జనసేనకే వైస్‌చైర్మన్ పదవి
ABN , Publish Date - Nov 25 , 2026 | 12:08 AM
Councilors elect Ashok unanimously పలాసలో జనసేన పార్టీకి చెందిన ఒకటో వార్డు(మొగిలిపాడు) కౌన్సిలర్ వాడరేవు అశోక్‌కే వైస్‌చైర్మన్ పదవి వరించింది. అశోక్ పేరును 3వ వార్డు కౌన్సిలర్ సవర రాంబాబు(టీడీపీ) ప్రతిపాదించగా, 19వ వార్డు కౌన్సిలర్ గోళ్ల లత బలపరిచారు. మిగిలిన కూటమి సభ్యులు ఆమోదం తెలపడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పలాసలో అశోక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న కూటమి కౌన్సిలర్లు
పలాస, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): పలాసలో జనసేన పార్టీకి చెందిన ఒకటో వార్డు(మొగిలిపాడు) కౌన్సిలర్ వాడరేవు అశోక్‌కే వైస్‌చైర్మన్ పదవి వరించింది. పలాస-కాశీబుగ్గ మునిసిపల్ వైస్‌చైర్మన్ స్థానాన్ని ముందుగా టీడీపీ కౌన్సిలర్ (29వ వార్డు) టంకాల రవిశంకర్‌గుప్తాకు కేటాయించారు. కూటమి పొత్తులో భాగంగా ఆదివారం రాత్రి ఆయనను కాకుండా.. జనసేన కౌన్సిలర్ వాడరేవు అశోక్‌కు ఖరారు చేశారు. దీనిపై టీడీపీ కౌన్సిలర్లు మనస్తాపం చెందడంతో.. సోమవారం జరగాల్సిన వైస్ చైర్మన్ ఎన్నిక.. కోరం లేక మంగళవారానికి వాయిదా పడిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు అధిష్ఠానంతో మాట్లాడారు. తప్పని పరిస్థితుల్లో వైస్‌చైర్మన్ జనసేనకు కేటాయించాల్సి వచ్చిందని చెప్పడంతో.. అశోక్ ఎంపిక లాంఛనమైంది. మంగళవారం మున్సిపల్ సమావేశ మందిరంలో అశోక్ పేరును 3వ వార్డు కౌన్సిలర్ సవర రాంబాబు(టీడీపీ) ప్రతిపాదించగా, 19వ వార్డు కౌన్సిలర్ గోళ్ల లత బలపరిచారు. మిగిలిన కూటమి సభ్యులు ఆమోదం తెలపడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్‌చైర్మన్‌గా ఆయనతో ఎన్నికల అధికారి సీహెచ్ శ్రీనివాసరావు ప్రమాణం చేయించారు. అశోక్‌ను చైర్‌పర్సన్ వజ్జ గంగాభవాని, కమిషనర్ ఇ.శ్రీనివాసులు, కౌన్సిలర్లు అభినందించారు.
జనసేన కౌన్సిలర్ల తడబాటు
కౌన్సిల్ సమావేశంలో బి-ఫారం మేరకు ఎన్నికల అధికారి శ్రీనివాసరావు వైస్‌చైర్మన్‌గా అశోక్‌పేరును ప్రకటించినా.. అభ్యర్థిని ప్రతిపాదించడం, బలపరచడం విషయంలో మిగిలిన జనసేనకు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు ఏమి చేయాలో తెలియక తడబడ్డారు. అరగంట పాటు అశోక్ బెంచి వద్ద నిలబడాల్సి వచ్చింది. ఎన్నికల అధికారులు కూడా అయోమయానికి గురయ్యారు. దీంతో చైర్‌పర్సన్ వజ్జ గంగాభవాని కలుగజేసుకుని వైస్‌చైర్మన్‌ను తమ సభ్యులే బలపరచడం, ప్రదిపాదించడం చేయాలని సూచించారు. అనంతరం టీడీపీ సభ్యులు వైస్‌చైర్మన్ పదవి కోసం ప్రతిపాదించి బలపరచడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అలక వహించిన రవిశంకర్‌గుప్తా
టీడీపీ నాయకుడు టంకాల రవిశంకర్‌గుప్తా అలక వహించారు. వైస్‌చైర్మన్ ఎన్నికకు ఆయన గైర్హాజరయ్యారు. వైస్‌చైర్మన్ పదవి ఆయనకు ఇస్తున్నట్లు ముందుగానే ప్రకటించడంతో ఆయనతో పాటు టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. అయితే అనూహ్యంగా ఆయన్ను తప్పించి జనసేనకు ఈ సీటు కేటాయించడంతో తీవ్రమనస్తాపం చెందారు. ఆయనను ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్‌రావు, పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు, కార్యదర్శి సప్ప నవీన్ ఓదార్చారు.
గైర్హాజరైన వైసీపీ కౌన్సిలర్లు
వైస్‌చైర్మన్ ఎంపిక కార్యక్రమానికి వైసీపీ సభ్యులు గైర్హాజరయ్యారు. ఆ పార్టీకి చెందిన మొత్తం నలుగురు కౌన్సిలర్లు సోమవారం హాజరయ్యారు. కానీ మంగళవారం నిర్వహించిన సమావేశంలో వైస్‌చైర్మన్ ఎన్నికకు మాత్రం రాలేదు.