ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ‘ప్రజాదర్బార్’
ABN , Publish Date - Mar 03 , 2026 | 12:16 AM
Central minister 'Praja Darbar కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజాసమస్యల పరిష్కారంలో వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టారు.
ఆన్‌లైన్‌లో వినతులు స్వీకరించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు
శ్రీకాకుళం, మార్చి 2(ఆంధ్రజ్యోతి): కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజాసమస్యల పరిష్కారంలో వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో విధి నిర్వహణలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, సొంత జిల్లావాసుల కష్టాలు తీర్చేందుకు సాంకేతికతను జోడించి సరికొత్త విధానాన్ని తెరపైకి తెచ్చారు. సోమవారం ఆయన వర్చువల్(వీడియో కాన్ఫెరెన్స్) విధానంలో ప్రజాదర్బార్ (గ్రీవెన్స్) కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులో ఉన్న కేంద్రమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లాప్రజలు తమ వినతులను అందించగా.. ఢిల్లీలోని తన కార్యాలయంలో ఉన్న రామ్మోహన్‌నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ.. 56 మంది అర్జీదారుల వినతులు స్వీకరించారు. అక్కడికక్కడే అధికారులతో ఫోన్‌లో మాట్లాడి.. ఆయా వినతుల పరిష్కారానికి ఆదేశాలు జారీచేశారు.
నియోజకవర్గ స్థాయికి..
సామాన్యుల సమస్యలకు సత్వర పరిష్కారం చూపేందుకు ఈ ఆన్‌లైన్ గ్రీవెన్స్ ఎంతో దోహదపడుతుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత విస్త్రృతం చేస్తామన్నారు. జిల్లా కేంద్రానికే పరిమితం కాకుండా, పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఈ ఆన్‌లైన్ గ్రీవెన్స్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఢిల్లీలో ఉన్నా.. తమ సమస్యల పరిష్కారానికి కేంద్రమంత్రి చొరవ చూపడంపై జిల్లావాసులు సంతోషం వ్యక్తం చేశారు.