ఆధారం చూపితేనే ఓటు
ABN , Publish Date - Aug 23 , 2026 | 12:22 AM
Notices issued to 1,72,509 voters జిల్లాలో చాలామంది ఓటర్ల వివరాలు 2002 ఓటరు జాబితాకు అనుగుణంగా మ్యాపింగ్ కాలేదు. జాబితాలో పేర్లు నమోదైనా తప్పులు దొర్లాయి. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా తయారీ(సర్) తర్వాత ఇలాంటి వారందరి ఓట్లు తిరిగి సరి చేసేందుకు బూత్ లెవెల్ అధికారులు(బీఎల్‌వో) నోటీసులు జారీ చేస్తున్నారు.
‘సర్’ సర్వే తర్వాత 1,72,509 మంది ఓటర్లకు నోటీసులు
వివరాలు సరిచేసుకోవాలని అధికారుల సూచన
ధ్రువపత్రాలు సమర్పించేందుకు పాట్లు
మెళియాపుట్టి, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి):
మెళియాపుట్టి మండలం పెద్దలక్ష్మీపురం గ్రామానికి చెందిన కె.సంజీవురావు ఆర్మీ ఉద్యోగి. 2002 ఓటరు జాబితాలో ఈయన తండ్రి పేరుకు.. ఇటీవల సమర్పించిన ఎన్యూమరేషన్ ఫారంలో వివరాలకు తేడా వచ్చింది. తగు ఆధారాలు సమర్పించి.. ఆ వివరాలను సరిచేసుకోవాలని సంజీవరావు కుటుంబ సభ్యులకు అధికారులు నోటీసులు అందించారు. కాగా.. ఆర్మీ విధుల్లో ఉండడంతో.. సెలవులు దొరక్క అధికారుల ముందు సంజీవరావు హాజరుకాలేని పరిస్థితి నెలకొంది. దీంతో తన ఓటు తొలగించే పరిస్థితి ఉందని సంజీవరావు ఆందోళన చెందుతున్నాడు.
టెక్కలి మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన రాజాన రామారావు కుటుంబంలో ముగ్గురు ఉపాధి కోసం హైదరాబాద్ వలస వెళ్లారు. 2002 ఓటర్ల జాబితాకు వీరి వివరాలు మ్యాపింగ్ కాకపోవడంతో ఆ ముగ్గురికీ అధికారులు నోటీసులు పంపారు. ఆధారాలతో హాజరై వివరాలు సరిచేసుకోవాలని స్పష్టం చేశారు. కాగా.. వారు ప్రస్తుతం హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి రావాలంటే కనీసం రూ.10వేలు ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలో వారు రావడానికి ఆసక్తి చూపడం లేదు. ఇటువంటి వారి ఓట్లు తొలగించే అవకాశం ఉంది.
జిల్లాలో చాలామంది ఓటర్ల వివరాలు 2002 ఓటరు జాబితాకు అనుగుణంగా మ్యాపింగ్ కాలేదు. జాబితాలో పేర్లు నమోదైనా తప్పులు దొర్లాయి. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా తయారీ(సర్) తర్వాత ఇలాంటి వారందరి ఓట్లు తిరిగి సరి చేసేందుకు బూత్ లెవెల్ అధికారులు(బీఎల్‌వో) నోటీసులు జారీ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ సూచించిన ధ్రువపత్రాలు, తగు ఆధారాలు ఫలానా తేదీలోగా సమర్పించాలని సూచిస్తున్నారు. అలా అయితేనే ఓటు హక్కు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నోటీసులు అందుకున్న ఓటర్లు.. తమ ఓటు ఉంటుందో లేదోనని టెన్షన్ పడుతున్నారు. వారంతా ఎన్నికల కమిషన్ సూచించిన ధ్రువపత్రాలు ఇవ్వాలి. ఆపై సహాయ ఎన్నికల అధికారులు విచారించి శాశ్వత ఓటరు జాబితాలో నమోదుకు ప్రతిపాదిస్తారు. ఈ ప్రక్రియ వచ్చే నెల 20వరకూ కొనసాగనుంది. ఆ తర్వాతే ఓటరు జాబితాపై పూర్తి స్పష్టత వస్తుంది.
