అమ్మా.. కరుణించమ్మా
ABN , Publish Date - May 05 , 2026 | 12:07 AM
Devotional celebrations జిల్లాలో గ్రామదేవత ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సంస్కృతీ సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా అమ్మవార్లను పూజిస్తూ.. భక్తులు మొక్కులు చెల్లిస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా గ్రామదేవత ఉత్సవాలు
సంస్కృతీ సంప్రదాయాలతో సంబరాలు
వెల్లివిరుస్తున్న ఆధ్యాత్మిక శోభ
రణస్థలం, మే 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామదేవత ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సంస్కృతీ సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా అమ్మవార్లను పూజిస్తూ.. భక్తులు మొక్కులు చెల్లిస్తున్నారు. అమ్మవార్లను తమ ప్రాంతాలకు పోలేరమ్మ, ఎల్లారమ్మ, పట్టాలమ్మ, గోగులమ్మ తదితర పేర్లతో కొలుస్తారు. ప్రధానంగా వైశాఖ మాసంలో వచ్చే ఐదు మంగళవారాలను మంగళకరంగా భావించి గ్రామదేవతల ఉత్సవాలను జరుపుతారు. ఏడాది, మూడేళ్లు, ఐదేళ్లు, తొమ్మిదేళ్లు, పదేళ్లు, పదకొండేళ్లు, పన్నెండేళ్లు, పదిహేనేళ్లకోసారి... ఇలా తమ గ్రామ ఆచారాలను అనుసరించి ఉత్సవాలు నిర్వహిస్తారు. తమ ఊరును, పాడి పంటలను, కుటుంబ సభ్యులను కాపాడాలని కోరుతూ పూజలు చేస్తారు.
ఐక్యమత్యం కోసం..
గ్రామదేవత ఉత్సవాలు కేవలం ఆధ్మాత్మిక చింతనే కాకుండా.. ఐక్యమత్యం కోసం నిర్వహిస్తుంటారు. కుల, మత, రాజకీయ వర్గ విభేదాలను పక్కనపెట్టి అంతా ఏకతాటిపైకి వస్తారు. కుటుంబ స్థితిగతులు, జీవన పరిస్థితులు, వృత్తి, వ్యాపారం, ఉద్యోగం ఆదాయాన్ని అనుసరించి విరాళాలు, చందాలు పోగుచేస్తారు. వ్యవసాయాధారిత కుటుంబాలకు ఎకరాకు ఇంత చొప్పున కేటాయిస్తారు. తమ బంధువులను, స్నేహితులు, సన్నిహితులను పిలిచి గ్రామదేవత సంబరాలను ఘనంగా చేస్తారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా గ్రామదేవత ఉత్సవాల కోసం రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నారు.
ఇదో ప్రత్యేకం..
గ్రామదేవతల పండుగలో ప్రతి ఘట్టం కీలకమే. అమ్మవార్లకు దండకం చదివి..శంఖం ఊది.. పసుపు, కుంకుమలతో పూజలు చేస్తారు. ఉత్సవాల్లో మహిళలు అలంకరించిన బోనాలు, ఘటాలను ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి వాటిని సమర్పిస్తారు. కొత్తకుండలో పసుపునీళ్లు పోసి.. పసుపు బొట్లతో అందంగా అలంకరిస్తారు. కుండకు వేపాకుల తోరణాలు కడతారు. కొత్త తెల్లని వస్త్రంతో నవధాన్యాలు పోస్తారు. ఘటం ఎత్తే ముందు దీపం వెలిగించి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. ప్రతీ ఇంటికీ మామిడాకులు, వేపాకులతో తోరణాలు కడతారు. కోళ్లు, మేకలకు బలి ఇచ్చి అమ్మవారిని పూజిస్తారు.
ఎందరికో ఉపాధి..
గ్రామదేవతల పండుగలంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమంది ఉపాధి. కనుమరగయ్యే ప్రాచీనకళలు, పౌరాణిక కళలు జీవం పోసుకుంటాయి. ప్రధానంగా పల్లెల్లోనే ఈ ఉత్సవాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అందుకే డ్రామాలు, బుర్రకథలు, గ్రామీణ కళలకు ఎక్కువగా ఆదరణ ఉంటుంది. కాళికా నృత్యాలు, డప్పువేషాలు, తప్పెటగుళ్లు, పులివేషాలు, కోలాటం, చెక్కభజన, బిందెల డ్యాన్స్, కోయిడ్యాన్స్, పాండురంగ భజన ఇలా అన్ని ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక జాయింట్ వీల్ ఇతరత్రా పిల్లలను ఆకర్షించే అనేక రకాల ఈవెంట్లతో పదుల సంఖ్యలో కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి.
దశాబ్దాల ఆనవాయితీ..
మా గ్రామంలో ఈ ఏడాది గ్రామదేవత ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఎంత దూరంలో ఉన్నా.. ఏ దేశంలో స్థిరపడినా. . ఇక్కడకు వస్తున్నారు గ్రామస్థులు. గ్రామదేవతను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటారు. గ్రామంలో ప్రజల మధ్య ఎన్నిరకాల విభేదాలు ఉన్నా.. గ్రామదేవత ఉత్సవాల విషయంలో తామంతా ఒక్కటేనని చాటి చెబుతాం.
- రౌతు శ్రీనివాస్, పైడిభీమవరం
ప్రతీ ఇంటి పండుగ
గ్రామదేవత ఉత్సవాలు అంటే ప్రతీ ఇంటి పండుగ. ప్రతీ గ్రామానికి రక్షగా గ్రామదేవతలు ఉంటారు. అందుకే ఆ దేవతకు చల్లదనం కోసం ఉత్సవాలు చేస్తుండాలి. ఇదో ఆనవాయితీగా పెట్టుకోవాలి.
- కుప్పిలి శ్రీనివాసరావు, పైడిభీమవరం