Share News

కూటమితోనే గ్రామాల అభివృద్ధి

ABN , Publish Date - Jul 13 , 2026 | 11:35 PM

Special plan to provide irrigation and drinking water గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. సోమవారం నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలంలో రూ.4.33 కోట్లతో పలు అభివృద్ధి పనులను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి ఆయన ప్రారంభించారు.

కూటమితోనే గ్రామాల అభివృద్ధి
పోలాకి మండ లం గొల్లలవలస -డీపీఎన్‌ బీటీ రోడ్డును ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

సాగు, తాగునీరు కల్పనకు ప్రత్యేక ప్రణాళిక

ప్రతి కుటుంబానికి సొంతిల్లు ఉండేలా ప్రభుత్వ యోచన

కేంద్రమంతి కింజరాపు రామ్మోహన్‌నాయుడు

పోలాకి/ నరసన్నపేట, జూలై 13(ఆంధ్రజ్యోతి): గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. సోమవారం నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలంలో రూ.4.33 కోట్లతో పలు అభివృద్ధి పనులను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి ఆయన ప్రారంభించారు. గొల్లలవలస చెరువు నుంచి డీపీఎన్‌ రోడ్డు వరకు రూ.కోటితో బీటీ రోడ్డు నిర్మించారు. రూ.12.98 లక్షలతో హెల్త్‌ క్లినిక్‌, దీర్గాశి నుంచి గొల్లలవలస వరకు రూ.80లక్షలతో బీటీ రోడ్డు, కొల్లివలస- మబగాం వరకు రూ.1.90 కోట్లతో సీసీ రోడ్డు నిర్మించారు. మబగాం నుంచి కాంచీపేట వరకు రూ.50 లక్షలతో సీసీ రోడ్డు, జల్‌జీవన్‌ పథకం కింద కాంచీపేటకు రూ.15లక్షలతో రక్షితనీటి పథకాన్ని నిర్మించారు. వీటన్నింటినీ కేంద్రమంత్రి సోమవారం ప్రారంభించారు. మబుగాం కాలనీలో రూ.21.10లక్షలతో రక్షితనీటి పథకానికి శంకుస్థాపన చేశారు. దీర్గాశిలో రచ్చబండ నిర్వహించారు. కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ‘గత పాలకుల నిర్లక్ష్యంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. ప్రస్తుత కూటమి పాలనలో గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తున్నాం. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం. రైతులకు సాగునీరు, సకాలంలో ఎరువులు అందించి.. పెట్టుబడి వ్యయం కోసం ‘అన్నదాత సుఖీభవ పథకం’ ద్వారా డబ్బులు జమ చేశాం. భవిష్యత్‌లో ప్రతి కుటుంబానికీ ఇళ్లు నిర్మిస్తాం. ఎక్కడా తాగునీటి ఇబ్బందులు లేకుండా కుళాయిల ఏర్పాటుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామ’ని తెలిపారు.

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ ‘నరసన్నపేట నియోజకవర్గంలో సాగునీరు సక్రంగా అందించేందుకు రూ.9కోట్లు మంజూరు చేశాం. ఈఏడాది ఖరీప్‌లో 37వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం కాగా.. ఇప్పటికే 18,500 మెట్రిక్‌ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. కౌలురైతులు.. రైతు సేవా కేంద్రాలకు వెళ్లి ఏపీఏమ్స్‌ యాప్‌లో తమపేరు ఉందో లేదో సరిచూసుకోవాల’ని తెలిపారు.

ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ ‘నియోజకవర్గంలో ప్రతీ గ్రామానికి పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పిస్తాం. రోడ్లు ద్వారా గ్రామాలను అనుసంధానం చేసి సరికొత్త అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు తోడ్పాటుతో.. పూర్తిస్థాయిలో తాగునీరు, సాగునీటిని అందించేలా మరింత కృషి చేస్తున్నామ’ని తెలిపారు.

కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బగ్గు అర్చన, వంశధార ప్రాజెక్టు చైర్మన్‌ అరవల రవీంద్ర, కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ రోణంకి కృష్ణంనాయుడు, తహసీల్దార్‌ పి.శ్రీనివాసరావు, ఎంపీడీవో రవికుమార్‌, డీఎంహెచ్‌వో అనిత, వైద్యాధికారి విజయ్‌శ్రీనాథ్‌, పల్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 13 , 2026 | 11:35 PM