కరుణించని వరుణుడు
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:12 AM
Withered paddy seedlings ఖరీఫ్ సీజన్ వేళ.. ఎల్‌నినో ప్రభావం రైతులకు శాపంగా మారుతోంది. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో వరినాట్లు, వరిఎదలు ఎండిపోతుండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం
జిల్లాలో ఎండిపోతున్న వరినాట్లు
రైతులను వెంటాడుతున్న ఖరీఫ్ కష్టాలు
సాగునీటి కోసం పాట్లు
ఎచ్చెర్ల రూరల్/ ఎల్.ఎన్.పేట/ నందిగాం, జూలై 24(ఆంధ్రజ్యోతి):
ఖరీఫ్ సీజన్ వేళ.. ఎల్‌నినో ప్రభావం రైతులకు శాపంగా మారుతోంది. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో వరినాట్లు, వరిఎదలు ఎండిపోతుండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గత నెలలో అడపాదడపా వర్షాలు పడడంతో రైతులు దుక్కులు పూర్తిచేసుకున్నారు. ఎక్కువగా ఎద చల్లుకునేందుకు వీలుగా పొలాలను సిద్ధం చేశారు. ఇంకొందరు వరి విత్తనాలు వేసుకున్నారు. ఆకుమడులు సిద్ధమయ్యాయి. కానీ తర్వాత వరుణుడి జాడ లేదు. ఈ నేపథ్యంలో వరినారును కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. సమీపంలోని చెరువులు, బావుల్లో నీటిని బిందెలు, బకెట్లతో తెచ్చి.. వరినారును తడుపుతున్నారు. మరికొందరు మోటార్ల ద్వారా పైపులతో నీరు అందిస్తున్నారు. అయినా చాలాచోట్ల నారు ఎండిపోతుండడంతో ఆందోళన చెందుతున్నారు. వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు.
నందిగాం మండలం గొల్లూరు, నౌగాం, దిమ్మిడిజోల, రాంపురం, రధజనబొడ్డపాడు, దీనబంధుపురం, హర్షబాడ, బోరుభద్ర తదితర గ్రామాల్లో రైతులు బిందెలతో నీరు తెచ్చి.. నాట్లు తడుపుతున్నారు.
ఎల్.ఎన్.పేట మండలంలోని కొమ్మువలస, గొట్టిపల్లి, జాడుపేట, కోతిగార్లపాడు, కవిటి, డొంకలబడవంజ, కొత్తపేట, పూశాం, సరడాం, బొత్తాడసింగి తదితర గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వరి ఎదలు మొక్కదశలో చనిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎచ్చెర్ల మండలంలో నారాయణపురం కుడి కాలువ ద్వారా ఈ నెల 15న సాగునీరు విడిచిపెట్టారు. ప్రసుత్తం నవభారత్ వద్ద 9 అంగులాలు నీటి మట్టం ప్రవాహం మాత్రమే ఉంది. దీంతో శివారు భూములకు నీరందడం లేదు. ఫరీదుపేట, ఇబ్రహీంబాద్, పూడివలస, తమ్మినాయుడుపేట, కుశాలపురం, తోటపాలెం, కొత్తపేట, కొంగరాం, ముద్దాడ, బొంతలకోడూరు, పొన్నాడ, ధర్మవరం, భగీరథపురం ప్రాంతాల రైతులు తమకు సాగునీటి కష్టాలు తప్పడం లేదని వాపోతున్నారు. ఈ విషయమై జలవనరులశాఖ ఏఈ రాంబాబు వద్ద ప్రస్తావించగా.. వర్షాభావ పరిస్థితుల వల్ల నారాయణపురం కాలువ ద్వారా శివారు భూములకు సాగునీరు అందడం లేదని తెలిపారు. కొద్దిపాటి వర్షాలు కురిసినా.. సాగునీరు సజావుగా అందే అవకాశం ఉందని తెలిపారు.
జిల్లాలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. జూన్‌లో సాధారణ వర్షపాతం 139.9 మిల్లీమీటర్లు కాగా, 84.4 మిల్లీ మీటర్లు కురిసింది. జూలైలో 134.8 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటివరకు 49.4 పడింది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితి సమస్యగా మారుతోంది. వర్షాలు అనుకూలించకపోతే రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని ఎచ్చెర్ల వ్యవసాయాధికారి వి.రాజేశ్వరరావు పేర్కొన్నారు. స్వల్పకాలిక వరి వంగడాలు, తృణధాన్యాలు, అపరాలు వంటివి సాగు చేయాల్సి ఉంటుందని తెలిపారు.