జిల్లాలో ఇదీ పరిస్థితి
జిల్లాలో 18,97,405 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 2002 ఓటర్ల జాబితాకు మ్యాపింగ్ కాకుండా, పేర్లు తప్పులుగా నమోదై.. రెండుచోట్ల ఓటుహక్కు కలిగినవారు 1,72,509 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారందరికీ తగు ఆధారాలు సమర్పించి.. వివరాలు సరిచేసుకోవాలని నోటీసులు ఇచ్చారు. నియోజకవర్గాల వారీ పరిశీలిస్తే.. ఇచ్ఛాపురంలో 31,631 మందికి, పలాసలో 20,600, టెక్కలిలో 20,879, పాతపట్నంలో 19,819 శ్రీకాకుళంలో 24,634, ఆమదాలవలసలో 15,173, ఎచ్చెర్లలో 22,606 నరసన్నపేటలో 17,167 మంది ఓటర్లకు నోటీసులు అందజేశారు. నిర్ణీత సమయంలోగా తగు ఆధారాలతో హాజరుకావాలని సూచించారు. ఓటరు జాబితాలో తప్పులు లేకుండా పేర్లు నమోదుకు ఆధార్‌తోపాటు మరో గుర్తింపు కార్డు అందించాలని పేర్కొన్నారు. వీరంతా ఆయా ధ్రువపత్రాలు సమర్పించేందుకు పాట్లు పడుతున్నారు.
ఇవీ కారణాలు
తల్లిదండ్రులు పిల్లల మధ్య వయసు వ్యత్యాసం 15 సంవత్సరాలు తక్కువగా వుండడం, తల్లి దండ్రులు, పిల్లల మధ్య 50 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండడం, ఓటరు తాత, నానమ్మల మధ్య వయసు తేడా 40 సంవత్సరాల కంటే తక్కువ ఉండడం, ప్రస్తుత ఓటరు జాబితా, 2002 ఓటరు జాబితా మధ్య తండ్రి పేరు తేడా ఉండడం, సంతానం మధ్య వయసు తేడా 9నెలల కంటే తక్కువ ఉండడం, సంతానం ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువ కలిగి ఉండడం, తల్లి తండ్రి పేరు తప్పుగా నమోదు కావడం, ప్రస్తుత ఓటరు జాబితాలో వున్న పేరుకు 2002ఓటరు జాబితాలో వున్న పేరుకు మధ్య పొంతన లేకపోవడం తదితర కారణాలతో చాలామంది ఓటర్ల విషయంలో ఎన్నికల కమిషన్‌కు అభ్యంతరాలు ఉన్నాయి.
ఆధారాలిస్తే ఓటు భద్రం
ఓటరు పేరు, ఇంటిపేరు, తండ్రి పేరు వంటి వివరాలు తప్పులు లేకుండా చూసే బాధ్యతను బూత్ లెవెల్ అధికారులకు ఎన్నికల కమిషన్ అప్పగించింది. ఆధార్ కార్డుతోపాటు పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, విద్యార్హత ధ్రువపత్రం, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం వంటి 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక కార్డును ఓటరు బిఎల్‌ఓకు అందించాలి. ఈ గుర్తింపు కార్డుల ఆధారంతో పాటు గ్రామంలో నివసిస్తున్న ఓటరుగా బీఎల్‌వోలు సంతృప్తి చెందాలి. తిరిగి తప్పులు లేని ఓటరుగా నమోదు చేసేందుకు తయారు చేసిన జాబితాను సహాయ ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న తహసీల్దార్, ఎంపీడీవోలు విచారిస్తారు. వారు స్వయంగా ఓటరుతో మాట్లాడనున్నారు. ఇందుకు సెప్టెంబర్ 20 వరకు ప్రత్యేక క్యాంపులను గ్రామాల వారీగా ఏర్పాటు చేయనున్నారు. అర్హత వున్న ప్రతి ఒక్కరి ఓటును జాబితాలో తిరిగి నమోదు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై మెళియాపుట్టి తహసీల్దార్ బి.పాపారావు వద్ద ప్రస్తావించగా.. నోటీసులు అందుకున్న ఓటర్లు.. అందులో వివరాలను చదివి.. అధికారులు నిర్దేశించిన తేదీ నాటికి తగు ఆధారాలతో హాజరుకావాలని తెలిపారు. లేదంటే వారి ఓటు తొలగించబడుతుందన్నారు.