మూలపేట పోర్టుకు సంబంధించిన పెండింగ్‌ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో.. పోర్టుకు సంబంధించిన భూసేకరణ, అటవీ, ఆర్‌ఓఆర్‌, ఆర్‌.ఆర్‌.కోలనీ, సీసీ రోడ్లు. మౌళిక వసతులకు సంబంధించిన పనులపై ఆరా తీశారు. నిర్ణీత సమయంలోగా పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

Updated Date - Jun 25 , 2026 | 11:55 PM