Share News

అరసవల్లి, శ్రీకూర్మంలో ఉపరాష్ట్రపతి

ABN , Publish Date - Apr 28 , 2026 | 12:22 AM

Vice President Tour at srikakulam జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన శ్రీకూర్మం, అరసవల్లి ఆలయాలను భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ సోమవారం దర్శించుకున్నారు.

అరసవల్లి, శ్రీకూర్మంలో ఉపరాష్ట్రపతి
ఆదిత్యుడి సన్నిధిలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కె.శ్రీనివాస్‌, ఎమ్మెల్యే గొండు శంకర్‌, అర్చకులు

  • ప్రత్యేక పూజలు చేసిన సీపీ రాధాకృష్ణన్‌

  • కేంద్రమంత్రి నివాసంలో ఆత్మీయ సమావేశం

  • శ్రీకాకుళం/అరసవల్లి/గార, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన శ్రీకూర్మం, అరసవల్లి ఆలయాలను భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ సోమవారం దర్శించుకున్నారు. తొలుత డచ్‌బంగ్లా హెలీప్యాడ్‌ వద్ద ఉపరాష్ట్రపతికి కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, డీఐజీ గోపీనాథ్‌ జెట్టి, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు గొండు శంకర్‌, నడుకుదిటి ఈశ్వరరావు, మామిడి గోవిందరావు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి మిల్లు జంక్షన్‌ మీదుగా కాన్వాయ్‌లో నేరుగా శ్రీకూర్మం చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో, వేదమంత్రాలతో స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతి లక్ష్మీతయారు సన్నిధి, వైష్ణవి దుర్గామాతను దర్శించుకోవడంతో పాటు స్తంభాలపై శిల్ప సంపదను, దేవతా భాషల్లో లఖించిన శాసనాలను చూసి ముగ్ధులయ్యారు. తూర్పు, పశ్చిమ దిశల్లో ఉన్న రెండు ధ్వజస్తంభాలను కూడా దర్శించుకున్నారు. ఆతర్వాత ఆలయం ఎదురుగా శ్వేత పుష్కరిణిని విశిష్టతను ఆలయ అర్చకుడు సీహెచ్‌ మురళీకృష్ణను అడిగి తెలుసుకున్నారు

  • శ్రీకూర్మక్షేత్రం అద్భుతం

  • శ్రీకూర్మంలో ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ అతి ప్రాచీనమైన ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దర్శనం తర్వాత ఉప రాష్ట్రపతికి ప్రదక్షిణ మండపం వద్ద ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. స్వామివారి శేష వస్ర్తాన్ని అందజేశారు. స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని దేవాదాయశాఖాధికారులు అందించారు. అనంతరం తిరిగి వెళ్తూ రోడ్డుపక్కనే అరుగుపై సాంప్రదాయ దుస్తులతో కనిపించిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు నరసింహ మాస్టార్‌ను చూసి కాసేపు మాట్లాడారు. అక్కడే ఉన్న భక్తుల వద్దకు వెళ్లి పలకరించారు. ఇద్దరు పేద మహిళలకు రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు.

  • తర్వాత కారులో అరసవల్లి ఆదిత్యుడి సన్నిధికి చేరుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ నేతృత్వంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆదిత్యుడ్ని దర్శించుకున్న అనంతరం వేదపండితులు, అర్చకులు ఆయనకు ఆలయ అనివెట్టి మండపంలో వేదాశీర్వచనాల మధ్య స్వామి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు. ఆదిత్యుడి చిత్రపటాన్ని దేవదాయశాఖ కమిషనర్‌ రామచంద్ర మోహన్‌, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అందజేశారు. అనంతరం ఇంద్రపుష్కరిణి పనులను పరిశీలించారు.

  • కేంద్రమంత్రి నివాసంలో విందు

  • కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు నివాసంలో ఉపరాష్ట్రపతి మధ్యాహ్నం విందు చేశారు. ఆయనకు 50 పైగా వంటకాలను వడ్డించారు. ఎర్రన్న సతీమణి విజయలక్ష్మి, సోదరుడు కింజరాపు ప్రభాకరరావుతో కాసేపు మాట్లాడారు. ఉపరాష్ట్రపతికి కేంద్ర మంత్రి అరసవల్లి ఆదిత్యుని చిత్రపటంతో పాటు పొందూరు ఖద్దరు వస్త్రాలను అందజేశారు. అనంతరం ఉపరాష్ట్రపతి హెలీప్యాడ్‌ వద్దకు చేరుకుని విశాఖపట్నం పయనమయ్యారు. ఉప రాష్ట్రపతి పర్యటనను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పోలీస్‌ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో దేవదాయశాఖ కమిషనర్‌ రామచంద్ర మోహన్‌, సహాయ కమిషనర్‌ ప్రసాద్‌ పట్నాయక్‌, ఆలయ ఈవో టి.వాసుదేవరావు, ఎంపీడీవో ఎస్‌.శ్రీనివాసులు, తహసీల్దార్‌ ఎం.చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2026 | 12:22 AM