బాధితులు అధైర్యపడొద్దు
ABN , Publish Date - Feb 27 , 2026 | 12:31 AM
Spread of diarrhea ‘శ్రీకాకుళంలో డయేరియా అదుపులోనే ఉంది. అధికారుల చర్యలతో నాలుగు రోజుల్లోనే సాధారణ స్థితికి చేరుకుంది. బాధితులెవరూ అధైర్యపడొద్దు. అన్ని విధాలా ఆదుకుంటామ’ని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
నాలుగు రోజుల్లోనే సాధారణ స్థితికి..
డయేరియా ప్రబలకుండా పటిష్ఠ చర్యలు
కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు
అరసవల్లి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): ‘శ్రీకాకుళంలో డయేరియా అదుపులోనే ఉంది. అధికారుల చర్యలతో నాలుగు రోజుల్లోనే సాధారణ స్థితికి చేరుకుంది. బాధితులెవరూ అధైర్యపడొద్దు. అన్ని విధాలా ఆదుకుంటామ’ని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. గురువారం శ్రీకాకుళంలోని డయేరియా ప్రభావితమైన మంగువారితోట, కాకివీధి, కండ్రవీధి, దమ్మలవీధి ప్రాంతాల్లో ఆయన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి పర్యటించారు. కండ్రవీధిలో డయేరియా బాధిత మృతుడు సురేష్ కుటుంబాన్ని పరామర్శించి.. ఓదార్చారు. ఆయా వీధుల్లో బాధితులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ‘భవిష్యత్‌లో డయేరియా రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతీరోజు తాగునీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపిస్తున్నాం. కలుషిత ఆహారం వల్ల కూడా డయేరియా రావచ్చని దుకాణాలను తనిఖీ చేస్తూ, అనుమానం ఉన్న వాటిని మూసివేయిస్తున్నాం. ట్యాంకర్లతో పరిశుభ్రమైన నీటిని సరఫరా చేస్తున్నాం. మునిసిపల్ మంచినీటి సరఫరా ట్యాంకులను శుభ్రం చేయించాం. అన్ని ప్రాంతాల్లో నిరంతర పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయి. రూ.100కోట్లకుపైగా నిధులతో నగర కార్పొరేషన్‌లో కాలువల నిర్మాణం, తాగునీటి సరఫరాకు సంబంధించి శాశ్వత చర్యలు చేపడతాం. ప్రస్తుతానికి కిమ్స్, జెమ్స్, జీజీహెచ్‌లో బాధితులకు మెరుగైన చికిత్సలు అందుతున్నాయి. వీరిని నిరంతరం అధికారులు అత్యంత అప్రమత్తంగా పర్యవేక్షిస్తున్నారు. నిజానికి గత వైసీపీ పాలనలో నిర్లక్ష్యమే నేటి పరిస్థితి ఒక నిదర్శనం. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత శ్రీకాకుళంలోని మౌలిక వసతులపై పూర్తిస్థాయిలో దృష్టి సారించామ’ని కేంద్రమంత్రి తెలిపారు. అనంతరం కిమ్స్, రిమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పడంతో సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్‌కుమార్, డీఎంహెచ్‌వో డా.అనిత, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.లుకలాపు ప్రసన్న కుమార్, ఆర్‌ఎంవో డా.సుభాషిణి, రిమ్స్ వైద్యకళాశాల ప్రిన్సిపాల్ అప్పలనాయుడు, కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
జవాబుదారీగా పనిచేయాలి
తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, పారిశుధ్య నిర్వహణ విషయంలో కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది జవాబుదారీగా ఉండాలని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు స్పష్టం చేశారు. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన జిల్లా అధికారులతో కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కేంద్రమంత్రి మాట్లాడుతూ ‘ప్రస్తుతం నగరంలో డయేరియా సాధారణ స్థితికి వచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. నీటి నమూనాల పరీక్షల కోసం స్థానికంగానే కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. నీటి నమూనాల వివరాల సేకరణ, వాటి ఫలితాలను నివేదికల రూపంలో పొందుపరచి, వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. జిల్లా అధికారులు వాటిని పరిశీలించి.. త్వరలో మునిసిపల్ శాఖ నుంచి మంజూరవుతున్న నిధులతో డ్రెయిన్లు, పారిశుద్ధ్యం పక్కాగా చేయాలి. పారిశుద్ధ్యంలో సమస్యలు ఉంటే తక్షణం పరిష్కరించాలి. ఒక సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేయాల’ని ఆదేశించారు. కలెక్టర్, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉద్యోగుల బదిలీలు హెచ్‌వోడీ స్థాయిలో జరుగుతుండడం స్థానికంగా అందే సేవలకు ఇబ్బందిగా మారిందని, దానిపై దృష్టి సారించాలని మంత్రిని కోరారు. కార్పొరేషన్‌లో కీలకంగా ఉండాల్సిన అధికారులు దీర్ఘకాలిక సెలవులు పెడుతున్నారని తెలిపారు. కాంట్రాక్టర్లు రోడ్ల నిర్మాణానికి ముందుకొస్తూ.. కాలువల నిర్మాణంలో అశ్రద్ధ వహిస్తున్నారని.. రెండింటికీ కలిపి టెండర్లు నిర్వహించాలని కోరారు. సమీక్షలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, పబ్లిక్ హెల్త్ ప్రత్యేకాధికారి ప్రభాకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.