Share News

పేరుకే జలాశయం

ABN , Publish Date - Feb 07 , 2026 | 11:32 PM

Vennelavala Project సరుబుజ్జిలి మండలంలోని వెన్నెలవలస గిరిజన గ్రామం ఎగువ భాగంలో నిర్మించిన జలాశయం.. లక్ష్యం నీరుగారుతోంది. మెట్టు భూములకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ జలాశయాన్ని నిర్మించారు. కానీ నిర్వహణ సక్రమంగా లేక.. రైతులకు సాగునీరందని దుస్థితి నెలకొంది.

పేరుకే జలాశయం
వెన్నెలవలస జలాశయం

  • అభివృద్ధికి దూరంగా ‘వెన్నెలవలస’

  • శిథిలావస్థలో తూములు

  • పొలాలకు అందని సాగునీరు

  • ఆందోళనలో రైతులు

  • సరుబ్జుజలి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): సరుబుజ్జిలి మండలంలోని వెన్నెలవలస గిరిజన గ్రామం ఎగువ భాగంలో నిర్మించిన జలాశయం.. లక్ష్యం నీరుగారుతోంది. మెట్టు భూములకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ జలాశయాన్ని నిర్మించారు. కానీ నిర్వహణ సక్రమంగా లేక.. రైతులకు సాగునీరందని దుస్థితి నెలకొంది. ఐరోపా ఆర్థిక సాయంతో రూ.64లక్షల వ్యయంతో ఈ జలాశయం పనులకు 1987 ఆగస్టు 24న అప్పటి రాష్ట్ర భారీ, మధ్య తరహా నీటిపారుదలశాఖా మంత్రి కేఈ కృష్ణమూర్తి శంకుస్థాపన చేశారు. ఏడు కిలోమీటర్లు దూరంలో అటవీ ప్రాంతంలో కురిసిన వర్షపు నీటిని జలాశయానికి మళ్లించి పది నుంచి 12గ్రామాలకు సాగునీరందించాలన్నది ఈ పథకం ఉద్దేశం. వెన్నెలవలస, శ్రీరామవలస మధ్య కొండల నడుమ నాలుగు వందల మీటర్ల గట్టును నిర్మించారు. జలాశయానికి రెండు వైపులా కాలువలు నిర్మించారు. 1991 మార్చి 22న అప్పటి ముఖ్యమంత్రి నేదరుమల్లి జనార్దనరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. కానీ తర్వాత ప్రభుత్వాలు జలాశయం నిర్వహణను పట్టించుకోకపోవడంతో వృథాగా మారింది. వైసీపీ హయాంలో సాగునీటి వనరుల అభివృద్ధితోపాటు, అన్నదాతల సంక్షేమానికి కృషి చేస్తున్నట్టు ఆ పార్టీ నేతల ప్రకటనలు నీటిమూటలయ్యాయి. జలాశయం ఉన్నా ఫలితం లేకపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలాశయం గట్టు ముళ్లపొదలతో దర్శనమిస్తోందని, కల్వర్టు తూములు శిథిలావస్థకు చేరుకోవడంతో సాగునీరు గగనమవుతోందని వాపోతున్నారు. కూటమి ప్రభుత్వమైనా స్పందించి జలాశయం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు. సాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

  • అభివృద్ధికి కృషి

  • వెన్నెలవలస పరిధిలో ఉన్న జలాశయం అభివృద్ధికి కృషి చేస్తున్నాం. గతేడాది జలాశయంలో కొంతవరకు ఉపాధిహామీ పథకం ద్వారా మట్టిని తొలగించాం. జలాశయం అభివృద్ధికి రూ.50లక్షలు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైన వెంటనే పనులు చేపట్టి.. జలాశయాన్ని అభివృద్ధి చేయిస్తాం.

    - దాలయ్య, ఏఈ, ఇరిగేషన్‌

Updated Date - Feb 07 , 2026 | 11:32 PM