Share News

కనిపించకుండా పోయి.. అడవిలో శవమై..

ABN , Publish Date - Oct 06 , 2026 | 11:49 PM

జలంత్రకోట-నువాగడ అటవీ ప్రాంతంలో (సోంపేట మండల సరిహద్దు) సోంపేట మండలం రామకృష్ణాపురానికి చెందిన సవర వెంకటరావు (25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కనిపించకుండా పోయి.. అడవిలో శవమై..
వెంకటరావు (ఫైల్‌)

కుళ్లిన దేహాన్ని గుర్తించిన పోలీసులు

ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

కంచిలి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): జలంత్రకోట-నువాగడ అటవీ ప్రాంతంలో (సోంపేట మండల సరిహద్దు) సోంపేట మండలం రామకృష్ణాపురానికి చెందిన సవర వెంకటరావు (25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంచిలి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మంగళవారం రాత్రి నువాగడకు చెందిన కొందరు వ్యక్తులు కుళ్లిన స్థితిలో దుర్వాసన వస్తున్న యువకుడి మృతదేహాన్ని చూసి కంచిలి పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్‌ఐ పి.పారినాయుడు, సిబ్బందితో కలిసి ఘటనా స్థలంలో యువకుడి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు సోంపేట మండలం రామకృష్ణాపురానికి చెందిన సవర లావణ్య, జమున చిన్న కుమారుడిగా గుర్తించారు. వెంకట రావు విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా వెంకటరావు ద్విచక్ర వాహనం నువాగడ ప్రాంతంలో కనిపించడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మూడు రోజుల నుంచి కుమారుడు కనిపిం చడం లేదని తల్లిదండ్రులు బారువ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. వెంకటరావు తరచూ స్నేహితులతో కలిసి అటవీ ప్రాంతంలో వేటకు వెళుతుండేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పారినాయుడు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - Oct 06 , 2026 | 11:49 PM