గ్రామ కట్టుబాట్లు అడ్డొచ్చాయి
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:29 AM
గ్రామ కట్టు బాట్లతో తన తండ్రి చితికి నిప్పుపెట్టలేని పరిస్థితి ఆ కుమారుడికి కలిగింది.
తండ్రి అంత్యక్రియలకు కుమారుడు దూరం
భర్త చితికి నిప్పుపెట్టిన భార్య
కంచిలి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): గ్రామ కట్టు బాట్లతో తన తండ్రి చితికి నిప్పుపెట్టలేని పరిస్థితి ఆ కుమారుడికి కలిగింది. దీంతో తన తల్లే తండ్రికి అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది. ఈ ఘటన జ లంత్రకోట పంచాయతీ గోకర్ణపురంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గోకర్ణపురం కాలనీకి చెందిన బల్ల వైకుంఠరావు(40) కొన్నాళ్లగా అనా రోగ్యంతో బాధపడుతున్నాడు. ఇతడికి భార్య గౌరి, డిప్లొమో చదువుతున్న కుమారుడు చరణ్, ఆరో తరగతి చదువుతున్న కుమార్తె హారిక ఉన్నారు. ఈ క్రమంలో వైకుంఠరావు బుధవారం మృతి చెందాడు. దీంతో అంత్యక్రియలు కుమారుడు చేయాల్సి ఉంది. అయితే గ్రామ కట్టుబాట్ల ప్రకారం తలకొరివి పెట్టేవారు గ్రామం దాటి బయటకు వెళ్లకూడదు. అయితే చరణ్ డిప్లొమో పరీక్షలు హాజరుకావాల్సి ఉంది. దీంతో తప్పని పరిస్థితుల్లో గౌరి తన భర్త చితికి నిప్పంటించి దహన సంస్కారాలు చేసింది. ఇంటి పెద్ద మృతి చెందడంతోపాటు ఆరేళ్ల కుమార్తెకి సైతం గుండెలో రంధ్రం ఉన్నట్లు ఇటీవల వైద్యులు వెల్ల డించడంతో ఆ తల్లి భోరున విలపిస్తోంది. నిరుపేద కుటుంబం కావడం, ఇంటి పెద్ద అకాల మరణంతో రోడ్డున పడ్డామని కన్నీటి పర్యంతమ వుతుంది. గౌరి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, కుమార్తెకు ఉచితంగా వైద్యం చేయించేంచాలని ఆ గ్రామస్థులు కోరుతున్నారు.