Share News

కూరగాయల సాగు.. లాభాలు బాగు

ABN , Publish Date - Sep 21 , 2026 | 12:09 AM

Farmers focus on alternative crops ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్‌ సాగు ఆశాజనకంగా లేదు. లోటు వర్షపాతం కారణంగా వరిసాగు ప్రశ్నార్థకమవుతోంది. కాలువలు, చెరువులు ఉన్న చోట వరిపైరు కొంత మెరుగ్గా ఉన్నా.. మిగిలిన ప్రాంతాల్లో ఎండిపోతోంది. దీంతో చాలామంది రైతులు ప్రత్యామ్నాయంగా కూరగాయల సాగుపై దృష్టి సారిస్తున్నారు.

కూరగాయల సాగు.. లాభాలు బాగు
తిడ్డిమిలో సుమారు 30 ఎకరాల్లో సాగు చేస్తున్న కూరగాయలు

  • ఎల్‌నినో ప్రభావంతో వరికి ప్రత్యామ్నాయ పంటలపై రైతుల దృష్టి

  • రాయితీపై పరికరాలు అందజేయాలని విజ్ఞప్తి

  • మెళియాపుట్టి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి):

  • మెళియాపుట్టి మండలం జలగలింగుపురం గ్రామానికి చెందిన నడిమింటి ఉమాపతి అనే రైతు గతంలో వరి పండించేవాడు. కానీ కూలీల కొరత, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ప్రత్యామ్నాయంగా కూరగాయల పంటపై దృష్టి సారించాడు. మూడేళ్ల నుంచి 50 సెంట్ల పొలంలో వంగ పంట సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉన్నా.. వంగ పంట మాత్రం ఆశాజనకంగానే ఉందని చెబుతున్నాడు.

  • పాతపట్నం మండలం తిడ్డిమి గ్రామానికి చెందిన గోర్లె తిరుపతిరావు అనే రైతు గత రెండేళ్ల నుంచి పందిరి చిక్కుడు, బెండ, బీరకాయలు వంటి కూరగాయలు పండిస్తున్నాడు. గతంలో వరి పండించగా.. వాతావరణ పరిస్థితులు అనుకూలించక నష్టం వాటిల్లేది. వరికి బదులుగా ఏడాది మూడు కూరగాయల పంటలు సాగు చేస్తుండడంతో ఖర్చులుపోనూ రూ.లక్షకు పైగా ఆదాయం వస్తోంది. ప్రభుత్వం రాయితీపై ఇంజన్లు కానీ, వ్యవసాయ పరికరాలు కానీ అందజేస్తే తమకు కొంత లబ్ధి చేకూరుతుందని తిరుపతిరావు పేర్కొంటున్నాడు.

  • ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్‌ సాగు ఆశాజనకంగా లేదు. లోటు వర్షపాతం కారణంగా వరిసాగు ప్రశ్నార్థకమవుతోంది. కాలువలు, చెరువులు ఉన్న చోట వరిపైరు కొంత మెరుగ్గా ఉన్నా.. మిగిలిన ప్రాంతాల్లో ఎండిపోతోంది. దీంతో చాలామంది రైతులు ప్రత్యామ్నాయంగా కూరగాయల సాగుపై దృష్టి సారిస్తున్నారు. పాతపట్నం మండలంలో తిడ్డిమి, సరాళి, పాతపట్నం వంటి గ్రామాల్లో రైతులు సుమారు 500 ఎకరాల్లో చిక్కుడు, బెండ, బీర, దొండ, వంకాయలు, సారికంద తదితర కూరగాయలు సాగు చేస్తున్నారు. హిరమండలం, కొత్తూరు, టెక్కలి, నందిగాం, కోటబొమ్మాళి, జలుమూరు, సారవకోట, మందస, మెళియాపుట్టి తదితర మండలాల్లో అధికంగా కూరగాయలు పండిస్తున్నారు. ఈ కూరగాయలను నరసన్నపేట, టెక్కలితోపాటు ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడిలో మార్కెట్‌కు తరలించి విక్రయిస్తున్నారు. లాభాలు పొందుతున్నారు. ఏడాదికి మూడు పంటలు సాగు చేస్తున్నామని, చీడపీడ, పురుగుల బెడద తక్కువగా ఉండడంతో కష్టానికి తగిన ఫలితం ఉంటోందని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తే.. మరికొంతమంది రైతులు కూరగాయల సాగుపై ఆసక్తి చూపే అవకాశం ఉంది. రాయితీపై పరికరాలు అందజేయాలని రైతులు కోరుతున్నారు.

  • ప్రోత్సాహం అందిస్తాం

  • పందిర్లు వేసి.. కూరగాయలు పండించే రైతులకు ప్రోత్సాహకంగా రూ.7.500 అందజేస్తాం. ఎల్‌నినో ప్రభావంతో రైతులకు కూరగాయలు పంటలు కలిసివస్తాయి. పందిళ్లు ద్వారా కూరగాయలు సాగుచేస్తే పురుగు దరిచేరదు. కాయలు పెరుగుదల కనిపిస్తుంది. మందులు చల్లినా ప్రతి అకుకు అందుతుంది. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నాం.

    - దుక్క శరత్‌రెడ్డి, అసిస్టెంట్‌ ఉద్యానవనశాఖ అధికారి, పాతపట్నం

Updated Date - Sep 21 , 2026 | 12:09 AM