Share News

సిక్కోలుకు విమాన యోగం

ABN , Publish Date - Jun 07 , 2026 | 12:04 AM

Greenfield Airport in Palasa సిక్కోలు వాసుల చిరకాల కల నెరవేరబోతోంది. జిల్లా గగనతలంలో విమానాలు విహరించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆమోదించిన ‘ఆంధ్రప్రదేశ్‌ ఏవియేషన్‌ పాలసీ 2026’(జీవో ఎం.ఎస్‌. నంబర్‌ 16)లో జిల్లాకు వరాల జల్లు కురిసింది.

సిక్కోలుకు విమాన యోగం

  • పలాసలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌

  • జిల్లాకు ఒక హెలీపోర్ట్‌.. పర్యాటకానికి కొత్త ఊపు

  • భోగాపురం విమానాశ్రయం.. ఎంఆర్‌ఓ హబ్‌గా అభివృద్ధి

  • యువతకు రూ.10 లక్షల వరకు స్కాలర్‌షిప్‌లు

  • ఏవియేషన్‌ పాలసీలో జిల్లాకు ప్రాధాన్యం

  • శ్రీకాకుళం, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి) : సిక్కోలు వాసుల చిరకాల కల నెరవేరబోతోంది. జిల్లా గగనతలంలో విమానాలు విహరించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆమోదించిన ‘ఆంధ్రప్రదేశ్‌ ఏవియేషన్‌ పాలసీ 2026’(జీవో ఎం.ఎస్‌. నంబర్‌ 16)లో జిల్లాకు వరాల జల్లు కురిసింది. మౌలిక సదుపాయాల కల్పన, పర్యాటక రంగ అభివృద్ధి, స్థానిక యువతకు ఉపాధి లక్ష్యంగా జారీచేసిన ఈ నూతన పాలసీలో జిల్లాకు సంబంధించి ప్రయోజనాలను ప్రభుత్వం పొందుపరిచింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 150 కిలోమీటర్లకు ఒక విమానాశ్రయం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా 10 గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అందులో జిల్లాలోని పలాస ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు జీవో ప్రకటించింది. దీనివల్ల ఉత్తరాంధ్ర చిట్టచివరి ప్రాంతమైన ఉద్దానంతోపాటు, ఒడిశా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల ప్రజలకు, వ్యాపారులకు విమాన ప్రయాణం మరింత చేరువ కానుంది. పలాస జీడిపప్పు తదితర వాణిజ్య ఉత్తత్తుల ఎగుమతులకు ఈ ఎయిర్‌పోర్ట్‌ ఎంతో ఉపయోగపడుతుందని వ్యాపారవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

  • జిల్లాకో హెలీపోర్ట్‌ .. సామాన్యుడికి చేరువగా...

  • కేవలం విమానాశ్రయాలే కాకుండా సామాన్యులకు సైతం హెలీకాప్టర్‌ సేవలను(హెలీ-టాక్సీ) చేరువ చేసే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక హెలీపోర్ట్‌ లేదా హెలీప్యాడ్‌ను అభివృద్ధి చేయాలని ఏవియేషన్‌ పాలసీలో లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ప్రకారం మన జిల్లాలోనూ త్వరలో ఒక అధికారిక హెలీపోర్ట్‌ ఏర్పాటు కానుంది. అత్యవసర వైద్య సేవలు (హెచ్‌ఈఎంఎస్‌), విపత్తు నిర్వహణ, పర్యాటక ప్రాంతాల సందర్శన కోసం ఈ సేవలు ఎంతో కీలకం కానున్నాయి.

  • ‘భోగాపురం’తో మహర్దశ

  • జిల్లాకు కూతవేటు దూరంలో ఉన్న విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని పాలసీలో స్పష్టం చేశారు. ఈ ఎయిర్‌ పోర్టును కేవలం ప్రయాణికుల కోసమే కాకుండా, విమానాల మరమ్మతులు, నిర్వహణ చూసుకునే ఎంఆర్‌ఓ(మెంటినెన్స్‌, రిపైర్‌ అండ్‌ ఓవర్‌హాల్‌) ఎకోసిస్టమ్‌ హబ్‌గా కూడా అభివృద్ధి చేయనున్నట్లు పాలసీలో పేర్కొన్నారు. దీనివల్ల జిల్లాలోని రణస్థలం, పైడిభీమవరం లాంటి పారిశ్రామికవాడలకు భారీ లాజిస్టిక్స్‌ ఊతం లభించనుంది. ఎంఆర్‌ఓ కేంద్రం రాకతో జిల్లాకు చెందిన ఐటీఐ, పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌ యువతకు విమానయాన రంగంలో వేలాది పరోక్ష ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.

  • పైలెట్‌ అవ్వాలనుకునే యువతకు భారీ స్కాలర్‌షిప్‌

  • ఏవియేషన్‌ రంగాన్ని కేవలం రవాణాకే పరిమితం చేయకుండా ఉపాధి కల్పన వేదికగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. విమానయాన రంగంలో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్‌ ఏవియేషన్‌ యూనివర్శిటీ’, ఫ్లైట్‌ ట్రైనింగ్‌ ఆర్గనైజేషన్స్‌ (ఎఫ్‌టీఓఎస్‌) తదితర కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.

  • మన రాష్ట్రంలో కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ (సీపీఎల్‌) శిక్షణ పొందే మొదటి 1000 మంది విద్యార్థులకు కోర్సు ఫీజులో 30 శాతం (రూ.10లక్షల వరకు) భారీ స్కాలర్‌ షిప్‌ను ప్రభుత్వం అందించనుంది.

  • మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులకు అదనంగా మరో రూ.2 లక్షల స్కాలర్‌షిప్‌ కూడా ఇస్తారు.

  • సిమ్యులేషన్‌ సెంటర్ల ద్వారా శిక్షణ పొందే వారికి అదనంగా మరో 10 శాతం (రూ. 5 లక్షల వరకు) స్కాలర్‌షిప్‌ అందుతుంది. ఖరీదైన పైలట్‌, ఏవియేషన్‌ విద్యను అభ్యసించాలనుకునే యువతకు ఈ పథకాలు అద్భుతమైన అవకాశంగా మారనున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Updated Date - Jun 07 , 2026 | 12:04 AM