Share News

ఆదిదేవుడి పూజకు వేళాయె

ABN , Publish Date - Sep 12 , 2026 | 11:56 PM

Vinayaka Chavithi pandals getting decked up విఘ్నాలు తొలగించే ఆదిదేవుడు.. వినాయకచవితి వేడుకలు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో ఎక్కడ చూసినా వినాయక మండపాలు, విద్యుత్‌ అలంకరణ ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. వేడుకల మాటున ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉండడంతో పోలీస్‌శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.

ఆదిదేవుడి పూజకు వేళాయె
శ్రీకాకుళం జడ్పీ రోడ్డులో ఏర్పాటు చేస్తున్న వినాయక మండపం

  • రేపటి నుంచి వినాయకచవితి ఉత్సవాలు ప్రారంభం

  • ముస్తాబవుతున్న మండపాలు

  • పోలీసుల ముందస్తు జాగ్రత్తలు

  • సింగిల్‌ విండోలో అనుమతులు

  • పక్కాగా నిబంధనలు పాటించాల్సిందే

  • శ్రీకాకుళం అర్బన్‌, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): విఘ్నాలు తొలగించే ఆదిదేవుడు.. వినాయకచవితి వేడుకలు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో ఎక్కడ చూసినా వినాయక మండపాలు, విద్యుత్‌ అలంకరణ ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. వేడుకల మాటున ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉండడంతో పోలీస్‌శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే వినాయక మండపాల అనుమతులు, నిర్వహణ విషయంలో పూజా కమిటీలు, గ్రామపెద్దలు, రాజకీయ నాయకులను భాగస్వామ్యం చేస్తూ.. వారికి కొన్ని బాధ్యతలు అప్పగించింది. సింగిల్‌ విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తోంది. అనుమతి పొందిన మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ సదుపాయం కల్పించనుంది. జిల్లాలోని 30 మండలాల పరిధిలో 42 పోలీసుస్టేషన్లు ఉన్నాయి. మండపాలకు అనుమతి కోసం నిర్వాహకులు వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. ఈసారి ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన అనుమతులను ఒకే వేదిక ద్వారా సులభంగా పొందేలా ఈ సింగిల్‌ విండో విధానాన్ని రూపొందించారు. ‘హెచ్‌టీటీపీ: //డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. జీఏఎన్‌ఈఎస్‌హెచ్‌ యూటీఎస్‌ఏవీ.నెట్‌’ ద్వారా దరఖాస్తు చేసుకుని అనుమతులను సులువుగా పొందవచ్చునని అధికారులు, పోలీసులు సూచించారు. ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితమని స్పష్టం చేశారు.

  • క్యూఆర్‌ కోడ్‌తో అనుమతి

  • అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న మండపాలను పోలీస్‌ అధికారులు పరిశీలిస్తారు. అనుమతిస్తూ.. ఓ క్యూఆర్‌ కోడ్‌ అందజేస్తారు. దానిని వినాయక మండపాల దగ్గర అతికించాలని సూచిస్తున్నారు. వినాయక మండపాల ఏర్పాటుకు ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది కమిటీగా ఏర్పడి వారి వివరాలు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అందించాలి. మండపాలు ఏర్పాటు చేసే స్థలం ప్రైవేటుది అయితే యజమాని అనుమతి.. ప్రభుత్వానిదైతే పంచాయతీ, మున్సిపాలిటీ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. పోలీసుల అనుమతి కోసం వారు అందించే నమూనా దరఖాస్తుపై ఉత్సవ కమిటీ పేరు, విగ్రహం పెట్టే ప్రదేశం, తేదీ, విగ్రహం ఎత్తు, నిమజ్జనం తేదీ, ఊరేగింపు తేదీ, నిమజ్జనం చేసే ప్రదేశం, అన్న సమారాధన తేదీ స్పష్టంగా నమోదు చేయాలి. తేదీల వారీగా సాంస్కృతిక కార్యక్రమాలు వివరాలు రాయాలి. ఆ దరఖాస్తుతోపాటు మునిసిపాలిటీ, పంచాయతీ, ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌, ట్రాన్స్‌కో శాఖ అనుమతులు జత చేయాలి. ప్రతి వినాయక విగ్రహం వద్ద కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. బలవంతపు చందాలు వసూలు చేయరాదు. దర్శనాలకు టిక్కెట్లు పెట్టరాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

  • పాటించాల్సిన నిబంధనలు

  • పర్యావరణ పరిరక్షణ మట్టి విగ్రహాలను మాత్రమే ఉపయోగించాలి. అనుమతి ఉన్న స్థలంలో పటిష్టమైన మండపాలను ఏర్పాటు చేసుకోవాలి. అగ్నిప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు మండపాల వద్ద నిరంతరం పర్యవేక్షిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇసుక, నీరును మండపాల వద్ద సిద్ధంగా ఉంచాలి. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బాక్స్‌టైప్‌ స్పీకర్లు మాత్రమే వినియోగించాలి. రాత్రి సమయంలో మండపం వద్ద కమిటీ సభ్యులు కాపలా ఉండాలి. సీసీ కెమేరాలు తప్పనిసరిగా ఉండాలి. మండపాల వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకూడదు. విగ్రహాల ఊరేగింపు సమయంలో అశ్లీలపాటలు, డ్యాన్స్‌లు వేయకూడదు. రంగులు చల్లడం, లౌడ్‌స్పీకర్లు ఉపయోగించడం, బాణసంచా కాల్చడం వంటివి చేయకూడదు.

  • నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు: డీఎస్పీ

  • వినాయక మండపాల వద్ద నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద తెలిపారు. శనివారం తన కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ‘జిల్లాలో వినాయక మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో 3,946 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 2,359 మండపాలకు అనుమతులు ఇచ్చాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే వినియోగించాలి. మండపాల వద్ద డీజేలను వినియోగిస్తే సీజ్‌ చేస్తాం. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా.. శ్రీకాకుళంలో రెండు వంతెనలపై క్రేన్‌ల సాయంతో గణపతి విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేశాం. ఊరేగింపులో ఎవరైనా మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తామ’ని తెలిపారు.

  • అనుమతులు తప్పనిసరి: ఎస్పీ

  • వినాయకచవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు, ఉత్సవ కమిటీలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కె.వి.మహేశ్వరెడ్డి కోరారు. ‘వినాయక మండపాలు, విగ్రహాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌ అనుమతులు ఉండాలి. పోలీస్‌, అగ్నిమాపక, మున్సిపల్‌, విద్యుత్‌, రెవెన్యూశాఖల అనుమతి తీసుకోవాలి. మండపాల వద్ద సీసీ కెమేరాలు అమర్చాలి. డీజేలకు అనుమతి లేదు. మద్యం సేవించి వాహనాలు నడపరాదు. అత్యవసర సమయాల్లో డయల్‌ 112కు సమాచారం ఇవ్వాల’ని ఎస్పీ సూచించారు.

Updated Date - Sep 12 , 2026 | 11:56 PM