Share News

వాసుదేవుడి బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - Feb 05 , 2026 | 11:49 PM

Brahmotsavams begin tomorrow జిల్లాలోని అతి ప్రాచీన ఆలయం.. సుందర శిల్పకళా సౌందర్యంతో అలరాలుతూ.. నిత్యం వేదపండితుల గోష్ఠులతో శోభించే శ్రీవాసుదేవ పెరుమాళ్‌ దేవాలయం.. బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది.

వాసుదేవుడి బ్రహ్మోత్సవాలు
మందసలో వాసుదేవ ఆలయం

  • మందసలో రేపటి నుంచి ప్రారంభం

  • వారం రోజుల పాటు వేడుకలు

  • హరిపురం, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అతి ప్రాచీన ఆలయం.. సుందర శిల్పకళా సౌందర్యంతో అలరాలుతూ.. నిత్యం వేదపండితుల గోష్ఠులతో శోభించే శ్రీవాసుదేవ పెరుమాళ్‌ దేవాలయం.. బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. జ్ఞానప్రదాతగా మందసలోని కొలువైన వాసుదేవునికి ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ నెల 7 నుంచి13 వరకు స్వామి 17వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

  • మందసలోని వాసుదేవాలయం 14వ శతాబ్దం నాటిదని చెబుతారు. కాలక్రమంలో శిథిలం కావడంతో మందస సంస్థానాన్ని పాలించిన రాజపుత్ర వంశీయుల్లో ఒకరైన లక్ష్మణ్‌ రాజమణి రాజదేవ్‌ దీన్ని 1744లో పునఃప్రతిష్ఠ చేశారు. నాటి నుంచి ఈ సంస్థానాన్ని పాలించిన వారంతా 1950 వరకు ఏటా తొమ్మిది రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఆ తర్వాత రాజులతోపాటు ఆలయాల వైభోగాల ప్రాభవమూ కోల్పోయింది. దీని పురోభివృద్ధికి శ్రీ త్రిదండి చినజీయరు స్వామి నడుంబిగించారు. జీయర్‌స్వామి 1988లో వేదశాంతి పేరిట శ్రీకూర్మం నుంచి పూరీ వరకు యాత్ర చేశారు. మార్గమధ్యలో మందసలోని తమ గురువు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్ద జీయరుస్వామి వేదాలు అభ్యసించిన వేదపాఠశాలైన వాసుదేవ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ దుస్థితి చూసి ఆవేదన చెంది.. పునరుద్ధరించాలని నిర్ణయించారు. దేవదాయ శాఖ అనుమతితో 2000 జూలై 7న దత్తత తీసుకున్నారు. శ్రీమద్‌ ఉభయవేదాంతచార్య పీఠం ద్వారా జీర్ణోద్ధారణ చేయించారు. అనంతరం జీయరు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా 2009లో ఆలయాన్ని ముందుండే ప్రాచీన శిల్పకళాకృతులతో ఆవిష్కరించారు. అప్పటి నుంచి మళ్లీ ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.

  • ఉత్సవ కార్యక్రమాలివే..

  • 7న ఉదయం 9గంటలకు శ్రీ ఆంజనేయస్వామి అభిషేక మహోత్సవం

  • 8న ఉదయం శ్రీ వాసుదేవ పెరుమాళ్‌ అభిషేక మహోత్సవం, సాయంత్రం విష్యక్సేన ఆరాధన, అంకురోపణ బ్రహ్మాత్సోవారంభము. సాంస్కృతిక కార్యక్రమాలు

  • 9న ఉదయం 9గంటలకు గరుడ పూజ, ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ట, హనుమాద్వాహన సేవ, శ్రీరామపూజ, సాయంత్రం శేషవాహన సేవ. సాంస్కతిక కార్యక్రమాలు

  • 10న ఉదయం కల్పవృక్ష వాహన సేవ, లక్ష్మీ పూజ, సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవం, హంస వాహనము, సాంస్కృతిక కార్యక్రమాలు

  • 11న ఉదయం 10 గంటలకు శ్రీ వాసుదేవ కళ్యాణమహోత్సవం, జీయర్‌స్వాముల మంగళ శాసనములు, సాయంత్రం గరుడువాహన సేవలో మందస పురవీధుల్లో స్వామి తిరువీధి ఉత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు

  • 12న ఉదయం పొన్నవాహన సేవ, శ్రీవెంకటేశ్వర స్వామి పూజ, సాయంత్రం తెప్పోత్సవం అశ్వవాహన సేవ, దోపిడీ ఉత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు

  • 13న ఉదయం రథోత్సవం, చక్రతీర్థం, అవబృదస్నానం, సాయంత్రం శ్రీ పుష్పయాగం, ద్వాదశారాధన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీటితోపాటు నిత్యకార్యక్రమాలు యాథావిధిగా జరగనున్నాయి.

  • ఈ ఏడాది ఉత్సవాలకు పది లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు సేవాసమితి సభ్యులు, స్థానిక యువకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడు రోజులపాటు వచ్చే భక్తులందరికీ అన్నప్రాసాదాలు సమకూర్చనున్నారు. సీఐ తిరుపతిరావు, ఎస్‌ఐ కె.క్రిష్ణప్రసాద్‌ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

  • ఎలా చేరుకోవాలంటే..

  • శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం వైపు వెళ్లే బస్సుల్లో ఎక్కి హరిపురంలో దిగాలి. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తే మందసలో వాసుదేవ ఆలయానికి చేరుకోవచ్చు. రైళ్లలో వచ్చేవారంతా పలాస రైల్వేస్టేషన్‌లో దిగి అక్కడనుంచి మందస ఆర్టీసీ బస్సులపై నేరుగా ఆలయానికి చేరుకోవచ్చు.

Updated Date - Feb 05 , 2026 | 11:49 PM