Share News

జిల్లా చరిత్రలో తొలిసారి..

ABN , Publish Date - Apr 27 , 2026 | 12:25 AM

Vice President visit ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాలను సందర్శించనున్నారు. ఉప రాష్ట్రపతి పదవిలో ఉండగా శ్రీకాకుళంలో పర్యటించడం జిల్లా చరిత్రలోనే ఇది తొలిసారి కావడం గమనార్హం.

జిల్లా చరిత్రలో తొలిసారి..
డచ్‌ బంగ్లా వద్ద హెలీప్యాడ్‌ల ఏర్పాటును పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ, జేసీ, కేంద్ర బృంద సభ్యులు

నేడు జిల్లాకు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ రాక

పర్యటన మార్గాల్లో భద్రతా తనిఖీలు

శ్రీకూర్మం, అరసవల్లి క్షేత్రాలను పరిశీలించిన ఏఎస్‌ఎల్‌ బృందం

కేంద్ర బృందంతో కలిసి కలెక్టర్‌, ఎస్పీ ఏర్పాట్ల పర్యవేక్షణ

శ్రీకాకుళం/ అరసవల్లి/ క్రైం/ గార, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాలను సందర్శించనున్నారు. ఉప రాష్ట్రపతి పదవిలో ఉండగా శ్రీకాకుళంలో పర్యటించడం జిల్లా చరిత్రలోనే ఇది తొలిసారి కావడం గమనార్హం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాను గతంలో దివంగత మాజీ రాష్ట్రపతులు వీవీ గిరి, ఏపీజే అబ్దుల్‌కలాం, మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తదితర ప్రముఖులు సందర్శించారు. వారంతా పదవీకాలం ముసిగిన తర్వాతే జిల్లాకు వచ్చారు. ఈ నేపథ్యంలో అధికారిక హోదాలో ఉన్న ప్రస్తుత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ రాకకు జిల్లాలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా పర్యటన ముగిసే వరకు జిల్లాలో ప్రైవేట్‌ డ్రోన్ల వినియోగంపై పూర్తి నిషేధం విధించారు. ఆదివారం కేంద్ర భద్రతా విభాగంతో కలిసి ముందస్తు తనిఖీలు చేపట్టారు. అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాలతోపాటు.. మిల్లు జంక్షన్‌, డచ్‌ బంగ్లా నుంచి పర్యటన సాగే మార్గాలను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, కేంద్ర హోంశాఖ, ఉప రాష్ట్రపతి సెక్రటేరియట్‌ అధికారులు స్వయంగా పరిశీలించి సమీక్షించారు. ప్రొటోకాల్‌ అధికారి అమిత్‌ శర్మ, అశుతోష్‌తోపాటు సీఆర్పీఎఫ్‌-2 ఇన్‌ కమాండ్‌(2ఐసీ) ధర్మబీర్‌ జాకర్‌ క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులకు కీలక సూచనలు చేశారు. ఉపరాష్ట్రపతితోపాటు వీఐపీలు ఆలయానికి చేరుకునే మార్గంలో ప్రత్యేక నిఘా ఉండాలని స్పష్టం చేశారు. అలాగే కలెక్టరేట్‌ వద్ద డచ్‌బంగ్లా ఆవరణలో హెలీప్యాడ్‌ను పరిశీలించారు. పర్యటన సందర్భంగా శ్రీకూర్మం, అరసవల్లి క్షేత్రాలను సర్వాంగసుందరంగా అలంకరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి పర్యటనలో లోపాలు లేకుండా అధికారులతా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. తనిఖీల్లో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌, ఆర్డీవోలు సాయిప్రత్యూష, కృష్ణమూర్తి, డీఎస్పీ వివేకానంద, సీఐ పైడపునాయుడు, ఎస్‌ఐ గంగరాజు, తహసీల్దార్‌ చక్రవర్తి, ఎంపీడీవో శ్రీనివాసులు, డిప్యూటీ ఎంపీడీవో రమేష్‌, ఈవోలు కేఎన్‌వీడీవీ ప్రసాద్‌, వాసుదేవరావు, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఇంటెలిజెన్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు పాల్గొన్నారు.

పర్యటన షెడ్యూల్‌ ఇలా..

సోమవారం ఉదయం 10.50 గంటలకు బాదుర్లపేటలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ చేరుకుంటారు. 11.30 గంటలకు శ్రీకూర్మం చేరుకుని స్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 12.10 గంటలకు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12.35 గంటలకు శ్రీకాకుళంలోని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు నివాసానికి చేరుకుంటారు. 1.40 గంటలకు తిరిగి బాదుర్లపేట హెలీప్యాడ్‌ నుంచి బయలుదేరి విశాఖపట్నానికి పయనమవుతారు.

Updated Date - Apr 27 , 2026 | 12:25 AM